వరంగల్ లోక్ సభ ఉపఎన్నికలో ఘనవిజయం సాధించిన టీఆర్ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ కు నిజామాబాద్ ఎంపీ కవిత అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఇది వరంగల్ ప్రజల విజయమని, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ విజయమని ప్రశంసించారు. ఆంధ్రా పార్టీలు పెద్ద ఎత్తున అసత్య ప్రచారాలు చేసినా వరంగల్ ప్రజలు నమ్మలేదని, అందుకే టీఆర్ఎస్ కు పట్టం కట్టారని కవిత అన్నారు.
వరంగల్ లో జరిగిన ఎన్నికల బహిరంగ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. తన పాలన బాగుంటేనే ఆశీర్వదించండని, నచ్చకుంటే శిక్షించండని పిలుపునిచ్చిన విషయాన్ని కవిత గుర్తుచేశారు. ఈ సందర్భంగా వరంగల్ ప్రజలకు ఎంపీ కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ గెలుపు తమకు మరింత బాధ్యతను పెంచిందని, తెలంగాణ ప్రయోజనాలను కాపాడే దిశగా తెలంగాణ సమాజం తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని ఆమె హామీ ఇచ్చారు. ఢిల్లీలో తెలంగాణ వాణిని బలంగా వినిపించేందుకు టీఆర్ఎస్ అమ్ములపొదిలోకి మరో అస్త్రం వచ్చి చేరిందని కవిత అన్నారు.