తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే క్వశ్చన్ అవర్ లేకుండానే నేరుగా రైతు సమస్యలపై సభ్యులు చర్చిస్తున్నారు. వ్యవసాయ శాఖామంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి చర్చను ప్రారంభించగానే ప్రతిపక్షాలు చర్చను అడ్డుకున్నాయి. దీంతో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ సీఎం కేసేఆరే నేరుగా రైతు ఆత్మహత్యలపై చర్చ చేపట్టాలని నిర్ణయిస్తే ప్రతిపక్షాలు ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని ప్రశ్నించారు. రైతులపై ప్రతిపక్షాలకు నిజంగా ప్రేమ ఉంటే రైతు సమస్యలపై చర్చకు సహకరించాలని కోరారు.
అనంతరం వ్యవసాయ శాఖామంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ వరుసగా రెండేళ్ళు అనావృష్టితోనే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో 66 శాతం వర్షపాతం లోటు ఉందని, విత్తనాలు వేశాక వర్షాలు లేక పంటలు దెబ్బతిన్నాయని అన్నారు. అయినప్పటికీ 80 శాతం పంటలు సాగు అయ్యాయని, కరీంనగర్, నల్గొండ జిల్లాల్లో 50 శాతం, మహబూబ్ నగర్ లో 100 శాతం పంటలు దెబ్బతిన్నాయని పోచారం తెలిపారు. రైతు సమస్యలపై ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని, ఇకపై రైతులు ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.