mt_logo

టీఆర్ఎస్ సభ్యత్వ నమోదుకు తొలిరోజే భారీ స్పందన!

టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన సభ్యత్వ నమోదుకు తొలిరోజే అనూహ్య స్పందన లభించింది. టీఆర్ఎస్ కు చెందిన క్రియాశీల కార్యకర్తలతో పాటు ఇతర పార్టీలకు చెందినవారు కూడా భారీ ఎత్తున సభ్యత్వం కోసం తరలివచ్చారు. సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదలైన తొలిరోజే అనూహ్య స్పందన రావడంతో టీఆర్ఎస్ నేతలు సంతోషం వ్యక్తం చేశారు. మహబూబ్ నగర్ జిల్లా పెబ్బేరులో సభ్యత్వ నమోదును మంత్రి హరీష్ ప్రారంభించి తొలి సభ్యత్వాన్ని ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి అందజేశారు. అనంతరం మంత్రి జూపల్లి కృష్ణారావు, పార్లమెంటరీ కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, మర్రి జనార్ధన్ రెడ్డి, గువ్వల బాలరాజు తదితరులు సభ్యత్వాలు అందుకున్నారు.

నల్లగొండ జిల్లా నకిరేకల్ లో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్ రెడ్డి ప్రారంభించారు. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం తొలి సభ్యత్వాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో నల్లగొండ జిల్లాను అగ్రభాగంలో నిలుపుతామని అన్నారు. ఖమ్మం జిల్లాలో మంత్రి తుమ్మల, పార్లమెంటరీ కార్యదర్శి జలగం వెంకట్రావు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించారు. ఆన్ లైన్ సభ్యత్వ నమోదును ప్రారంభించిన అనంతరం తుమ్మల మాట్లాడుతూ, రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దేందుకు దేశంలో ఎక్కడా లేనన్ని సంక్షేమ, అభివృద్ధి పథకాలను సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్నారని అన్నారు.

వరంగల్ టీఆర్ఎస్ అర్బన్ పార్టీ కార్యాలయంలో పార్లమెంటరీ కార్యదర్శి దాస్యం వినయ్ భాస్కర్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో 30 వేల సాధారణ సభ్యత్వంతో పాటు ఐదువేల మంది క్రియాశీల సభ్యులను పార్టీలో చేర్పిస్తామని చెప్పారు. కరీంనగర్ జిల్లా అల్గునూరు చౌరస్తాలో ఎంపీ వినోద్ కుమార్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆదిలాబాద్ లో ఎంపీ బాల్క సుమన్, అటవీశాఖ మంత్రి జోగు రామన్న సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు.

టీఆర్ఎస్ మహిళా విభాగం ఆధ్వర్యంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఎంపీ కవిత తెలంగాణ భవన్ లో ప్రారంభించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ మహిళా విభాగం అధ్యక్షురాలు తుల ఉమకు తొలి సభ్యత్వాన్ని ఎంపీ కవిత అందజేశారు. అనంతరం కవిత మాట్లాడుతూ, సభ్యత్వ నమోదులో పురుషుల కంటే మహిళలు ఒకరు ఎక్కువే ఉండాలని, ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఆడబిడ్డ బాగుంటేనే ఇల్లు బాగుంటుందని రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు భావిస్తున్నారని, ఆడబిడ్డలు బిందెలతో నీళ్ళు తెచ్చుకోవద్దనే ఉద్దేశంతోనే ఇంటింటికీ మంచినీరు, కళ్యాణలక్ష్మి, మహిళల పేరుతో భూపంపిణీ, బీడీ కార్మికులకు పించన్లు ఇస్తున్నారన్నారు. అంతేకాకుండా మహిళల భద్రత, రక్షణకు చర్యలు చేపడుతున్నారని, నగరాల్లో షీ టీంలు, జిల్లాల్లో నిర్భయ కేంద్రాలను ఏర్పాటుచేయించి ఆడబిడ్డలకు ప్రభుత్వం అండగా నిలిచిందని కవిత పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *