
బీజేపీ అంటే క్రమశిక్షణకు మారుపేరు అని కాషాయ నాయకులు చెప్పుకొంటారు. తామే ధర్మ పరిరక్షకులమని ఊదరగొడుతుంటారు. జై శ్రీరాం అంటూ రాముడి సత్యప్రవర్తనకు తాము బ్రాండ్ అంబాసిడర్లమని జనాలను నమ్మిస్తారు. కానీ, ఆచరణలో ఆ పార్టీ నాయకుల ప్రవర్తన అందుకు విరుద్ధంగా ఉన్నది. కాషాయ జెండా సాక్షిగా జనాలను మోసం చేస్తూ బీజేపీ నేతలు అక్రమార్జనకు పాల్పడుతున్నారు. కేంద్రంలో ఉన్నది తమ సర్కారే అన్న ధీమాతో అక్రమ దందాలకు తెరలేపుతున్నారు. నిన్న సిరిసిల్ల.. నేడు నిజామాబాద్‌లో ఒక్కొక్కటిగా బీజేపీ నాయకుల లీలలు బయటపడుతున్నాయి. కాషాయ ముసుగులో ఆ పార్టీ నేతలు చేస్తున్న అక్రమాలు వెలుగు చూస్తున్నాయి.
కొత్త ఇల్లు కట్టుకొంటే బీజేపీ కార్పొరేటర్‌కి డబ్బులివ్వాల్సిందే!
తంగళ్లపల్లిలోని టెక్స్‌టైల్స్ పార్కులో తన ఇంటిని బీజేపీ నాయకులు రాజాసింగ్, కమలాకర్ నమ్మబలికి.. వారిపేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకొన్నారని, తనకు న్యాయం చేయాలని కోరుతూ బీజేపీ ఎంపీ, జాతీయ నేత బండి సంజయ్‌కి సిరిసిల్ల పట్టణంలోని విద్యానగర్‌కు చెందిన షమీం సుల్తానా ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తన ఇంటిని తనకు ఇప్పించాలని బండి సంజయ్ కాళ్లపై కూడా పడింది. ఈ ఘటన మరువకముందే నిజామాబాద్‌కు చెందిన బీజేపీ కార్పొరేటర్ సుక్కా మధు నగరంలో అక్రమ వసూళ్లకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. తన ఏరియాలో కొత్తగా ఇల్లు నిర్మించుకొంటున్న ఓ వ్యక్తిని మధు డబ్బులు డిమాండ్ చేశారు. తనకు డబ్బలు ఇస్తేనే ఇంటి విషయంలో సహకరిస్తానని తెగేసి చెప్పారు. కాగా, మధు తనను బెదిరించిన ఫోన్ సంభాషణను రికార్డు చేసిన ఆ ఇంటి యజమాని సోషల్‌మీడియాలో పెట్టగా, కార్పొరోటేర్ బాగోతంపై జనం మండిపడుతున్నారు. బీజేపీ నాయకులను ఎన్నుకొంటే ఇంతకన్నా ఏంచేస్తారంటూ కడిగి పారేస్తున్నారు. ఈ విషయం బీజేపీ వర్గాల్లోనూ చర్చనీయాంశం కావడం గమనార్హం.