ధరణి తీసేస్తే దళారులు, లంచావతారులు, బ్రోకర్ల రాజ్యం వస్తదని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. బోధన్ ‘ప్రజా ఆశీర్వాద సభ’లో సీఎం మాట్లాడుతూ.. భారతదేశంలో కుల, మతాల పేరుతో కొట్లాటలు, పంచాయతీలు ఇంకా జరుగుతూనే ఉన్నాయని అన్నారు. దేశంలో ఎన్నికలొచ్చాయంటే జూటా వాగ్ధానాలు.. అంతా గడబిడగా జరుగుతావుంటయ్.. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వకుండా దోఖా చేసి, మోసం చేసి టీఆర్ఎస్ పార్టీని చీల్చాలని చూసింది. మన ఎమ్మెల్యేలను కొని ఉద్యమాన్ని ఆగం చేసే పరిస్థితిని చేసింది కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు.
నిజాం రాజు కట్టిన నిజాంసాగర్ ప్రాజెక్ట్ తో లక్ష్మి ఉండే జిల్లాగా నిజామాబాద్ జిల్లా ఉండేది. సమైక్య రాష్ట్రంలో నిజాం సాగర్ ప్రాజెక్ట్ ను ఎండబెట్టారు. సింగూరు నుంచి నీళ్లు రావాలని అనేక ఉద్యమాలు చేసాం అని చెప్పారు. తెలంగాణ వచ్చాక పూర్వం నిజాంసాగర్‌కున్న కళ వచ్చింది. ఏడాది పొడుగునా నిజాం సాగర్ నిండే ఉంటదని హామీ ఇచ్చారు. 58 ఏండ్ల తర్వాత బీఆర్ఎస్ సాధించిన ఘనతనే నిజాం సాగర్ కు వచ్చిన నీటి కళ. బోధన్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి సుదర్శన్ రెడ్డి ఇరిగేషన్ మంత్రిగా ఉండి కూడా గతంలో చుక్క నీళ్లు తేలేదని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఒక్క పైసా కూడా తీసుకురాలేదు. గజం కాలువ కూడా మంచిగ చేయలేదని అన్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా షకీల్ గెలిచిన తర్వాత 72 కోట్ల రూపాయలతో కాలువలను బాగు చేయించాడని తెలిపారు. షకీల్ కట్టించిన చెక్ డ్యామ్ లతో భూగర్భజలాలు పెరిగాయని వెల్లడించారు. మహారాష్ట్ర కైనా వచ్చి పార్టీ పెట్టండి లేకుంటే మా ధర్మాబాద్ తాలూకానన్నా తెలంగాణలో కలుపుమని మహారాష్ట్ర ప్రజలు అడుగుతున్నరు. కర్ణాటక, మహారాష్ట్రలనే కాదు దేశంలోనే రైతు బంధు లేదు.
ఒక్క తెలంగాణలో తప్ప అని వివరించారు. దరఖాస్తు, దఫ్తర్ లేకుండా, ఒక్క రూపాయి లంచం ఇవ్వకుండా రైతు బంధు, రైతు బీమా, పంట కొనుగోళ్ల డబ్బులు ధరణి ద్వారానే డైరెక్ట్‌గా వస్తున్నయ్, ధరణి తీసేస్తే దళారులు, లంచావతారులు, బ్రోకర్ల రాజ్యం వస్తుందని హెచ్చరించారు. కాంగ్రెస్ గెలిస్తే ధరణి బంగాళాఖాతానికి.. రైతులు అరేబియా సముద్రానికి.. వేస్తారని పేర్కొన్నారు. షకీల్ ను భారీ మెజార్టీతో గెలిపించండి.. బోధన్ బాధ్యత నేను తీసుకుంటానని మాట ఇచ్చారు.