రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ధర్మపురి ప్రజా ఆశీర్వాద సభ వేదికపై నుంచి కీలక ప్రకటన చేశారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ధర్మపురిలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. ధర్మపురి నియోజకవర్గం మొత్తం ఎస్సీలకు దళిత బంధు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. హుజురాబాద్ నియోజకవర్గంలో అమలు చేసిన విధంగా ప్రతి ఎస్సీ కుటుంబానికి దళిత బంధు అమలు చేస్తామన్నారు. ధర్మపురిలో ప్రజా ఆశీర్వాద సభకు నియోజకవర్గం వ్యాప్తంగా దాదాపు లక్ష మంది తరలి వచ్చారు.
ఈ నియోజకవర్గం నుంచి ఇప్పటి వరకు ప్రాతినిధ్యం వహిస్తూ.. ఎప్పుడు ప్రజల బాగోగులు చూసుకుంటున్న కొప్పుల ఈశ్వర్‌ను మరోసారి భారీ మెజారిటీతో గెలిపించాలని సీఎం కేసీఆర్ కోరారు. కొప్పుల ఈశ్వర్ సౌమ్యంగా ఉంటూ.. నియోజకవర్గం అభివృద్ధి కోసం పరితపిస్తుంటారని చెప్పారు. నిత్యం ప్రజలతో కలిసి ఉండే నాయకులు చాలా అరుదుగా ఉంటారని.. వారిలో కొప్పుల ఈశ్వర్ ఉన్నారని చెప్పారు. ఇలాంటి నాయకుడిని కాపాడుకోవాలని సూచించారు.