షెడ్యూల్డ్ కులాల సంక్షేమ హాస్టళ్ళలో బయోమెట్రిక్ విధానాన్ని మరో వారం రోజుల్లో ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేస్తున్నారు. హాస్టళ్ళలో జరిగే అవినీతి, అక్రమాలకు చెక్ పెట్టి విద్యార్థుల హాజరుశాతం పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. సంక్షేమ హాస్టళ్ళలో ఉన్న వారంతా నిరుపేద విద్యార్థులే కావడంతో వారి అభివృద్ధికి ఏమాత్రం ఆటంకం కలగకుండా చూసేందుకు వారికి ఎంతో మెరుగైన సౌకర్యాలు కల్పించాలని సర్కార్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
గత నెల ఒకటో తేదీనుండి విద్యార్థులకు పౌష్టికాహారం అందించే దిశగా అన్ని సంక్షేమ హాస్టళ్ళలో మధ్యాహ్న భోజన పథకంలో సన్నబియ్యం పంపిణీని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అంతేకాకుండా విద్యార్థులకు అందించే కాస్మొటిక్ చార్జీలను కూడా పెంచింది. వీటిని అమలుచేయడంలో ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా ఉండటానికే బయోమెట్రిక్ పద్ధతిని ప్రవేశపెట్టనున్నారు. హాస్టల్ వార్డెన్లకు ల్యాప్ టాప్ లు, కంప్యూటర్లు, డేటా కార్డులు, థంబింగ్ మెషిన్లు అందజేసి వార్డెన్లకు వీటి వినియోగంపై శిక్షణా కార్యక్రమం కూడా నిర్వహించారు.