- అంగన్వాడీ యూనియన్‌లతో మంత్రి సత్యవతి రాథోడ్ సమావేశం.
- అంగన్‌వాడీ కేంద్రాల్లో చేపడుతున్న కార్యక్రమాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శం
- అంగన్వాడీ యూనియన్‌ల సమస్యలను త్వరలో పరిష్కరిస్తాము..
- ప్రతి నెల 14వ తారీకు వేతనాలు
తెలంగాణ రాష్ట్ర డా.బీ.ఆర్ అంబేద్కర్ నూతన సచివాలయంలో రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ గారు అంగన్ వాడి యూనియన్‌లతో సమావేశం అయ్యారు. తెలంగాణ అంగన్‌వాడీ టీచర్స్ అండ్ హెల్ప ర్స్ యూనియన్ (బీఆర్‌టీయూ) టీఎన్జీవో, మినీ అంగన్వాడి, సిఐటియు, ఏ.ఐ.టీ.యు.సీ యూనియన్‌లతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు మంత్రి.
ప్రధానంగా రిటైర్మెంట్ ప్రయోజనాలు, ఇన్సూరెన్స్, పీఆర్సీ, కారుణ్య నియామకాలు, మినీ అంగన్వాడి సెంటర్లను ప్రధాన అంగన్ వాడి సెంటర్లుగా మార్చడం, అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లకు పదోన్నతుల్లో సర్వీసు నిబంధనలను సడలించాలని, టీ.ఏ.డి ఏ లను చెల్లించాలని, సూపర్వైజర్ ల నియామకలను పరీక్షల ద్వారా కాకుండా సీనియార్టీ ప్రతిపాదన అవకాశం కల్పించాలని, పెండింగ్ బిల్లులు త్వరగా చెల్లించాలని మంత్రి సత్యవతి రాథోడ్ ను వారు కోరారు.
అందుకు సానుకూలంగా స్పందించిన మంత్రి సత్యవతి రాథోడ్ గారు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దృష్టికి తీసుకువెళ్లి త్వరలో సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ గారు మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం అంగన్‌వాడీలకు అండగా నిలిచిందని రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ స్పష్టం చేశారు.
చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించే ప్రక్రియను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని అందులో మీ పాత్ర గొప్పదని అభినందించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలోని అంగన్‌వాడీ టీచర్లు, ఆయాల వేతనాలను పెంచామన్నారు. ఇకపై ప్రతి నెల అంగన్వాడీ టీచర్ల కు 14వ తేదీన జీతాలు వచ్చేలా అందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని మంత్రి తెలిపారు. అంగన్వాడీలో త్వరలో బ్రిడ్జి కోర్సు ఏర్పాటు చేస్తామని అన్నారు. అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు వర్తింప చేసే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు.
అంతేకాకుండా సమ్మర్ లో సెలవుల నేపథ్యంలో టేక్ హోమ్ రేషన్ విధానం అమలు చేస్తామని పేర్కొన్నారు. అంగన్ వాడీలకు ఇన్సూరెన్స్ కవరేజీ తో పాటు హెల్త్ కార్డు సౌకర్యం తో పాటు, పెండింగ్ బిల్లుల సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని తెలిపారు. తెలంగాణలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో చేపడుతున్న కార్యక్రమాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని యునిసెఫ్ అంతర్జాతీయ సంస్థ ప్రతినిధులు కొనియాడిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. అంగన్‌వాడీ కేంద్రాల బలోపేతానికి ఎంతో కృషి చేస్తున్న మన సీఎం కేసీఆర్ అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను పరిష్కరిస్తారని తెలియజేశారు.
అంగన్వాడీ యూనియన్ల సమస్యలపై సుదీర్ఘంగా చర్చించి సమస్యల పట్ల సానుకూలంగా స్పందించడంతో సీఎం కేసీఆర్‌కు, మంత్రి సత్యవతి రాథోడ్‌కు యూనియన్ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.