- గజ్వేల్ నియోజకవర్గంలో పదివేల మందికి గృహలక్ష్మి ఇండ్లు సాంక్షన్ చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్.
- రెండు రోజుల్లో లబ్ధిదారుల ఖాతాలో డబ్బులు జమ చేయబడతాయి.
- పీసీసీ అంటే పేమెంట్ కలెక్షన్ సెంటర్.
గజ్వేల్ నియోజకవర్గంలో నూతనంగా నిర్మించిన వంద పడకల మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని రాష్ట్ర ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గజ్వేల్ నియోజకవర్గంలో ఈ ఒక్కరోజు 530 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు.
300 కోట్లతో నిర్మించుకున్న ఔటర్ రింగ్ రోడ్డుని ప్రారంభించుకున్నాం, 150 కోట్లతో గజ్వేల్ మున్సిపాలిటీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను ప్రారంభించుకోవడం జరిగిందన్నారు. అదేవిధంగా 36 కోట్లతో వంద పడకల మాతా శిశు ఆసుపత్రిని ప్రారంభించుకోవడం జరిగింది. ఈ ఆస్పత్రి ద్వారా గర్భిణీలకు, చిన్న పిల్లలకు మెరుగైన వైద్యం అందించబడుతుందని తెలిపారు. కేసీఆర్ గజ్వేల్ ముఖ్యమంత్రి కావడం మన అందరి అదృష్టమన్నారు. కేసీఆర్ గజ్వేల్ నుంచి ప్రాతినిధ్యం వహించాడు కాబట్టే ఈ అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని స్పష్టం చేసారు. గజ్వేల్ ప్రాంతానికి గతంలో పిల్లని ఇవ్వాలంటే భయపడేవారు నీళ్లు మోపిస్తారేమో అని, ఈరోజు పొయ్యి కాడికి మంచినీళ్లు అందించిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. దేశంలో గజ్వేల్ ఆదర్శ నియోజకవర్గంగా నిలిచింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి చూసి అధ్యయనం చేసే స్థాయికి గజ్వేల్ చేరిందన్నారు. పనిచేసే కేసీఆర్‌ను కడుపులో పెట్టుకొని కాపాడుకుంటే కేసీఆర్ మన గౌరవం పెంచుతాడు మనల్ని కాపాడుకుంటారని తెలిపారు.
కేసీఆర్ అంటే ప్రగతి కాంగ్రెస్ అంటే అధోగతి
గజ్వేల్ నియోజకవర్గ ప్రజలకు శుభవార్త తెలిపిన ముఖ్యమంత్రి కేసీఆర్ అని పేర్కొన్నారు. గజ్వేల్‌లో పదివేల మందికి గృహలక్ష్మి ఇండ్లు సాంక్షన్ చేశాడు ముఖ్యమంత్రి కేసీఆర్, రెండు రోజుల్లో లబ్ధిదారుల ఖాతాలో డబ్బులు జమ చేయబడతాయని తెలిపారు. కేసీఆర్ ఒక నమ్మకం కేసీఆర్ మేనిఫెస్టోలో చెప్పిన చెప్పని హామీలన్నీ నెరవేర్చారు. కాంగ్రెస్ అంటే ఒక నాటకం నాటకాలు ఆడే కాంగ్రెస్ పార్టీని నమ్మితే మనం మోసపోతాం. పీసీసీ అంటే పేమెంట్ కలెక్షన్ సెంటర్ అని అన్నారు. కాంగ్రెస్ అంటే ఒక కమిషన్. కేసీఆర్ అంటే ప్రగతి కాంగ్రెస్ అంటే అధోగతి. తెలంగాణ రాష్ట్రం సస్యమలంగా ఉండాలన్నా, మరింత అభివృద్ధిలో గజ్వేల్ కొనసాగాలన్నా మన ముఖ్యమంత్రి కేసీఆర్‌ను గెలిపించుకోవాలని తెలిపారు.