mt_logo

బ్రెయిన్ డెడ్ అయిన వ్య‌క్తుల అవ‌య‌వ దానాల్లో తెలంగాణ దేశంలోనే అగ్ర‌స్థానంలో ఉంది : మంత్రి హరీశ్ రావు 

హైదరాబాద్: బ్రెయిన్ డెడ్ అయిన వ్య‌క్తుల అవ‌య‌వ దానాల్లో తెలంగాణ దేశంలోనే అగ్ర‌స్థానంలో ఉందన్నారు మంత్రి హరీశ్ రావు. 13వ జాతీయ అవయవ దాన దినోత్సవం సందర్భంగా జీవన్ దాన్ ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో అవయవ దానం చేసిన కుటుంబాలను సన్మానించే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఆర్థిక వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. అత్యధిక అవయవ దానాలు జరిగిన రాష్ట్రంగా తెలంగాణ సాధించిన ఘ‌న‌త‌ను కేంద్ర ప్ర‌భుత్వం గుర్తించింది. నేడు ఢిల్లీలో జ‌రిగే జాతీయ అవ‌య‌వ‌దాన కార్య‌క్ర‌మంలో తెలంగాణ ప్రతినిధులు కేంద్ర ఆరోగ్య మంత్రి చేతుల మీదుగా ప్రథమ బహుమతి అందకుంటుంది. ఈ సందర్భంగా అందరికీ అభినందనలు. కేసీఆర్ తీసుకున్న నిర్ణయాల వల్ల, కల్పించిన మౌలిక సదుపాయాల వల్ల ఇది సాధ్యం అయ్యిందన్నారు. అయిన వారిని కోల్పోయామనే బాధలో ఉండి కూడా, మరొకరికి ప్రాణం పోయాలని ఆలోచించడం, అమలు చేయడం  గొప్ప విషయం. మీ నిర్ణయం ఎందరికో స్ఫూర్తిదాయకం. బాధలో కూడా సామాజిక బాధ్యతను నిర్వర్తించిన మీ అందరికి చేతులెత్తి మొక్కుతున్నాను.  రియల్ హీరోస్ గా మారిన 105 కుటుంబాలను నేషనల్ ఆర్గాన్ డొనేషన్ డే  సందర్బంగా ఈరోజు సన్మానించుకోవడం సంతోషంగా ఉందన్నారు. 

మీరు తీసుకున్న నిర్ణయం వల్ల నేడు ఎంతో మంది పునర్జన్మ పొందారు. మీ సంబంధీకులు మీ ముందు లేకపోయినప్పటికీ, మరొకరి రూపంలో మన మధ్యలోనే ఉన్నారు. నుదిటి గీతను సైతం మార్చి, ప్రాణం నిలిపిన మీరు మరో బ్రహ్మలు. బ్రెయిన్ డెడ్ అయిన వ్య‌క్తుల అవ‌య‌వ దానాల్లో తెలంగాణ దేశంలోనే అగ్ర‌స్థానంలో ఉన్న‌ది. 2022 సంవ‌త్సంర‌లో తెలంగాణ‌లో 194 మంది అవ‌య‌వ దానం చేశారు. త‌మిళ‌నాడు 156, క‌ర్ణాట‌క 151, గుజ‌రాత్ 148 అవ‌య‌వ‌దానాల‌తో త‌ర్వాతి స్థానాల్లో ఉన్నాయి. 2013 జీవన్ దాన్ కార్యక్రమం ప్రారంభం కాగా, ఇప్పటి వరకు 1288 బ్రెయిన్ డెత్ డొనేషన్స్ జరిగాయి. మొత్తం 4829 ఆర్గాన్స్ సేకరించి, అవసరం ఉన్న వారికి అమర్చడం జరిగింది. అవ‌య‌వ మార్పిడి చికిత్స‌ల విష‌యంలోనూ తెలంగాణ దేశంలోనే మొద‌టి స్థానంలో ఉంది. 2022లో దేశ‌వ్యాప్తంగా 1675 ట్రాన్స్ ప్లాంట్ స‌ర్జ‌రీలు జ‌రిగితే.. తెలంగాణ‌లోనే 530 జ‌రిగాయి. త‌మిళ‌నాడు 519, క‌ర్ణాట‌క 415 స‌ర్జ‌రీల‌తో త‌ర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

ఈ ఏడాది ఇప్పటి వరకు 126 ఆర్గాన్ డొనేషన్లు న‌మోద‌య్యాయి. అయితే ఇది చాలదు. జీవన్ దాన్ లో నమోదై, అవయవాల మార్పిడి చేసుకొని జీవితాన్ని పొడిగించుకోవాలని చూస్తున్న వారి సంఖ్య సుమారు 3వేలుగా ఉంది.  అవ‌య‌వ మార్పిడి అన‌గానే ఒక‌ప్పుడు కార్పోరేట్ ఆసుపత్రులే గుర్తుకు వ‌చ్చేవి. కానీ ఇప్పుడు కార్పొరేట్ కు ధీటుగా మన ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ ఖరీదైన  ట్రాన్స్ప్లాంటేషన్లు జరుగుతున్నాయి.  ఇప్ప‌టివ‌ర‌కు నిమ్స్ లో 395, ఉస్మానియాలో 74, గాంధీలో 11 మొత్తం 480 ట్రాన్స్ప్లాంటేషన్స్ జ‌రిగాయి. ఇందులో అత్యధికంగా 436 కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్ ఉన్నాయి. గ‌త నెల‌లో నిమ్స్ లో ఆరోగ్య శ్రీ కింద తొలిసారిగా ఊపిరితిత్తుల మార్పిడి శ‌స్త్ర చికిత్స జ‌రిగింది. నిమ్స్ వైద్యులు ఒకే రోజు రెండుమూడు అవ‌య‌వ మార్పిడుల‌ను విజ‌య‌వంతంగా నిర్వ‌హిస్తున్నారు. దీంతో రాష్ట్రంలో ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంట్ స‌ర్జ‌రీల‌కు నిమ్స్ కేరాఫ్ గా మారింది. రూ. 10 లక్షల నుంచి రూ.15 ల‌క్ష‌ల వ‌ర‌కు ఖ‌ర్చ‌య్యే విలువైన ట్రాన్స్ప్లాంట్ సర్జరీలను ప్రభుత్వం పేద‌ల‌కు ఆరోగ్య శ్రీ ద్వారా ఉచితంగా చేరువ చేసింది. దీంతో పాటు సర్జరీ చేసుకున్న వారికి జీవిత కాలం పాటు నెలకు 10వేల నుంచి 20 వేల  విలువ చేసే మందులను ఉచితంగా అందిస్తున్నది. మారిన జీవన శైలి, ఆహార అలవాట్లు, ధూమపానం, మద్యపానం తదితర కారణాల వల్ల రోగాలు చుట్టుముట్టి, చిన్న వయస్సులోనే దీర్ఘకాలిక రోగాల బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతున్నదని తెలిపారు. 

అవగాహన లేమి, నిర్లక్ష్యం కారణంగా రోగాలను ప్రాథమిక దశలోనే గుర్తించి, పరీక్షలు చేయించుకుని వైద్యం పొందక పోవడం వల్ల ఆ రోగాలు ముదిరి అవయవాలపై చెడు ప్రభావం చూపుతున్నాయి.  బీపీ, షుగర్ సమస్యలను నిర్లక్ష్యం చేయడం వల్ల దీర్ఘకాలంలో కిడ్నీలు, కాలేయం, కంటి సమస్యలు ఎదురై ఆర్గాన్స్ ఫెయిల్ అవుతున్నాయి. అవయవాల మార్పిడి చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని అన్నారు. వైద్య రంగం ఎంత అభివృద్ధి చెందినప్పటికీ.. కిడ్నీ, కాలేయం, గుండె తదితర అవయవాలను కృత్రిమంగా తయారు చేయలేము. అంతటి సాంకేతికత ఇంకా అభివృద్ధి చెందలేదు. కాబట్టి మరణించిన తర్వాత విలువైన అవయవాలు మట్టిలో కలిపే కంటే దానం చేయడం ఎంతో మిన్న. బ్రెయిన్ డెడ్ అయిన సందర్బాల్లో కుటుంబ సభ్యులు సామాజిక బాధ్యతను నిర్వర్తించి, ఆర్గాన్ డోనేషన్ ద్వారా ప్రాణం పోయాలి. బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి నుంచి గుండె, కాలేయం, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, పాంక్రియాస్, చర్మం, కార్నియా, ఎముక కణజాలం, గుండె కవాటాలు, రక్త నాళాలను సేకరించి అవసరమైన రోగులకు దానం చేయవచ్చు. ఒక్క వ్యక్తి నుంచి సేకరించిన ఆర్గాన్స్ లో 8 మందికి ప్రాణం పోయవచ్చని సూచించారు. 

అవయవదానం విషయంలో తెలంగాణ అనుసరిస్తున్న విధానాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఈ ప్రక్రియ పారదర్శకంగా జరిగేలా తొలిసారిగా తెలంగాణ ఆన్లైన్ పోర్టల్ ను ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వం సహా ఏపీ, కేరళ, గుజరాత్, ఒరిస్సా, కర్ణాటక రాష్ట్రాలు మన విధానాన్ని అనుసరిస్తున్నాయి. డొనేషన్లు, ట్రాన్స్ ప్లాంటేష‌న్ల విషయంలో తెలంగాణ మెరుగైన పనితీరును కనబర్చుతున్నది. మొత్తం 36 ప్రభుత్వ ఆసుపత్రులు జీవన్ దాన్ లో రిజిస్ట్రర్ కాగా, నిమ్స్, ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల్లో ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంటేష‌న్లు జరుగుతున్నాయి. ఈ సృష్టిలో నీ ఊపిరి ఉన్నంత వరకు నీవు చేసే ప్రతి సాయం దేవుడు లెక్కవేస్తాడు తప్ప మూఢ నమ్మకాలను ఆచరించడం వల్ల ప్ర‌యోజ‌నం ఉండ‌దు. పుట్టుక- చావు మన చేతిలో ఉండవు. కానీ మనం మ‌ర‌ణించినా ఈ లోకంలో బ‌తికి ఉండే ఏకైక మార్గం అవ‌య‌వ‌దానం. కాబట్టి అందరూ అవయవ దానం చేయాలని  ఈ సభా ముఖంగా కోరుతున్నానన్నారు.