mt_logo

తెలంగాణలో భారీగా పెరిగిన పశు సంపద

•తెలంగాణ రాష్ట్రంలో వ్య‌వ‌సాయ అనుబంధ ప‌రిశ్ర‌మ‌ల‌కు ప్రాధాన్య‌త‌

•మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామీణ భారతం… గ్రామ స్వరాజ్యం… ఆశయాలను గత తొమ్మిది ఏళ్లలో తెలంగాణ ప్రభుత్వం సాకారం చేసింది.

•2013-14 సం.లో రూ.24,878 కోట్ల విలువగల పశు సంపద ఉండగా, 2021-22 సంవత్సరం నాటికి రూ.94,400 కోట్ల పశు విలువగల సంపద గణనీయంగా పెరిగింది.

హైదరాబాద్:  మానవ శ్రేయస్సు పశువుల సంపద తో ముడిపడి ఉంది. ప్రజల సామాజిక,ఆర్థిక, సాంస్కృతిక జీవనంలో పశువులు కీలక పాత్ర పోషిస్తాయి. పెద్ద సంఖ్యలో పేద, చిన్న రైతులు వారి జీవనోపాధికి పెద్ద సంఖ్యలో పశువులను పెంచుతున్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి పశుసంపద రంగాన్ని లాభదాయక రంగంగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకుని ప్రభుత్వం కార్యాచరణ అమలు చేస్తున్నది. 

తెలంగాణ  రాష్ట్రంలో 42.32 లక్షల ఆవులు,  42.26 లక్షల గేదెలు, 190.63 లక్షల గొర్రెలు, 49.35 లక్షల మేకలు, 1.78 లక్షల పందులు, 799.99 లక్షల కోళ్ళతో అపారామైన పశుసంపదను కలిగి ఉన్నది. రాష్ట్రంలో 25.82 లక్షల కుటుంబాలు పశు సంపదను కలిగి పశుపోషణ, పశుపోషణ సంబంధిత ఉపాధిని పొందుతున్నాయి. అందులో 22.45 లక్షల కుటుంబాలు పాడి పశువుల పెంపకంపై,  7.15 లక్షల కుటుంబాలు గొర్రెలు, మేకల  పెంపకం పై ఆధారపడి జీవిస్తున్నారు.  

 గొర్రెల పంపిణీ పథకం : 

రాష్ట్ర ప్రభుత్వం గొర్రెల పంపిణీ కార్యక్రమం ద్వారా జూలై 2022 నాటికి 3.94 లక్షల యూనిట్లు (82.64 లక్షల గొర్రెలు) పంపిణీ చేసింది. వీటి ద్వారా మరో 1 కోటి 32 లక్షల గొర్రె పిల్లలు జన్మించాయి. మే 2023 నాటికి ప్రభుత్వం ఈ పథకానికి రు. 5001.53 కోట్లు ఖర్చు చేసింది. రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ఇటీవల చేపట్టారు. 

లీటర్ పాలకు రూ 4./- ప్రోత్సాహకం : 

తెలంగాణ ప్రభుత్వం 2014 నుండి పాడి రైతులకు లీటర్ పాలకు రూ. 4/- చొప్పున

ప్రోత్సహకము అందించుచున్నది. ఈ పథకం ద్వారా 2,95,785 పాడి రైతులు లబ్ధి పొందుతున్నారు. ఈ పథకం క్రింద, విజయ డైరీ, కరీంనగర్ డైరీ, ముల్కనూర్, నార్ముల్ డెయిరీలకు చెందిన రైతులు లబ్ధి పొందుతున్నారు. ఈ ప్రోత్సాహకాల ద్వారా ప్రభుత్వం ప్రతి ఏటా రూ. 100.00 కోట్లు ఖర్చు చేస్తున్నది. ఇప్పటి వరకు ప్రభుత్వం ఈ పథకానికి రూ. 361.45 కోట్లు వెచ్చించింది.   

సంచార పశు వైద్య శాలలు:

రాష్ట్రంలో 100 సంచార పశు వైద్యశాలలు రైతు ముంగిట ఉచితంగా పశు వైద్య సేవలు అందించుచున్నవి. ఈ కార్యక్రమంను ముఖ్యమంత్రివర్యులు కే.చంద్రశేఖర్ రావు  2017 సంవత్సరంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వం ప్రతి సంవత్సరం రూ.30 కోట్లు ఖర్చు చేస్తున్నది. ఇప్పటి వరకు ప్రభుత్వం ఈ పథకానికి రు. 136 కోట్లు వెచ్చించింది. ఇప్పటివరకు ఈ కార్యక్రమం ద్వారా 29 లక్షల పశువులకు ఉచితంగా వైద్య సేవలందించడం జరిగింది. 

గొర్రెలలో నట్టల నివారణ కార్యక్రమం:

తెలంగాణ రాష్ట్రం గొర్రెల సంపదలో దేశంలో మొదటి స్థానంలో ఉంది. ప్రతి సంవత్సరం గొర్రెలకు మరియు మేకలకు మూడు పర్యాయములు  ఉచితంగా నట్టల మందు తాప బడుతుంది. నట్టల నివారణ ద్వారా గొర్రెలలో వ్యాధి నిరోధక శక్తి పెరిగి అదనపు లాభం చేకూరుతుంది. ఈ కార్యక్రమానికి ప్రభుత్వం ప్రతి సంవత్సరం రూ. 10.00 కోట్లు ఖర్చు చేస్తున్నది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 2 లక్షల గొర్రెల కాపరులు లబ్ది పొందుతున్నారు. 

తెలంగాణ రాష్ట్రంలో పశు సంపద వృద్ధి గణనీయంగా ఉంది….

-రాష్ట్రంలో గొర్రెల సంఖ్య 2012లో: కోటి 28 లక్షల ఉండగా 2020 నాటికి కోటి 91 లక్షలకు పెరిగింది.

-పశు సంపద విలువ 2013-14లో రూ. 24,878 కోట్లు ఉండగా 2021-22 నాటికి ఒక లక్ష 3 వేల 895 కోట్లు పెరిగింది. ( పెరుగుదల రూ. 79,017 కోట్లు, పెరిగిన శాతం 417.61)

-గొర్రెల పెంపకందారుల సొసైటీలు ….2013-14 సంవత్సరంలో రాష్ట్రంలో 2,012 సొసైటీలు ఉండగా 2020-21 నాటికి 8,392కు పెరిగాయి. సొసైటీల సభ్యులు 2013-14లో 1,30,000 ఉండగా 2020-21 నాటికి 7,92,111 పెరిగింది.

-రాష్ట్రంలో పాల ఉత్పత్తి ….2013-14లో రాష్ట్రంలో 42.07 లక్షల టన్నుల పాల ఉత్పత్తి ఉండగా 2022-23 నాటికి 58.55 లక్షల టన్నులకు పాల ఉత్పత్తి పెరిగింది.  రాష్ట్రంలో మాంసం ఉత్పత్తి 2013-14 లో 4.46 లక్షల టన్నులు ఉండగా 2022-23 నాటికి 10.81 లక్షల టన్నులు పెరిగింది. రాష్ట్రంలో మత్స్య సంపద ఉత్పత్తి (చేపలు+రొయ్యలు కలిపి) 2013-14లో 2,49,633 టన్నులు ఉండగా 2022-23 నాటికి 4,38,469 టన్నులు పెరిగింది.

-2014-15 సంవత్సరం నుండి 2022-23 వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.348.93 కోట్ల

-చేపపిల్లలను మరియు రూ.64.73 కోట్ల రొయ్య పిల్లలను 23,748 చెరువులలో, జలాశయాలలో విడుదల చేశారు.   

-రాష్ట్రంలో గుడ్ల ఉత్పత్తి  2013-14 లో 1,006.06 కోట్లు ఉండగా 2021-22 నాటికి 1767.06 కోట్లు పెరిగింది.

బెస్త, ముదిరాజుల ఉపాధి కోసం ఉచితంగా చేపలు, రొయ్య పిల్లల పంపిణీ, చెరువుల్లో చేపల పెంపకం:

తెలంగాణ రాష్ట్రంలో మత్స్య పరిశ్రమ అభివృద్ధి చెందడానికి, ఈ రంగంపై ఆధారపడిన దాదాపు 4 లక్షల మంది మత్స్యకారులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా  ఉపాధి లభించేలా ప్రభుత్వం వారికి ఉచితంగా 100 శాతం సబ్సిడీతో చేప పిల్లలనిస్తూ, చెరువుల్లో పెంచుతున్నది.  చేపల పంపిణీ కార్యక్రమాన్ని 3 అక్టోబర్, 2016 న ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2014 నుంచి 2022-2023 నాటికి పదేళ్ళలో రూ. 348.93 కోట్ల విలువైన 414.13 కోట్ల చేప పిల్లలను, రూ.64.73 కోట్ల విలువైన 28.34 కోట్ల రొయ్య పిల్లలను జలాశయాలు, చెరువుల్లో పెంచడం జరిగింది. 2017 లో మత్స్యకారుని సగటు ఆదాయం రూ.48 వేలు ఉంటే అది 2022 డిసెంబర్ నాటికి రెట్టింపైంది.