mt_logo

ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడిలో పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారా?

ఈరోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ అనుచరులు దాడి చేశారు. పీఏసీ చైర్మన్‌గా గాంధీ నియమితుడైన నేపథ్యంలో.. అసలు గాంధీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా.. బీఆర్ఎస్‌లో ఉన్నారా‌.‌. బీఆర్ఎస్‌లో ఉంటే తెలంగాణ భవన్‌కు రావాలని గాంధీకి కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు.

ఆ సవాల్‌కి స్పందిస్తూ.. వందల మంది అనుచరులతో అరికెపూడి గాంధీ కౌశిక్ రెడ్డి ఇంటి మీదకి వెళ్ళారు. తోటి ఎమ్మెల్యే అని కూడా చూడకుండా కౌశిక్ రెడ్డిని గాంధీ అసభ్య పదజాలంతో దూషించారు.. గాంధీ వెంట వచ్చిన అనుచరులు గుడ్లు, టమాటాలు, రాళ్లతో కౌశిక్ ఇంటిపై దాడికి దిగారు. ఇంత జరుగుతున్నా పోలీసులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారని విమర్శలు వెల్లువడుతున్నాయి.

కౌశిక్ రెడ్డిని అరికెపూడి గాంధీ బహిరంగంగానే బెదరించినప్పటికి పోలీసులు ముందస్తు చర్యలు తీసుకోలేదు.. గాంధీని హౌస్ అరెస్ట్ చేయలేదు అని విమర్శలు వస్తున్నాయి. కౌశిక్ రెడ్డికి భద్రత కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారని బీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నారు.

కూకట్‌పల్లి నుంచి కొండాపూర్‌లోని కౌశిక్ రెడ్డి నివాసానికి 100 కార్లలో 500 మందిని తీసుకెళ్లేందుకు అరికెపూడి గాంధీకి ఎవరు అనుమతిచ్చారు? అతని కాన్వాయ్ 15 కిలోమీటర్ల దూరం ప్రయాణించి మూడు పోలీస్ స్టేషన్ల పరిధిని దాటినా.. వారిని ఎందుకు అడ్డుకోలేదు? అని పలు ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

కౌశిక్ రెడ్డి మీద దాడి చేయడానికి కాంగ్రెస్ కార్యకర్తలు రాళ్లు, కోడిగుడ్లు, టమాటా వంటి వస్తువులను మోసుకెళ్లినా.. వారిని పోలీసులు ఎందుకు ఆపలేకపోయారు.. అదుపులోకి తీసుకోలేకపోయారు అని బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తుంది.

పాడి కౌశిక్ రెడ్డిపై దాడి జరగబోతున్నదని మీడియాతో సహా అందరికి తెలిసినా కూడా.. ఆయన ఇంటి వద్ద సరిపడా పోలీసులను కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు మొహరించలేదు.. ఒక రకంగా పరోక్షంగా దాడికి మద్దతు తెలిపిందా అని టాక్ నడుస్తుంది.

అంతే కాదు.. అరికెపూడి గాంధీ అనుచరులు కొందరు పోలీసులపై కూడా దాడి చేసినట్లు వీడియోల్లో స్పష్టంగా కనిపిస్తుంది. వీరిపై పోలీసులు కేసులు పెడతారా లేదా అనేది వేచి చూడాలి.

పదేళ్లు ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో పట్టపగలు ఒక ఎమ్మెల్యే ఇంటిపై దాడి.. అదీ ఒక ఎమ్మెల్యే చేయడం హేయమైన చర్య. ఎలాంటి రాజకీయ ఒత్తిడులకు తలొగ్గకుండా ఈ ఘటన బాధ్యులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.