mt_logo

ఫ‌లించిన మంత్రి కేటీఆర్ పోరాటం.. కంటోన్మెంట్ విలీనంపై త‌ల‌వంచిన కేంద్రం!

హైద‌రాబాద్ మహాన‌గ‌రంలో అన్నిచోట్లా అభివృద్ధిదారులు ప‌డ్డాయి త‌ప్పా.. సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో అది ఇప్ప‌టికీ నెర‌వేర‌ని క‌ల‌గానే మిగిలిపోయింది. ఈ ప్రాంత‌మంతా సైన్యం నియంత్ర‌ణ‌లో ఉన్న కంటోన్మెంట్ బోర్డులో ఉండ‌టంతో ఇక్క‌డ రాష్ట్ర ప్ర‌భుత్వం ఎలాంటి అభివృద్ధి చేయాల‌న్నా అడ్డంకులు ఎదుర‌య్యాయి. ఇరుకిరుకు ర‌హ‌దారులు, నిత్యం ట్రాఫిక్‌తో కంటోన్మెంట్ ప్ర‌జ‌ల‌తోపాటు ఆ ప్రాంతంగుండా నిత్యం ప్ర‌యాణించేవారు న‌ర‌కం చూస్తున్నారు. ఈ ప్రాంతం అభివృద్ధి కావాలంటే కంటోన్మెంట్ పరిధిలో ఉన్న 2,600 ఎకరాల సివిలియన్ ప్రాంతాలను జీహెచ్ఎంసీకి బదిలీ చేయ‌డం ఒక్క‌టే మార్గ‌మ‌ని మున్సిప‌ల్ శాఖ మంత్రి కేటీఆర్ భావించారు. ఈ మేర‌కు కేంద్ర స‌ర్కారుకు ఎన్నోసార్లు విన్న‌వించుకొన్నారు.

ఎనిమిది మంది సభ్యులతో రూపొందించిన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందించారు. 350 రెసిడెన్షియల్ కాలనీలు, 16 బజార్లు, 414 ఎకరాల సెంట్రల్ గవర్నమెంట్ భూములు, 501 ఎకరాల లీజ్డ్ ల్యాండ్స్, 260 ఎకరాల ఖాళీ స్థలాలు ఉన్నట్లు మంత్రి పేర్కొన్నారు. 5,660 ఎకరాల డిఫెన్స్ ల్యాండ్ మాత్రం సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు, లోకల్ మిలిటరీ అథారిటీతో ఉండేలా నివేదిక రూపొందించారు. దేశంలోని కంటోన్మెంట్ ప్రాంతాలన్నింటినీ ఆయా నగరాల నుంచి బయటకు తరలించాలని మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు. కంటోన్మెంట్ ప్రాంతాల వల్ల ప్రజలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఒక పాలసీని రూపొందించాలని సూచించారు. ఇందుకోసం ఆయ‌న రాజీలేని పోరాటం చేశారు. దీంతో ఎట్ట‌కేల‌కు కేంద్ర స‌ర్కారు త‌ల‌వంచింది. 

సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ప్రాంతాన్ని త్వరలోనే జీహెచ్‌ఎంసీలో విలీనం చేసేందుకు రక్షణశాఖ ఎట్టకేలకు సుముఖత వ్యక్తం చేసింది. 

జీహెచ్ఎంసీలో విలీనం లాంఛ‌న‌మే: కేంద్రం

మంత్రి కేటీఆర్ మ‌డ‌మ‌తిప్ప‌ని పోరాటంతో సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ప్రాంతాన్ని జీహెచ్‌ఎంసీలో విలీనం చేసేందుకు రక్షణశాఖ ఎట్టకేలకు అంగీక‌రించింది. ఈ మేర‌కు లోక్‌స‌భ‌లో ర‌క్ష‌ణశాఖ‌ స‌హాయ మంత్రి అజ‌య్‌భ‌ట్ స్ప‌ష్టంచేశారు. కంటోన్మెంట్ల విలీనంపై క‌ర్ణాట‌క ఎంపీ మంగ‌ల్ సురేశ్ అంగ‌డీ ప్ర‌శ్న‌కు అజ‌య్‌భ‌ట్ స‌మాధ‌న‌మిచ్చారు. కంటోన్మెంట్ల విలీనంపై రాష్ట్ర ప్ర‌భుత్వాల ప్ర‌తిపాద‌న‌ల‌ను స్వీక‌రించామ‌ని తెలిపారు. ఈ ప్ర‌క్రియ‌కు ఇప్ప‌టికే తెలంగాణ‌,  జార్ఖండ్ ప్ర‌భుత్వాలు అంగీక‌రించాయ‌ని అజ‌య్‌భ‌ట్ స్ప‌ష్టంచేశారు. కంటోన్మెంట్ బోర్డు ఉద్యోగులు, పెన్ష‌న‌ర్ల విష‌యంలో చ‌ర్చిస్తున్న‌ట్టు చెప్పారు. ఈ మేర‌కు ప్ర‌క్రియ మొద‌లైంద‌ని, త్వ‌ర‌లోనే మున్సిపాలిటీల్లో కంటోన్మెంట్ ప్రాంతాల‌ను విలీనం చేస్తామ‌ని స‌మాధాన‌మిచ్చారు.