mt_logo

పారిశ్రామిక స్వర్ణయుగంగా తెలంగాణ- సీఎం కేసీఆర్

ఈనెల 12న టీఎస్-ఐపాస్ ఆవిష్కరణ సందర్భంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు నూతన పారిశ్రామిక విధానం ప్రకటించిన విషయం తెలిసిందే. తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి దరఖాస్తు చేసుకున్న పారిశ్రామికవేత్తలకు ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం మధ్యాహ్నం సచివాలయంలో అనుమతి పత్రాలు అందజేశారు. మొత్తం 17 కంపెనీలకు అనుమతులు లభించాయి. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ రాష్ట్రం పారిశ్రామిక స్వర్ణయుగం వైపు పురోగమనం ప్రారంభించిందని, ఈ కార్యక్రమంతో నాంది పలుకుతున్నామని చెప్పారు. యువకులకు ఉపాధి అవకాశాలు పెంపొందించడంతో పాటు రాష్ట్రాన్ని ఆర్ధికంగా పటిష్ఠ పరిచే దిశగా సింగిల్ విండో పారిశ్రామిక విధానం అమల్లోకి తెచ్చామని అన్నారు.

తెలంగాణలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉందని, పరిశ్రమలకు కావాల్సిన భూమి, నీరు, కరెంట్ వంటి మౌలిక సదుపాయాలను ప్రభుత్వమే కల్పిస్తూ అనుమతులు కూడా సరళతరం చేసిన విషయాన్ని కేసీఆర్ గుర్తుచేశారు. పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చిన పారిశ్రామికవేత్తలను అభినందిస్తూ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని సీఎం పిలుపునిచ్చారు. తమ దరఖాస్తులను త్వరితగతిన పరిశీలించి అనుమతులు ఇచ్చినందుకు కంపెనీల ప్రతినిధులు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

అనంతరం పరిశ్రమల శాఖామంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు ఇది ఆరంభం మాత్రమేనని, రాష్ట్రానికి అనేక జాతీయ, అంతర్జాతీయ స్థాయి పరిశ్రమలు తెలంగాణకు రాబోతున్నాయని చెప్పారు. ఉద్యమ సమయంలో కొందరు తెలంగాణ రాష్ట్రం వస్తే కరెంట్ ఉండదు. పరిశ్రమలు తరలిపోతాయని చేసిన ప్రచారానికి సీఎం కేసీఆర్ ధీటైన సమాధానం చెప్పారని, పరిశ్రమల్లో వాడే పెద్ద ట్రాన్స్ ఫార్మర్లకు ఆర్డర్లు భారీగా పెరిగాయని పారిశ్రామికవేత్తలు చెప్పడం రాష్ట్రంలో పరిశ్రమల ఉధృతిని తెలుపుతుందని జూపల్లి అన్నారు.

ముఖ్యమంత్రి నేరుగా అనుమతి పత్రాలు ఇవ్వడంపై పారిశ్రామికవేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారని మంత్రి చెప్పారు. పారిశ్రామిక రంగంలో మేం గత 20 నుండి 30 ఏళ్లుగా ఉన్నాం.. ఇప్పటిదాకా ఏ రాష్ట్రప్రభుత్వం కూడా ఈ పద్ధతిలో మాకు అనుమతులు ఇవ్వలేదు. ఒక్క పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుండి అనుమతులు రావాలంటేనే ఆరునెలలు పట్టేది. విద్యుత్ శాఖ నుండి కూడా నెలల తరబడి టైం పట్టేది. కానీ మేము ఏ డిపార్ట్ మెంట్ కు పోకుండానే మమ్మల్నే పిలిపించి అనుమతులు ఇవ్వడం సంతోషంగా ఉందని పారిశ్రామికవేత్తలు చెప్పారని జూపల్లి పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *