mt_logo

తెలంగాణ ఆత్మగౌరవానికి, అస్తిత్వానికి ప్రతీక బతుకమ్మ: సీఎం కేసీఆర్

బతుకమ్మ పండుగ ప్రారంభం (ఎంగిలిపూల బతుకమ్మ) ( అక్టోబర్ 14) సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రాష్ట్రంలోని  ఆడబిడ్డలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. పూలనే దేవతగా కొలిచే బతుకమ్మ పండుగ, తెలంగాణ ఆత్మగౌరవానికి, ప్రత్యేక సాంస్కృతిక అస్తిత్వానికి ప్రతీకగా నిలిచిందని సీఎం కేసీఆర్ అన్నారు. 

బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా జరుపుకుంటూ, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా గౌరవిస్తున్నదని అన్నారు.ఎంగిలి పూల బతుకమ్మతో మొదలై, ఉత్సవాల ముగింపు రోజైన సద్దుల బతుకమ్మ దాకా తొమ్మిది రోజుల పాటు ఆడబిడ్డలంతా ఆటా పాటలతో కోలాట చప్పట్లతో కలిసికట్టుగా జరుపుకునే బతుకమ్మ సంబురాలతో, తెలంగాణ వ్యాప్తంగా ప్రత్యేక పండుగ శోభ సంతరించుకుంటుందని సీఎం అన్నారు. 

ప్రకృతితో మమేకమైన తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల ఔన్నత్యాన్ని బతుకమ్మ పండుగ విశ్వ వ్యాప్తంగా చాటుతుందని సీఎం తెలిపారు. మహిళా సంక్షేమం అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాలు మహిళా సాధికారతను పెంపొందిస్తూ  దేశానికే ఆదర్శంగా నిలిచాయని సీఎం అన్నారు.  తెలంగాణ ప్రజలందరి బతుకుల్లో వెలుగులు నింపుతూ, మరింతగా సుఖ సంతోషాలతో జీవించేలా దీవించాలని ప్రకృతి మాతను సీఎం కేసీఆర్ ప్రార్థించారు.