mt_logo

వైద్యారోగ్య శాఖలో 9,222 పోస్టుల భర్తీ :మంత్రి హరీష్ రావు

శిల్పకళ వేదికలో జరిగిన అసిస్టెంట్ ప్రొఫెసర్లకు నియామక పత్రాల అందజేత కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు..  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  

హైదరాబాద్‌, మే 22 :పేద ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులుగా చేరుతున్న మీ అందరికి వైద్యారోగ్య శాఖ మంత్రిగా స్వాగతం పలుకుతున్నాను. ప్రజల ప్రాణాలను కాపాడేలా మిమ్మల్ని తీర్చిదిద్దిన మీ తల్లిదండ్రులకు, మీ ఉపాధ్యాయులకు ఈ వేదికగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, ప్రభుత్వ వైద్యారోగ్య వ్యవస్థను పట్టిష్టం చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పెద్ద మొత్తంలో మెడికల్ కాలేజీలు, ఆసుపత్రులు నిర్మించారు. వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బందిని భర్తీ చేస్తున్నారన్నారు.  ఇందులో భాగంగా, టీచింగ్ ఆసుపత్రుల్లో సేవలు అందించేందుకు గాను, 34 స్పెషాలిటీల్లో 1,061 మందికి ఒకేసారి పోస్టింగ్ లు ఇస్తున్నాం. ఇది దేశంలో వైద్య విద్యలో రికార్డ్. సీఎం కేసీఆర్ వల్లే ఇది సాధ్యం అయింది అన్నారు. ఇది విప్లవాత్మక చర్య, కేవలం 5 నెలల్లోనే అత్యంత పారదర్శకంగా నియామక ప్రక్రియ పూర్తి చేసి, అపాయింట్‌మెంట్‌ ఆర్డర్స్‌ ఇచ్చేందుకు కృషి చేసిన వైద్య సిబ్బందికి అభినందనలు తెలియజేసారు. ఇదే వేదికగా గత నెలలో 969 మంది సివిల్ అసిస్టెంట్ సర్జన్లకు నియామక పత్రాలు అందించాము, 5204 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీ ప్రక్రియను త్వరలో ఆన్ లైన్ లో (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) నిర్వహించుకోబోతున్నామని తెలిపారు. 

మరో 9,222  పోస్టుల భర్తీ ప్రక్రియ

ఎన్నో ఏళ్ల కలను సాకారం చేస్తూ, సీఎం కేసీఆర్ వైద్య శాఖలోని ఏడు విభాగాల్లో మొత్తం 1331 కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరణ చేశారు. ఇందులో మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్లు, ల్యాబ్ టెక్నీషియన్లు, పారామెడికల్ ఆప్తాల్మిక్ ఆఫీసర్, మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్, ఆయుష్ విభాగానికి చెందిన డాక్టర్లు ఉన్నారు. గడిచిన 9  ఏళ్లలో ఒక్క వైద్యారోగ్య శాఖలోనే 22,263 పోస్టులు భర్తీ చేసుకోగా, మరో 9,222  పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోందన్నారు. రెండు మూడు నెలల్లో ఇది పూర్తవుతుంది. మొత్తంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత  31,484 పోస్టుల నియామక ప్రక్రియకు శ్రీకారం చుట్టాం అన్నారు. కొందరు ఉద్యోగాలు ఇవ్వడం లేదని అంటున్నారు. వారు కల్లుండి చూడలేక పోతున్నారు. ‘మెడిసిన్స్‌ క్యూర్‌ డిసీజెస్‌, బట్‌ ఓన్లీ డాక్టర్స్‌ కెన్‌ క్యూర్‌ పేషెంట్స్‌’. రోగులతో ప్రేమగా మాట్లాడితే వారి వ్యాధి సగం తగ్గుతుంది. మందులు రోగాన్ని నయం చేస్తే, వైద్యులు మాత్రమే రోగిని పూర్తి ఆరోగ్య వంతున్ని చేస్తారు, ఎన్ని మందులు ఇచ్చాము అనేదానికంటే, మీరు ప్రేమగా మాట్లాడే మాట, మీరు ఇచ్చే ధైర్యం సగం రోగాన్ని తగ్గిస్తుందన్నారు. మానసికంగా రోగికి ఆత్మవిశ్వాసం  కలిగిస్తుందన్నారు.