mt_logo

ఖ‌మ్మంలో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ‌.. పొంగులేటి మొద‌టి స‌భ‌కు జ‌నం డుమ్మా.. హ‌స్తం నేత‌ల క‌య్యం!

బీఆర్ఎస్ బ‌హిష్కృత నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చేరిక‌తో ఖ‌మ్మంలో కాంగ్రెస్ బ‌ల‌ప‌డిపోయిందంటూ హ‌స్తం నేత‌లు ఊద‌ర‌గొట్టారు. ఖ‌మ్మం క్లీన్‌స్వీప్ చేస్తామ‌ని ప్ర‌గ‌ల్భాలు ప‌లికారు. పొంగులేటికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాద‌ని గ‌ప్పాలు కొట్టారు. కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్‌గాంధీ స‌మ‌క్షంలో చేరిన‌ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఇక జిల్లాలో త‌న‌కు తిరుగులేద‌న్న‌ట్టు మాట్లాడారు. ఖ‌మ్మంలో తాను ఎంత చెప్తే అంత.. ప్ర‌జ‌లంతా త‌న‌వెంటే ఉంటార‌ని ఆశ‌లుపెట్టుకొన్నారు. అయితే, ఈ ఆశ‌ల‌న్నీ పొంగులేటి మొద‌టి స‌మావేశంలోనే అడియాశ‌ల‌య్యాయి. తాజాగా, ఆయ‌న కొత్త‌గూడెంలో నిర్వ‌హించిన స‌భ అట్ట‌ర్ ప్లాప్ అయ్యింది. జ‌న‌మెవ‌రూ రాక‌పోవ‌డంతో ఖాళీ కుర్చీలే ద‌ర్శ‌న‌మిచ్చాయి. ఖ‌మ్మంలో కింగ్‌మేక‌ర్ అవుదామ‌నుకున్న పొంగులేటికి కొత్త‌గూడెం ప్ర‌జ‌లు షాక్ ఇచ్చారు. దీంతో కొంత‌మంది కార్య‌క‌ర్త‌లు, డ‌బ్బులిచ్చి తీసుకొచ్చిన‌ కూలీల‌తో స‌భ‌ను తూతూమంత్రంగా ముగించారు. 

కాంగ్రెస్ స‌భ‌లో క‌య్యం!

కాంగ్రెస్ అంటేనే క‌య్యాల‌కు పెట్టింది పేరు. కొత్త‌గూడెం స‌భ‌లోనూ అదే సీన్ రిపీట్ అయ్యింది. స్థానిక ప్ర‌జాప్ర‌తినిధి ఫొటో ఫ్లెక్సీలో పెట్ట‌లేదంటూ ఆయ‌న అనుచ‌రులు ఆందోళ‌న వ్య‌క్తంచేశారు. స‌భ‌ను అడ్డుకొనే ప్ర‌య‌త్నం చేశారు. దీంతో దిగివ‌చ్చిన పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెంట‌నే స‌ద‌రు నాయ‌కుడి ఫొటోతో మ‌రో ఫ్లెక్సీ ఏర్పాటు చేయించారు. అలాగే, ఆ స‌భ‌లో ఎంతోమంది ఇత‌ర పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు చేరుతార‌ని పొంగులేటి ఊద‌ర‌గొట్ట‌గా, తూతూమంత్రంగా కొంత‌మంది మాత్ర‌మే కాంగ్రెస్ కండువాలు క‌ప్పుకొన్నారు. ఇక స‌భ జ‌రుగుతుండ‌గానే పలువురు ఇంటిబాట‌ప‌ట్ట‌డం క‌నిపించింది. స‌భ సంద‌ర్బంగా తీసిన ర్యాలీకి ఓ వ్య‌క్తి అడ్డురావ‌డంతో పొంగులేటి అనుచ‌రులు అత‌డిని చిత‌క‌బాదారు. దీంతో స‌ద‌రు వ్య‌క్తి వారిపై స్థానిక పోలీస్‌స్టేష‌న్‌లో కేసుపెట్టారు.  ఈ సీన్ చూసి వారంతా అధికారంలోకి రాక‌ముందే ఇలా వ్య‌వ‌హరిస్తున్న కాంగ్రెస్ నాయ‌కుల‌కు అధికారం ఇస్తే ఇక ఆగుతారా? అంటూ ఆందోళ‌న వ్య‌క్తంచేశారు.