ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ జనం దృష్టిలో పడాలని ప్రతిపక్ష నాయకులు తహతహలాడుతున్నారు. ఏదో ఒకటి చేసి తాము ఉన్నామని జనం గుర్తించేలా చేసేందుకు నానా తంటాలుపడుతున్నారు. ఇందుకోసం బరితెగించి ప్రవర్తిస్తున్నారు. కొందరు తెలంగాణ సర్కారుపై, సీఎం కేసీఆర్‌పై నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ప్రభుత్వ పథకాలపైనా ప్రజలను పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ నాయకులు ఒక అడుగు ముందుకేసి తెలంగాణలో కేంద్ర సర్కారు కార్యక్రమాలకు బీజేపీ రంగు పులుముతున్నారు. తమకు ఆహ్వానం, అర్హత లేకున్నా కేంద్ర సర్కారు అధికారిక కార్యక్రమాల్లో వేదికపై ఆసీనులవుతున్నారు. నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్టు వ్యవహరిస్తున్నారు. ఆదివారం జరిగిన రైల్వే స్టేషన్ల పునర్నిర్మాణ కార్యక్రమాన్ని కమలం నేతలు పూర్తిగా బీజేపీ కార్యక్రమంగా మార్చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
స్థాయిని మరిచి వేదికపైకి..
ఆదివారం రోజు ప్రధాని మోదీ ఢిల్లీనుంచి దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్ల పునర్నిర్మాణ కార్యక్రమాన్ని వర్చువల్‌గా ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ కార్యక్రమం మొత్తం 21 చోట్ల జరిగింది. గ్రేటర్‌లో నాలుగుచోట్ల కార్యక్రమం నిర్వహించగా, నాంపల్లి రైల్వే స్టేషన్ ప్రాంగణంలోని సభా వేదికపై మాజీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి ఆసీనులయ్యారు. ఆయనకు ఎలాంటి హోదా, అర్హత లేకున్నా ప్రొటోకాల్ ఉల్లంఘించి మరీ దర్జాగా కూచున్నారు. ఇక శేరిలింగంపల్లిలోని హఫీజ్‌పేట, హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ల పునర్నిర్మాణ కార్యక్రమంలో గజ్జల యోగానందర్, మొవ్వ సత్యనారాయణ హల్‌చల్ చేశారు. మల్కాజ్‌గిరిలో ఎస్ రామచంద్రరావు సభా వేదికపై కనిపించారు. వీరంతా పిలవకుండానే రావడంతోపాటు.. కేంద్ర సర్కారు అధికారిక కార్యక్రమంలో ప్రొటోకాల్ పాటించకుండా సభా వేదికపై ఆసీనులు కావడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. అది ప్రభుత్వ కార్యక్రమమా? లేక బీజేపీ కార్యక్రమమా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.