టీకాంగ్రెస్ అంటేనే కుట్రలకు మారుపేరు. నాటినుంచి అంతర్గత విభేదాలకు ఆ పార్టీ పెట్టింది పేరు. ఇప్పుడు ఆ పేరును నిలబెట్టేందుకు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. తన ఆధిపత్యానికి అడ్డుగా ఉన్న సీనియర్లకు చెక్‌పెట్టేందుకు తెలివిగా పావులు కదుపుతున్నారు. తన అనుకూల వర్గానికి ఎమ్మెల్యే టికెట్లు కేటాయించి, తనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నవారిని ఎంపీలుగా పోటీచేయించి. ఢిల్లీకి పంపేలా భారీ స్కెచ్ వేస్తున్నారు. ముఖ్యంగా ఆదినుంచీ తనను వ్యతిరేకిస్తున్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మధుయాష్కీగౌడ్‌ను రేవంత్ టార్గెట్ చేసినట్టు కాంగ్రెస్ శ్రేణులే గుసగులాడుతున్నాయి. ఇందుకు అనుగుణంగానే టికెట్ల కేటాయింపు ప్లాన్ చేసినట్టు విశ్వసనీయ సమాచారం. అలాగే, ఒకే కుటుంబం.. ఒకే టికెట్ నినాదంతో ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి షాక్ ఇచ్చేందుకు ప్లాన్ చేసినట్టు తెలిసింది. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రస్తుతం నల్లగొండ ఎంపీగా ఉండగా.. రాబోయే ఎన్నికల్లో కోదాడ ఎమ్మెల్యేగా పోటీచేయాలని భావిస్తున్నారు. ఆయన సతీమణి పద్మావతిని హుజూర్‌నగర్‌నుంచి బరిలో నిలిపేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే, దీనికి చెక్‌పెట్టి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని దెబ్బతీయాలని రేవంత్‌చూస్తున్నట్టు తెలిసింది..
కండువా కప్పుకోకముందే జూపల్లికి భారీ షాక్!
కాంగ్రెస్ పార్టీలో చేరకముందే జూపల్లి కృష్ణారావుకు భారీ షాక్ తగిలింది. తాను కాంగ్రెస్‌లో చేరేందుకు ప్లాన్ చేసుకొన్న రెండు సభలు వాయిదాపడడంతో ఆయన అసహనం వ్యక్తంచేస్తున్నారు. ఈ నెల 20న కొల్లాపూర్‌లో భారీ బహిరంగ సభ ప్లాన్ చేయగా, అగ్రనేత ప్రియాంకగాంధీ ఆయనకు సమయం ఇవ్వలేదు. దీంతో ఆ సభ వాయిదాపడింది. తిరిగి ఈ నెల 30న సభ నిర్వహించాలని జూపల్లి నిర్ణయించగా.. వర్షాల సాకుతో సీనియర్లు, స్థానికులు సభ వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో జూపల్లి కాంగ్రెస్‌లో చేరితే తమకు పోటీ అవుతాడని భావించే సీనియర్లు ఆయన రాకను అడ్డుకొంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. వర్షాలు తగ్గుముఖం పట్టినా కావాలనే సీనియర్లు తన సభను అడ్డుకొంటున్నారని జూపల్లికూడా గుర్రుగా ఉన్నట్టు సమాచారం. కాంగ్రెస్‌లో చేరాలని తప్పుడు నిర్ణయం తీసుకున్నానా? అని ఆయన అంతర్మథనం చెందుతున్నట్టు జూపల్లి శ్రేణులు పేర్కొంటున్నాయి.