mt_logo

నేను అడిగే ప్రశ్నలకు కాంగ్రెస్ నాయకుల కాడ జవాబు లేదు: సీఎం కేసీఆర్

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది లేదని సీఎం కేసీఆర్ అన్నారు. సీఎం కేసీఆర్ గారి అశ్వారావుపేట  నియోజకవర్గ ప్రజా ఆశీర్వాద సభ సీఎం మాట్లాడుతూ.. స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లవుతుంది. ప్రజా స్వామ్య పరిణతి రావాల్సినంత మన దేశంలో రాలేదు. పరిణతి వచ్చిన దేశాలు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయి. మనం ఇంకా పరిణతి సాధించాల్సిన అవసరం ఉన్నదని వివరించారు. ఎన్నికలు వస్తే ఆగమాగం కావద్దు అన్నారు. ఎన్నికల్లో నిల్చునే అభ్యర్థి గుణం, గుణం తెలుసుకోవాలని సూచించారు. అభ్యర్థుల వెనుకాల పార్టీ ఉంటుంది. పార్టీ చరిత్ర ఏంటో తెలుసుకోవాలి. పార్టీ చరిత్రను తెలుసుకుని ఓట్లు వేయాలని తెలిపారు. 

 ప్రాజెక్టులు ఎప్పుడో పూర్తయ్యేవి

ఎన్నికలు వచ్చిందంటే పచ్చి అబద్ధాలు, అబాండాలు, అలవికాని వాగ్ధానాలు, అవి నెరవేర్చకపోవడాలు ఉంటాయని హెచ్చరించారు. మన రాష్ట్రం మనకు ఉంటే బలవంతంగా తీసుకెళ్లి తెలంగాణ ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా ఆంధ్రలో కలిపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మన రాష్ట్రం మనకే ఉండేదుంటే మన దరిద్రం ఎప్పుడో పోయేదని చెప్పారు. ప్రాజెక్టులు ఎప్పుడో పూర్తయ్యేవి. ధనిక రాష్ట్రంగా ఉండే వాళ్లం అని అన్నారు. ఉద్యమంలో 1969 లో 400 మంది విద్యార్థులను కాంగ్రెస్ పార్టీ కాల్చి చంపిందని వెల్లడించారు. 

కుల, మత బేధం లేకుండా ముందుకు..

మహబూబ్‌నగర్ జిల్లా నుంచి 15 లక్షల మంది వలసలు పోయారని తెలిపారు. మెదక్, నల్గొండ జిల్లాల నుంచి కూడా వలసలు పోయారు. ముందుగా కరెంటు సమస్య పరిష్కారం చేసుకున్నాం. రాష్ట్రంలో కరెంటు సమస్య లేదు. 24 గంటలు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసే రాష్ట్రం తెలంగాణ. ప్రధానమంత్రి మోడీ రాష్ట్రంలో కూడా తెలంగాణలో మాదిరిగా విద్యుత్ ఇవ్వలేక పోతున్నారని పేర్కొన్నారు. గత 10 సంవత్సరాల్లో కుల, మత బేధం లేకుండా ముందుకుపోతున్నాం అని స్పష్టం చేసారు. రాష్ట్రంలో అలజడి లేదు. శాంతి యుత పద్ధతిలో ముందుకు పోతూ అభివృద్ధిలో దూసుకుపోతున్నదని తెలియజేసారు. 

ప్రగతి కాలికంగా ఆలోచిస్తూ ముందుకు..

సీతారామ ప్రాజెక్టు కట్టి ఉమ్మడి ఖమ్మం జిల్లాకు నీళ్లు ఇవ్వవచ్చని కాంగ్రెస్ నాయకుడెవ్వడూ ఆలోచించలేదని మండిపడ్డారు. బీఆర్ఎస్ వచ్చిన తర్వాత సీతారామ ప్రాజెక్టు ప్రారంభించుకున్నాం, 75 శాతం పూర్తయిందిని వెల్లడించారు. సీతారామ ప్రాజెక్టు పూర్తయితే ఖమ్మంలోని 10 నియోజకవర్గాల్లో సమృద్ధిగా నీరు వస్తది. ప్రగతి కాలికంగా ఆలోచిస్తూ ముందుకు తీసుకువెళ్తున్నాం అని పేర్కొన్నారు.  కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని భట్టివిక్రమార్క, రాహూల్ గాంధీ అంటున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది లేదు. చచ్చేది లేదని అన్నారు. బాధ్యతలేని కాంగ్రెస్ పార్టీ, రైతుల మీద సానుభూతి లేని కాంగ్రెస్ పార్టీ ధరణి తీసేస్తా అంటున్నది. ధరణి తీసేస్తే రైతుబంధు సొమ్ము, రైతు బీమా సొమ్ము, రుణమాఫీ సొమ్ము, ధాన్యం అమ్మకానికి సంబంధించిన డబ్బు రైతులకు నేరుగా ధరణి లేకుండా ఎలా అందుతుందనేది నేను ప్రశ్నిస్తే కాంగ్రెస్ నాయకులు జవాబు చెప్పడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసారు.  

 ఉజ్వలమైన తెలంగాణకు బీఆర్ఎస్

పీసీసీ అధ్యక్షుడు అహాంకారానికి హద్దులు లేవని ఎద్దేవా చేసారు.  కరెంటు 24 గంటలు వేస్ట్ అంటున్నాడు. మూడు గంటల కరెంటు చాలు అంటున్నాడు. కాంగ్రెస్ వస్తే అదే అవుతదని హెచ్చరించారు. మూడు గంటల కరెంటుతో పొలాలు పారుతయా? పామాయిల్ తోటలన్నా పారుతయా? అని ప్రశ్నించారు. మరో కాంగ్రెస్ నాయకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్‌కు పని లేదు, ప్రజల పన్నులు వేస్ట్ చేస్తూ రైతుబంధు ఇస్తున్నాడని విమర్శిస్తున్నారని అన్నారు. మెచ్చానాగేశ్వర్ రావు. తాటి వెంకటేశ్వర్లు కలిసిపోయారు ఇక  తిరుగేలేదు, గెలుస్తున్నాం అని ధీమా వ్యక్తం చేసారు. రాష్ట్రంలో కూడా బీఆర్ఎస్ వస్తున్నది,  ఉజ్వలమైన తెలంగాణకు రూపుదిద్దుకుంటాం అని తెలిపారు. మెచ్చానాగేశ్వర్ రావుకే మీ ఓటు వేసి గెలిపించండని విజ్ఞప్తి చేసారు.