mt_logo

కామారెడ్డిలో సీఎం కేసీఆర్‌కు తిరుగులేదు.. బీజేపీ కామారెడ్డి ఇన్‌చార్జి వెంకటరమణారెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు!

అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ త‌ర‌ఫున బ‌రిలో నిలిచే 115 మంది గెలుపుగుర్రాల జాబితాను ఇటీవ‌ల ఆ పార్టీ అధినేత‌, సీఎం కేసీఆర్ విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే. తాను గ‌జ్వేల్‌తోపాటు కామారెడ్డిలోనూ పోటీ చేస్తున్న‌ట్టు కేసీఆర్ ప్ర‌క‌టించి, అంద‌రినీ ఆశ్చ‌ర్యంలో ముంచెత్తారు. ముఖ్యంగా ప్ర‌తిప‌క్షాల‌కు గ‌ట్టి షాక్ ఇచ్చారు. సీఎం కేసీఆర్ నిర్ణ‌యం విన్నాక కాంగ్రెస్‌, బీజేపీ నాయ‌కుల‌కు ఏం చేయాలో తోచ‌క విల‌విల్లాడుతున్నారు. పుండు మీద కారం చ‌ల్లిన‌ట్టు సాక్షాత్తూ బీజేపీ కామారెడ్డి నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జి వెంకటరమణారెడ్డి సీఎం కేసీఆర్‌కు మ‌ద్ద‌తుగా కీల‌క వ్యాఖ్య‌లు చేసి, క‌మ‌లం పార్టీని క‌ల‌వ‌రానికి గురిచేశారు. కామారెడ్డిలోని బీజేపీ కార్యాల‌యంలోనే ఆయ‌న సీఎం కేసీఆర్ గెలుపు ఖాయ‌మ‌ని ప్ర‌క‌టించారు. ఇక్క‌డ సీఎం కేసీఆర్‌కు తిరిగే లేద‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. సీఎం కేసీఆర్‌కు కామారెడ్డిలో పోటీ ఇచ్చే నాయకుడే లేడ‌ని తేల్చి చెప్పారు.

ప్ర‌తిప‌క్షాలు ఇంట్లో కూర్చోవడం బెట‌ర్..
కామారెడ్డిలో సీఎం కేసీఆర్ మీద పోటీ చేసే బ‌దులు చ‌ప్పుడు చేయ‌కుండా ఇంట్లో కూర్చోవ‌డం బెట‌ర్ అని వెంక‌ట‌ర‌మ‌ణారెడ్డి వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్ ఉద్య‌మ నాయ‌కుడ‌ని, కొంద‌రు ద్రోహుల వ‌ల్ల ప‌క్క‌దారిప‌ట్టిన ఉద్య‌మాన్ని ప‌ట్టాలెక్కించి తెలంగాణ సాధించిన యోధుడ‌ని కొనియాడారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ ఎంతో అభివృద్ధి సాధించింద‌ని చెప్పారు. ఆయ‌న గురించి ఎంత చెప్పినా త‌క్కువేన‌ని అన్నారు. సీఎం రాక‌తో గ‌జ్వేల్ మాదిరిగానే కామారెడ్డి కూడా అభివృద్ధి బాట‌ప‌డుతుంద‌ని ధీమా వ్య‌క్తంచేశారు. సీఎం కేసీఆర్ విజ‌న్‌పై త‌న‌కు పూర్తి అవ‌గాహ‌న ఉన్న‌ద‌ని, ఆయ‌న కామారెడ్డి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీని ఏర్పాటుచేసే అవకాశం ఉన్నద‌ని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ 20, 21 పూర్తిచేసి కామారెడ్డి నియోజకవర్గంలో మూడు పంటలకు నీరందేలా చేస్తార‌ని తెలిపారు. కాగా, బీజేపీ కామారెడ్డి నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జే సీఎం కేసీఆర్ గెలుపు ఖాయ‌మ‌ని చెప్ప‌డంతో క‌మ‌లం పార్టీ త‌ల‌ప‌ట్టుకొంటున్న‌ది. కామారెడ్డిలో పోటీ చేయ‌డం దండుగే అన్న మీమాంస‌లో ప‌డిపోయింది.