mt_logo

2000 ఆక్సిజన్ పడకల నిమ్స్‌ దశాబ్ది బ్లాక్‌ నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ శంకుస్థాపన

హైదరాబాద్, జూన్14:  దేశానికి ఆదర్శంగా నిలిచిన రాష్ట్ర వైద్యారోగ్య రంగాన్ని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దేంతవరకు రాష్ట్ర ప్రభుత్వ పట్టుదల  తపన కొనసాగుతూనే వుంటుందని ముఖ్యమంత్రి కే .చంద్రశేఖర్ స్పష్టం చేశారు. వైద్యారోగ్య రంగంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యాచరణ మిగిలిన రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందనీ, కరోనా వంటి కష్టకాలంలో రాష్ట్ర వైద్యారోగ్యశాఖ డాక్టర్లు నర్సులు సిబ్బంది ఉన్నతాధికారులు ప్రదర్శించిన పనితీరు గొప్పదని సీఎం కొనియాడారు. ఎంత చేసినా వైద్యశాఖకు పలు దిక్కుల నుండి విమర్శలు వస్తుంటాయని ఈ విషయాన్ని గమనించి ప్రజావైద్యం దిశగా ఈ శాఖ చేస్తున్న కృషిని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకుపోవాలని ఆ దిశగా ప్రజా సంబంధాల వ్యవస్థను మరింతగా మెరుగుపరచుకొని ప్లానింగ్ చేసుకోవాలని సీఎం సూచించారు.

రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా బుధవారం నాడు జరిగిన వైద్యారోగ్య దినోత్సవం సందర్భంగా …ప్రముఖ ప్రభుత్వ దవాఖాన నిమ్స్’ విస్తరణ పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. ఇందులో భాగంగా నిర్మించనున్న ‘దశాబ్ధి వైద్య భవనా’ల్లో నూతనంగా 2000 ఆక్సిజన్ పడకలు అందుబాటులోకి రానున్నాయి.  అత్యంత అధునాతన ఆపరేషన్ థియేటర్లు సహా వర్తమాన వైద్య రంగంలో ప్రజల వైద్యసేవలకు అవసరమయ్యే పలు రకాల వైద్య సేవలు  అందనున్నాయి.