mt_logo

హరిత హారంతో తెలంగాణ పుడమితల్లి పచ్చగా 

లక్ష్యాన్ని దాటినా  హరిత హారం.  

273.33 కోట్ల మొక్కలు నాటడం పూర్తి. 

ఇప్పటివరకు రూ.10,822 కోట్లు వెచ్చింపు..

ఈ ఏడాది 19.29 కోట్ల మొక్కలు లక్ష్యం. 

• రాష్ట్రంలోని 14,864 నర్సరీల్లో 30.29 కోట్ల మొక్కలు సిద్ధం. 

• హెచ్ఎండీఏ పరిధిలో అత్యధికం.

తెలంగాణకు పచ్చలహారం తొడగాలన్న ప్రభుత్వ సంకల్పం నెరవేరేందుకు అడుగు దూరమే మిగిలింది. తొమ్మిదేళ్లలో  230 కోట్ల మొక్కల లక్ష్యం కాగా, ఎనిమిది విడతల్లో ఇప్పటికే 273.33 కోట్ల మొక్కలు నాటారు. ఇందుకోసం ఇప్పటివరకు ప్రభుత్వం రూ. 10,822 కోట్లు ఖర్చుచేసింది. 2023–24 సంవత్సరంలో 19.29  కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ధేశించారు. ఆ లక్ష్యాన్ని అధిగమించేందుకు తెలంగాణకు హరితహారం పథకం తొమ్మిదో విడతకు కార్యాచరణ సిద్ధం అవుతోంది. రాష్ట్రంలోని 14,864 నర్సరీల్లో 30.29 కోట్ల మొక్కలను సిద్ధం చేస్తున్నారు. వాటిలోని 19.29 కోట్ల మొక్కలను ప్రస్తుత సంవత్సరం (2023)లో నాటనున్నారు. జలాశయాలు, చెరువులు వంటి నీటి వనరుల పక్కన ఎక్కువగా నాటేందుకు ప్రాధాన్యం ఇస్తారు. అలాగే 2024 వర్షకాలంలో నాటే మొక్కల లక్ష్యాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. వచ్చే ఏడాది 20.02 కోట్ల మొక్కలు నాటాలని నిర్ణయించింది.

దేశంలోనే అత్యధిక మొక్కలు నాటిన రాష్ట్రంగా తెలంగాణ పార్లమెంట్ రికార్డుల్లో నిలిచింది. ఏ రాష్ట్రం కనుచూపు మేరలో లేదు. మహారాష్ట్రలో 30 కోట్ల మొక్కలు నాటినట్లు రికార్డులు చెప్తున్నాయి. బ్రెజిల్, చైనా తర్వాత మూడో అతిపెద్ద మానవప్రయత్నంగా తెలంగాణకు హరితహారం చరిత్రకెక్కుతున్నది.

2015లో మొక్కగా మొదలై…

తెలంగాణ భౌగోళిక విస్తీర్ణం 2,77,10, 412 ఎకరాలు. అందులో 66,64,159 ఎకరాల్లో అడవులున్నాయి. దేశంలో సగటు అటవీ విస్తీర్ణం 21.34 శాతం కాగా.. తెలంగాణలో 24.05గా ఉన్నది. అయినా అంతర్జాతీయ స్థాయికి తగ్గట్టుగా భూభాగంలో 33 శాతం పచ్చదనం ఉండాలన్న సంకల్పంతో సీఎం కేసీఆర్ తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని 2015 జూన్లో ప్రారంభించి 230 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్దేశించారు. అడవుల వెలుపల 130 కోట్లు, అడవుల్లో 100 కోట్ల మొక్కలు నాటాలని నిర్ణయించారు. ఇందుకు రాష్ట్రవ్యాప్తంగా 14,926 నర్సరీలను ఏర్పాటుచేశారు. అన్ని రోడ్ల వెంట రహదారి వనాలకు ప్రాధాన్యం ఇవ్వాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కొత్త పంచాయతీ రాజ్ చట్టం అమల్లోకి వచ్చాక గ్రామాల్లో పచ్చదనం తొణికిసలాడుతున్నది.

హెచ్ఎండీఏ పరిధిలోనే 6 కోట్లు

హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) పరిధిలో 6 కోట్ల మొక్కలు నాటాలన్న లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించింది. ఆ తర్వాత జీహెచ్ఎంసీలో కోటి, రంగారెడ్డిలో  78.57 లక్షలు, నల్గొండలో 65.50 లక్షలు,  కొత్తగూడెం జిల్లాలో 65.40 లక్షల లక్ష్యం ఉంది. అత్యల్పంగా ములుగులో 14.79 లక్షలు, గద్వాల్లో 14.92 లక్షలు, సిరిసిల్లలో 15.94 లక్షల మొక్కలు నాటనున్నారు.

 2015-22 మధ్య నాటిన మొక్కలు, చేసిన ఖర్చుపై అటవీశాఖ గణాంకాలు ఇలా.. 

రాష్ట్రవ్యాప్తంగా నాటిన మొక్కలు :273.33 కోట్లు

హరితహారంపై చేసిన వ్యయం : రూ.10,822 కోట్లు

మొక్కలు నాటిన అటవీ ప్రాంతం: 1.40 లక్షల ఎకరాలు

అభివృద్ధి చేసిన పట్టణ అటవీ పార్కులు :109

పూర్తయిన అవెన్యూ ప్లాంటేషన్ (రోడ్ల వెంట నాటిన మొక్కలు).: 1.06 లక్షల కి.మీ

ఇందులో బహుళ వరుసల్లో 12,000 కి.మీ. పూర్తి

రాష్ట్రంలోని మొత్తం పల్లె ప్రకృతి వనాలు:19,472

బృహత్ పల్లె ప్రకృతి వనాలు :  2,725 ( పూర్తయినవి 2,011)