mt_logo

జపాన్‌కు చెందిన రెండు కంపెనీలు తెలంగాణాలో 575 కోట్ల పెట్టుబడి – 1600 ఉద్యోగాలు

  • స్థానికులకే ఉద్యోగాలు దక్కేలా కంపెనీలు హామీ 
  • అత్యంత కీలకమైన పారిశ్రామిక వాడగా చందనవెల్లి

రంగారెడ్డి జిల్లా చందన్ వల్లి లో Daifuku Intralogistics India’s డైఫుకు, Nicomac Taikisha  నికోమక్ తైకిషా క్లీన్‌ రూమ్స్‌ కంపెనీల శంకుస్థాపన కార్యక్రమంలో పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు పాల్గొన్నారు. రెండు కంపెనీల ఫ్యాక్టరీల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..  జపాన్ కి వెళ్ళిన ప్రతి సారి ఏదో ఒకటి కొత్తది నేర్చుకొని వస్తాం అన్నారు. అతి తక్కువ సహజ వనరులు అందుబాటులో ఉన్న అద్భుతమైన దేశం గా ఎదిగింది. ప్రకృతి వైపరీత్యాలు పదేపదే సవాళ్లు విసిరిన ఎదుర్కొని జపాన్ నిలబడుతున్నది. భారతదేశంలోని ప్రతి ఇంట్లో ఏదో ఒక జపాన్ ఉత్పత్తి ఉంటుంది. ఈరోజు తమ ఫ్యాక్టరీల నిర్మాణ పనులు ప్రారంభించిన ఈ రెండు కంపెనీలు కూడా భవిష్యత్తులో పెద్ద ఎత్తున విజయం సాధిస్తాయని నమ్ముతున్నాను అని ఆశాభావం వ్యక్తం చేసారు. 

575 కోట్ల పెట్టుబడి ద్వారా 1600 ప్రత్యక్ష ఉద్యోగాలు ఇస్తున్నాయి. ఇక్కడ స్థానికంగా ఉన్న ఐటీఐ ని దత్తత తీసుకొని స్థానికులకే ఉద్యోగాలు దక్కేలా కంపెనీలు హామీ ఇచ్చాయని తెలిపారు. ఈ కంపెనీలలో వచ్చే ఉద్యోగాలకు అవసరమైన శిక్షణను కూడా అందించనున్నాయన్నారు. చందన్ వెల్లి పారిశ్రామిక పార్కు కోసం స్థానిక నాయకులు, స్థానిక ప్రజలు ఇచ్చిన సహకారం వల్లనే పెద్ద ఎత్తున కంపెనీలు ఇక్కడికి వస్తున్నాయి. టెక్స్టైల్ నుంచి మొదలుకొని ఎలక్ట్రిక్ వాహనాలు దాకా విభిన్నమైన కంపెనీలు ఈ ప్రాంతాన్ని తమ కేంద్రంగా ఎంచుకుంటున్నాయని అన్నారు.  

అంతర్జాతీయంగా పేరు కలిగిన కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నాయి,  తెలంగాణ రాష్ట్రంలో అత్యంత కీలకమైన పారిశ్రామిక వాడగా చందనవెల్లి ఎదుగునున్నది అన్నారు. జపాన్ నుంచి మరిన్ని పెట్టుబడులు వచ్చేలా ఇందుకు అవసరమైన సహకారాలను జపాన్ కాన్సులేట్ నుంచి ఇవ్వాలని కేటీఆర్ కోరారు.  చందనవెల్లి లో  ప్రత్యేకంగా జపాన్ కంపెనీల కోసం అవసరమైతే ఒక క్లస్టర్ ని కూడా ఏర్పాటు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు.  జపాన్ కంపెనీల కచ్చితత్వం, పనితీరు మాదిరిగానే తెలంగాణ ప్రభుత్వం కూడా నిర్దిష్ట సమయంలో ఈ రెండు కంపెనీలకు అనుమతులు ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులోనూ ఇంతే ప్రభావవంతమైన తమ ప్రభుత్వ పని తీరును కొనసాగిస్తాం అని మంత్రి కేటీఆర్ తెలిపారు.