బీఆర్ఎస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర మాజీ అధ్యక్షురాలు, మాజీ కరీంనగర్ జిల్లా పరిషత్ అధ్యక్షురాలు, ప్రస్తుతం బీజేపీ పార్టీలో కొనసాగుతున్న సీనియర్ నాయకురాలు తుల ఉమ నేడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కె.తారక రామారావు తో వారి ఆహ్వానం మేరకు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.
అనంతరం, తుల ఉమతో పాటు వారి ముఖ్య అనుచరులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి కేటిఆర్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ‘‘ వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేసేందుకు బీజేపీ టికెట్ ఇచ్చినట్టే ఇచ్చి, బి ఫాం ఇవ్వకుండా ఇచ్చిన సీటును గుంజుకోవడం చాలా బాధాకరమన్నారు. ఇది మహిళలకే కాకుండా బీసీల పట్ల బీజేపీ వ్యతిరేక వైఖరికి నిదర్శనం.
బీసీ ముఖ్యమంత్రిని చేస్తానని బిల్డప్ ఇచ్చిన బీజేపీ పార్టీ, తెలంగాణ ఉద్యమ కాలం నాటి నుంచి సీనియర్ మహిళా నాయకురాలుగా, నాడు సీఎం కేసీఆర్ నాయకత్వంలో కరీంనగర్ జిల్లా పరిషత్ అధ్యక్షురాలిగా పనిచేశారు. తెలంగాణ ఆడ బిడ్డగా బీఆర్ఎస్ పార్టీ ఇంటి బిడ్డగా తన సేవలందించిన తుల ఉమక్క కు బీజేపీ ఇటువంటి అవమానం జరగడం బాధగా వున్నదని అన్నారు. బలహీన వర్గాల ఆడబిడ్డకు ఇటువంటి అన్యాయం జరగడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము..నిరసిస్తున్నామని పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్ సూచన మేరకు స్వయంగా నీనే ఉమక్కకు ఫోన్ చేసి ఆహ్వానించిన అని తెలిపారు. మా ఇంటి ఆడబిడ్డగా గులాబీ గూటికి తిరిగి చేరుకోవాలనే నా ఆహ్వానాన్ని మన్నించి రావడం సంతోషం అన్నారు. తుల ఉమక్క కు గతంలో ఉన్న హోదా కంటే కూడా మరింత సమున్నత హోదాను, బాధ్యతలను అప్పగించి పార్టీ గౌరవించుకుంటుంది. ఇందుకు సంబంధించిన బాధ్యతను స్వయంగా నీనే తీసుకుంటాను అని చెప్పారు.
కేసీఆర్ నాయకత్వంలో నిబద్ధత కలిగిన సైనికురాలిగా ఎలాంటి కల్మషం లేకుండా కలిసి పనిచేసిన తుల ఉమతో అంతే నిబద్దతతో తిరిగి కలిసి పనిచేస్తాం అని తెలిపారు. వేములవాడ నియోజకవర్గ అభివృద్ధితో పాటు రాష్ట్రంలోని మహిళా అభ్యున్నతి కోసం అక్క సేవలు అవసరం అన్నారు. గతంలో కూడా రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శిగా పార్టీ కోసం, మహిళా విభాగం అధ్యక్షురాలిగా మహిళా అభ్యున్నతి కోసం కృషిచేసిన తుల ఉమక్కకు పుట్టిన గూటికి పున: స్వాగతం’’ అని మంత్రి కేటీఆర్ అన్నారు.