తెలంగాణ రాకముందు రాష్ట్రంలో నిత్యం కరెంట్ కోతలు. కాలిపోయే మోటర్లు.. పేలిపోయే ట్రాన్స్‌ఫార్మర్లు. కెంట్త్పూట బాయికాడే కరెంటు కోసం రాత్రిపూటే రైతులు బాయికాడ పండుకోవాల్సిన దుస్థితి. విషపురుగులు కరిచి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. ఎప్పుడొస్తుందో తెలియదు.. ఎన్ని గంటలు ఉంటుందో తెలియదు.. అసలు వస్తదా.. రాదా? వస్తే లోవోల్టేజీ సమస్య ఉంటుందా?.. ఇలా సవాలక్ష ప్రశ్నలతో అన్నదాతలు, ప్రజలు కరెంట్ లేక నిద్రలేని రాత్రులు గడిపేవారు. తెలంగాణ సాధించుకొన్నాక స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ కేవలం ఏడాదిలోనే కరెంట్ సమస్య తీరుస్తానని ప్రజలకు భరోసా ఇచ్చారు. విద్యుత్తు అధికారులతో మేధోమథనం జరిపి రాష్ట్రంలో విద్యుదుత్పత్తి సామర్థ్యం పెంచడంతోపాటు ఇతర రాష్ట్రాలనుంచి కొనుగోలు చేసి, 24 గంటల కలను సాకారం చేశారు. అప్పటినుంచీ తెలంగాణలో వెలుగులు విరజిమ్ముతున్నాయి. నిత్య కరెంట్‌తో అన్నదాతలతోపాటు విద్యుత్తుపై ఆధారపడిన పారిశ్రామిక, వ్యాపారవర్గాల జీవితాల్లో వెలుగులు నిండాయి. కన్నుకొట్టినంతసేపుకూడా కరెంటు పోకపోవడంతో ఎండాకాలంలోనూ గృహ వినియోగదారులు ఎలాంటి ఇబ్బందిలేకుండా చల్లగా బతుకుతున్నారు. దీంతో తెలంగాణలో రోజురోజుకూ విద్యుత్తు డిమాండ్ పెరిగిపోయింది.
అత్యధిక విద్యుత్తు డిమాండ్ నమోదు
సీఎం కేసీఆర్ విజన్‌తో తెలంగాణ సర్కారు అన్నదాతలకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్తు అందజేస్తున్నది. దీంతో సాగు సంబురమైంది. రైతులు ఆనందంగా పంటలు పండించుకొంటున్నారు. ఈ వానకాలంలో వర్షాభావ పరిస్థితులు, వరిసాగు విస్తీర్ణం పెరగడంతో విద్యుత్తు వినియోగం అమాంతం పెరిగిపోయింది. శుక్రవారం (నేడు) ఉదయం రాష్ట్రంలో 14,136 మెగావాట్ల విద్యుత్తు డిమాండ్ నమోదైనట్టు అధికారులు ప్రకటించారు. ఈ డిమాండ్ ఎండాకాలాన్ని అధిగమించినట్టు తెలిపారు. నిరుడు ఇదే సమయానికి 12,251 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఏర్పడగా.. ఈ ఏడాది 2000 మెగావాట్లకుపైగా ఎక్కువ డిమాండ్ ఏర్పడింది. ఎంత డిమాండ్ ఉన్నా సాగు, వినియోగదారులకు విద్యుత్ ఇచ్చి తీరుతామని ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ డీ ప్రభాకర్‌రావు స్పష్టం చేశారు. ఏది ఏమైనా 24 గంటల విద్యుత్తు ఇచ్చి తీరాల్సిందేనని సీఎం కేసీఆర్ ఎప్పుడూ ఆదేశిస్తుంటారని తెలిపారు.