mt_logo

కాంగ్రెస్ ప్రభుత్వం, పోలీసుల అత్యుత్సాహంపై డీజీపీకి ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్

రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపైన.. ముఖ్యంగా సోషల్ మీడియా కార్యకర్తలపైన కాంగ్రెస్ ప్రభుత్వం మరియు పోలీసులు అత్యుత్సాహం చూపెడుతున్నారని, అక్రమ కేసుల పెడుతున్నారని డీజీపీకి ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ పార్టీ.

డీజీపీకి బీఆర్ఎస్ పార్టీ చేసిన ఫిర్యాదు యధాతథంగా 👇

గౌరవనీయులైన డీజీపీ గారు,

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల కాలంలోనే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ప్రవర్తిస్తోంది. పోలీసులను అడ్డం పెట్టుకొని ప్రతిపక్ష బీఆర్ఎస్‌ను ఇబ్బందులకు గురిచేసే కార్యక్రమాల్ని ప్రోత్సహిస్తోంది. ప్రభుత్వ విధానాలను, పనితీరు ప్రశ్నించిన వారిపై అసహనంతో ఊగిపోతోంది. ముఖ్యంగా ప్రతిపక్ష బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వ విధానాలను విమర్శిస్తే సహించకలేకపోంది.

సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పోస్ట్‌లు పెడితే పోలీసులు అత్యుత్సాహంతో కేసులు పెడుతున్నారు. వారిని భయాంభ్రాంతులకు గురిచేస్తున్నారు. బైండవర్లు, కేసులు, ఫోన్లలో బెదిరింపులకు దిగుతూ బీఆర్ఎస్ కార్యకర్తల మనో ధైర్యాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తే చాలు చట్టాన్ని కూడా లెక్క చేయకుండా కేసులు పెడుతున్నారు. పోలీసు అధికారులు కూడా ప్రభుత్వానికి వంత పాడుతూ అత్యుత్సాహం ప్రదర్శిస్తూ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై జులుం ప్రదర్శిస్తున్నారు.

ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఇలాంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదు. మా పార్టీకి చెందిన సల్వాజీ మాధవ రావు అనే ఉద్యమకారుడు కరీంనగర్ జిల్లా ధర్మపురి కాంగ్రెస్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ మీద వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టింగులు పెడుతున్నాడని సొగాలి తిరుపతి అనే రౌడీ షీటర్ ద్వారా హత్యా యత్నం చేయించాడు ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్. పైగా అతని పైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి అతన్నిమానసికంగా వేధింపులకు గురిచేస్తున్నారు. పోలీసుల తీరుపై యావత్ తెలంగాణ సమాజం ఆగ్రహంగా ఉంది. ప్రభుత్వాలు శాశ్వతం కాదు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న సరే పోలీసులు ప్రజాస్వామ్యాన్ని, బావ ప్రకటన స్వేచ్ఛను పరిరక్షించే విధంగా పనిచేయాలి.

కానీ కొంతమంది పోలీసులు మాత్రం అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేల అడుగులకు మడుగులు ఒత్తుతూ వారి మెప్పు కోసం పనిచేస్తున్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై కేసులు, బెదిరింపులు, అరెస్ట్‌లంటూ భయాబ్రాంతులకు గురి చేస్తూ ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ నేతలు చెప్పినట్లు జీ హుజూర్ అంటున్నారు.

శాంతి భద్రతలను పరిరక్షించే పోలీసులే ఈ విధంగా ప్రవర్తించటం ఆశ్చర్యం కలిగిస్తోంది. బీఆర్ఎస్ పార్టీ కూడా గత పదేళ్ల పాటు అధికారంలో ఉంది. ఆ సమయంలో ఎప్పుడూ కూడా ప్రతిపక్షాల గొంతునొక్కేందుకు ప్రయత్నించలే. పోలీసులను ఉపయోగించుకొని ప్రశ్నించే వారిపై దాడి చేసే ప్రయత్నం చేయలే. ప్రశ్నించే వారికి, ప్రతిపక్షాలకు పూర్తి స్వేఛ్చనిచ్చాం. రాజకీయ ప్రతీకార దాడులు, విమర్శలు చేస్తే తప్పుడు కేసులు పెట్టే ప్రయత్నం చేయలే. ముఖ్యంగా పోలీసులకు పూరి స్వేచ్చనిచ్చి లా అండ్ ఆర్డర్ అదుపులో ఉంచేందుకు ప్రయత్నించాం.

పోలీసుల ద్వారా ప్రతిపక్షాలను అదుపులో పెట్టుకునే ప్రయత్నం చేయలేదు. ఈ కారణంగా గత పదేళ్లలో ప్రతిపక్షాల పై తప్పుడు కేసులు, దాడుల సంఘటనలే లేవు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారిలో వచ్చిన నాలుగు నెలల్లోనే బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు, కేసులు, హత్యాప్రయత్నాలంటూ రోజుకు వార్తలు చూడాల్సి వస్తోంది. దురదృష్టమేమిటంటే అధికార కాంగ్రెస్ పార్టీ నేతలకు పోలీసులు వంత పాడుతూ వారికి తొత్తులుగా వ్యహరించటం దురదృష్టకరం.
ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా పారదర్శకంగా పోలీసులు పనిచేయాలని బీఆర్ఎస్ పార్టీ తరుపున డిమాండ్ చేస్తున్నాం.

మా పార్టీ కార్యకర్త సల్వాజీ మాధవ రావు పై పెట్టిన కేసును ఎత్తివేయాలని కోరుతున్నాం. అదే విధంగా బీఆర్ఎస్ కార్యకర్తలపై పెడుతున్న కేసులకు సంబంధించి నిష్పక్షికంగా పోలీసు ఉన్నతాధికారులతో విచారణ కమిటీ వేయాలని డిమాండ్ చేస్తున్నాం. అదే విధంగా కాంగ్రెస్ నాయకుల చెప్పినట్లుగా పనిచేస్తున్న పోలీసులను మందలించి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే విధంగా పనిచేయాలని సూచించాలని కోరుతున్నాం.