నారాయణ్‌ఖేడ్‌లో జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో మాజీ మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇటు నారాయణ్‌ఖేడ్‌లో అటు రాష్ట్రంలో హ్యాట్రిక్ విజయాన్ని కొద్ది తేడాతో మిస్ అయ్యాం.. ప్రజాస్వామ్యంలో విజయాలు, పరాజయాలు.. పాలకపక్ష పాత్ర, ప్రతిపక్ష పాత్రలు ఉంటాయి. అధికారం శాశ్వతం కానట్టే ఓటమి కూడా శాశ్వతం కాదు అనేది కార్యకర్తలు ప్రతి నిత్యం మదిలో ఉంచుకోవాలి అని అన్నారు.
నారాయణ్‌ఖేడ్‌లో కాంగ్రెస్ హయంలో ఏ పనులు జరిగాయో పదేళ్ల బీఆర్ఎస్ శాసనసభ్యుడిగా ఉండి ఏ పనులు చేశారో మీరు చూశార.. నారాయణ్‌ఖేడ్‌ను నిజాయితీగా నిబద్దతతో అభివృద్ధి చేశాం అని తెలిపారు
నీళ్లు లేని చోట నీళ్లిచ్చాము, కరెంటు లేని చోటుకు కరెంటు, రోడ్లు బాగు చేసుకున్నాం.. ప్రజలకు మన కష్టం విలువ మున్ముందు తెలుస్తుంది.. పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా ఆలోచించి ఓటు వేయాలి. అసెంబ్లీ ఎన్నికల హామీలను తుంగలో తొక్కిన కాంగ్రెస్‌ను ఓడించి గుణపాఠం నేర్పాలి అని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ ఓటేస్తే మోరీలో వేసినట్టే… రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తానని మోసం చేసినా నాకు ఓటేసిన్రు అంటాడు రేవంత్ రెడ్డి.. తులం బంగారం, పింఛన్ పెంపు, మహిళలకు 2500, వడ్లకు బోనస్ ఎగ్గొట్టినా జనం నాకు ఓట్లేసిన్రు అని చెప్పుకుంటాడు అని హరీష్ రావు అన్నారు.
కరోనా సమయంలో ఎన్నో ఇబ్బందులు ఎదురైనా కేసీఆర్ సంక్షేమ పథకాలను ఆపలేదు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉద్యోగుల జీతాలను ఆపి మరీ రైతుబంధు ఇచ్చాడు. ఆరుగాలం కష్టపడి దేశానికి అన్నం పెట్టే రైతులు తనకు లాస్ట్, ఏసీ రూంలలో కూర్చున్నోళ్లు తనకు ఫస్ట్ అంటున్నాడు రేవంత్ అని అన్నారు.
కరోనా విపత్తులో సైతం రైతులను కడుపులో పెట్టుకుని కాపాడుకున్న కేసీఆర్‌ను గెలిపించాలా వద్దా మీరే ఆలోచించండి? బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండుంటే ఒక్క నారాయణ్‌ఖేడ్‌లోనే రైతుబంధు కింద రూ. 220 కోట్ల నిధులు వచ్చేవి. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు అయిపోయాక అన్ని పథకాలను కోతలు పెట్టే పనిలో ఉన్నాడు అని తెలిపారు.
కాంగ్రెస్ నేతల మాటలు, చర్యలు చూస్తుంటే బీఆర్ఎస్ కార్యకర్తల గుండెలు రగిలిపోతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించి కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలి. మనం గెలిచి కాంగ్రెస్ మెడలు వంచి అసెంబ్లీ ఎన్నికల హామీలను అమలు చేయించాలి. మనం చేసింది చెప్పాలి, కాంగ్రెస్ చేయనిది చెప్పాలి అని హరీష్ రావు అన్నారు.
రేవంత్ డిసెంబర్ 9న సీఎంగా ప్రమాణం చేసి రుణమాఫీపై తొలి సంతకం చేస్తానని చెప్పాడు. కానీ రెండు రోజులు ముందే ప్రమాణ చేసి హామీని ఎగ్గొట్టాడు. అధికారానికి రెండు రోజుల ముందుంటాడు, హామీలకు రెండేళ్లు వెనక అంటున్నాడు అని అన్నారు.
మోడీని బడే భాయ్ అన్నాడు రేవంత్ రెడ్డి. మోదీ బడే భాయ్, రేవంత్ చోటా భాయ్. ఇద్దరూ ఒకటే. తను ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చానని రేవంత్ చెప్పుకుంటున్నాడు. బీఆర్ఎస్ సెక్యులర్ పార్టీ. ముస్లిం మైనారిటీలు ఆలోచించాలి.. హామీలు అమలు చేయకుండా మోసం చేశాను కాబట్టే ప్రజలు ఓడగొట్టారని రేవంత్‌కు అర్థం కావాలి అని సూచించారు.
రాహుల్ గాంధీ ప్రధాని అయ్యే అవకాశం ఉంటే మోదీ ఆశీర్వాదం ఎందుకు కోరుకుంటున్నావు రేవంత్? కాంగ్రెస్ ఓడిపోతుందని, రాహుల్ గాంధీ ప్రధాని కాబోడని నువ్వే చెప్పకనే చెప్పావు. ఢిల్లీలోని గెలవని పార్టీకి తెలంగాణ ప్రజలు ఎందుకు ఓటేయాలి. కాంగ్రెస్‌కు ఓటేస్తే మోరీలో వేసినట్టే అని స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ గెలవాలె. తెలంగాణ నిలవాలె. బీఆర్ఎస్ గెలిస్తేనే మన రాష్ట్ర ప్రయోజనాలు నెరవేరతాయి. తెలంగాణ గొంతు గట్టిగా వినిపిస్తుంది. ఢిల్లీలో కొట్లాడే వాళ్లు ఉంటేనే తెలంగాణకు న్యాయం జరుగుతుంది..తెలంగాణ కోసం పుట్టిన పార్టీ బీఆర్ఎస్. తెలంగాణ ఉద్యమంలో ఎన్నడూ పాల్గొనని, జై తెలంగాణ అనని, అమరుల స్థూపం దగ్గర రెండు పువ్వులు కూడా పెట్టని రేవంత్‌కు రాష్ట్ర ప్రజలపై ప్రేమ ఎలా ఉంటుంది? అని ప్రశ్నించారు.
బీఆర్ఎస్ పాలనను, కాంగ్రెస్ మోసాలను దావత్‌లో, పెళ్లిలో, రచ్చబండలో అన్ని చోట్లా చర్చించండి. ఆలోచించి ఓటేయండి అని పిలుపునిచ్చారు.