mt_logo

హైడ్రా బాధితులకు అండగా బీఆర్ఎస్!

కాంగ్రెస్ ప్రభుత్వ అనాలోచిత చర్య హైడ్రా వల్ల నష్టపోతున్న ప్రజలు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్ తలుపు తడుతున్నారు.

ఈరోజు ఉదయం నుండే హైడ్రా, మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ బాధితులు తెలంగాణ భవన్‌కు వచ్చి బీఆర్ఎస్ నాయకులతో తమ బాధలు చెప్పుకున్నారు.. ఈ కష్ట సమయంలో తమకి అండగా ఉండాలని కోరారు.

కాంగ్రెస్ ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా ఇప్పటికే కొందరి ఇళ్లను కూల్చేయడం, మరికొందరివి కూల్చేయడానికి సిద్ధమవడంతో.. నిస్సహాయ స్థితిలో ఉన్న ప్రజలు తమని హైడ్రా గండం నుండి గట్టెక్కించాలని, ప్రభుత్వంపై పోరాటంలో తమకి మద్దతివ్వాలని వేడుకున్నారు.

తెలంగాణ భవన్‌కు భారీ ఎత్తున హైడ్రా బాధిత కుటుంబాలు తరలివస్తున్న వార్త తెలుసుకున్న బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి హుటాహుటిన చేరుకుని వారిని పరామర్శించారు, అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర జ్వరంతో ఉండటంతో బాధితులను కలవలేకపోయారు.

బాధితులు వారి గోడును వెల్లబుచ్చుకుంటూ కన్నీటి పర్యంతం అవ్వడం చూసి.. బీఆర్ఎస్ నాయకులు కంటతడి పెట్టారు. తాము ఉంటున్న ఇళ్లకు పైసా పైసా కూడబెట్టి పదేళ్లుగా లోన్ కడుతున్నామని.. ఇప్పుడు తమని రోడ్డు మీద పడేస్తే దిక్కెవరని బాధిత మహిళలు వాపోయారు.

హైడ్రా పేరు వినబడితేనే తమకు కంటి మీద కునుకు ఉండటం లేదని.. దశాబ్దాల క్రితం తాము ఇండ్లు కొన్నప్పుడు, అనుమతులు ఇచ్చినప్పుడు లేని రూల్స్ ఇప్పుడెలా వచ్చాయని బాధితులు ప్రశ్నించారు.. తమకి న్యాయం చేయాలనలో కోరారు.

వారి కష్టాలు విని చలించిన బీఆర్ఎస్ నాయకులు.. ఏ సమయంలో ఎలాంటి అవసరం వచ్చినా తెలంగాణ భవన్ తలుపులు 24 గంటలు తెరిచి ఉంటాయి అని.. బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ అందుబాటులో ఉంటుందని స్పష్టం చేశారు.

అదే విధంగా.. బాధితులకు అవసరమైన లీగల్ సహాయాన్ని కూడా ఉచితంగా అందిస్తామని కూడా హరీష్ రావు ప్రకటించారు. బాధిత ప్రజలకు రక్షణ కవచంగా నిలబడతామని.. ధైర్యం కోల్పోవద్దని హరీష్ రావు భరోసానిచ్చారు.

ఈ నేపథ్యంలో.. కొన్ని నెలల క్రితం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కొన్ని రోజుల్లో బీఆర్ఎస్ నాయకుల కోసం ప్రజలు టార్చ్ లైట్ పట్టుకొని వెతుక్కుంటూ వస్తారని గతంలో కేసీఆర్ అన్న మాటలను ఇప్పుడు నెటిజెన్లు గుర్తుచేసుకుంటున్నారు.

అన్యాయంగా జరుగుతున్న ఈ కూల్చివేతలను దృష్టిలో పెట్టుకొని.. త్వరలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన హైదరాబాద్ ఎమ్మెల్యేలతో కలిసి కార్యాచరణ ప్రకటిస్తామని ఈ సందర్భంగా హరీష్ రావు తెలిపారు.