mt_logo

బీజేపోడు అబద్ధాలు చెబుతూ తిరుగుతుండు: సీఎం కేసీఆర్

దుబ్బాక నియోజకవర్గం నలుమూలల నుంచి తరలి వచ్చిన అశేష ప్రజానీకానికి సీఎం కేసీఆర్ నమస్కారాలు తెలియజేసారు. ‘దుబ్బాక’ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జననీ జన్మభూమిశ్చ.. స్వర్గాదపీ గరీయసీ’’.. పుట్టిన, చదువుకున్న గడ్డ కంటే గొప్పది ఏదీ ఉండదని చరిత్రలో చెప్పారు.నా హైస్కూల్ చదువు అంతా దుబ్బాకలోనే జరిగిందని తెలిపారు. దుబ్బాక పాఠశాల పెట్టిన చదువు, భిక్ష వల్లనే నేను ఈరోజు ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగానని తెలిపారు. నా చిన్నప్పటి నుంచి కూడా దుబ్బాకలో ఎప్పుడూ కత్తిపోట్లు చూడలేదని అన్నారు. ఆ సంస్కారం మన దగ్గర  లేదని స్పష్టం చేసారు. వానికంటే పెద్ద కత్తులు తెచ్చుకోలేమా? కానీ పద్ధతి కాదని ఊరుకున్నాం అని చెప్పారు. హరీశ్ రావు వెంటనే కొత్త ప్రభాకర్ రెడ్డిని హాస్పిటల్‌లో చేర్పించారు. ప్రభాకర్ రెడ్డి గడ్డకట్టిన రక్తమంతా తీసేసి, పేగును కూడా కొంత తొలగించారు.  పర్యటన ముగించుకొని వెంటనే నేను కూడా హాస్పిటల్‌కు వెళ్లాను. భగవంతుని దయ, ప్రభాకర్ రెడ్డి, మన అదృష్టంతో బతికి బయటపడ్డాడని పేర్కొన్నారు. 

బీజేపీకి వేస్తే మోరిలో వేసినట్లే

దుబ్బాకలో జరిగిన బై ఎలక్షన్స్‌లో నేను ప్రచారానికి రాలేదు. నేనొస్తే వొడిసేపోవు కథ. నోటికొచ్చిన వాగ్ధానాలు చేసిన మోసకారులు గెలిచిండ్రని ఆవేదన వ్యక్తం చేసారు. దేశంలో 150 కొత్త మెడికల్ కాలేజీలను పెడితే నేను వంద ఉత్తరాలు రాసిన తెలంగాణకు ఒక్కటంటే ఒక్కటి కూడా బీజేపీ ప్రభుత్వం ఇవ్వలేదు. చట్టమున్నా మన తెలంగాణకు నవోదయ పాఠశాలను కూడా బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదు. ఒక్క మెడికల్ కాలేజీ గానీ, ఒక్క నవోదయ పాఠశాల గానీ ఇవ్వని బీజేపీకి ఓట్లు ఎందుకెయ్యాలని ఆలోచించాడని అన్నారు. బీజేపీకి ఒక్క ఓటు కూడా వేయకూడదు. బీజేపీకి వేస్తే మోరిలో వేసినట్లే అని హెచ్చరించారు. బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తే అసైన్డ్ భూములను గుంజుకుంటుందని బీజేపోడు అబద్ధాలు చెబుతూ తిరుగుతున్నడు. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు మేలు చేస్తది తప్ప భూములను గుంజుకోదని తేల్చి చెప్పారు. 

నెల రోజుల్లో రెవెన్యూ డివిజన్‌

అసైన్డ్ భూములు గుంజుకునుడనేది పచ్చి అబద్ధం. వాళ్లకు పట్టాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. తప్పకుండా పట్టాలు ఇస్తాం అని మాట ఇచ్చారు. అనేక బాధలు అనుభవించి, ఇప్పుడిప్పుడే బాగుపడుతున్న సందర్భంలో పొరపాటున దుర్మార్గుల చేతికిచ్చి మళ్లీ బాధలు పడొద్దని సూచించారు. కొత్త ప్రభాకర్ రెడ్డి నాకు మంచి సన్నిహితుడు. నేనే దుబ్బాకలో అవసరముందని పోటీ చేయిస్తున్నానని వెల్లడించారు. ప్రభాకర్ రెడ్డిని గెలిపిస్తే నెల రోజుల్లో రెవెన్యూ డివిజన్‌తో పాటుగా, ఇతర కాలేజీలను మంజూరు చేస్తానని చెప్పారు. దుబ్బాక నియోజకవర్గంలో ఒక లక్షా డెబ్బై వేల ఎకరాలకు సాగునీళ్లు వస్తాయని తెలియజేస్తున్నాను. కాలువల పనులు జరుగుతున్నాయి. గతంలో కూడవెల్లి వాగు ఎండిపోయి నెత్తిమీద నీళ్లు చల్లుకుందామన్నా లేకుండె. ఇయ్యాల ఎండాకాలంలో కూడా మత్తెళ్లు దూకుతున్నది. హల్దీ వాగు, కూడవెల్లి వాగుల్లో ప్రాజెక్టుల నీళ్లను విడిస్తున్నాం. భూగర్భ జలాలు పెరిగి పంటలు బాగా పండుతున్నాయి. దుబ్బాక రింగ్ రోడ్డును కూడా సర్వే చేయించి మంజూరు చేస్తాం అని తెలిపారు.  కొత్త ప్రభాకర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించండి, మీ పనులన్నీ పరిష్కరించే బాధ్యతను నేను తీసుకుంటాని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు.