mt_logo

కుంభమేళాను తలపిస్తున్న తెలంగాణ గోదావరి మహా పుష్కరాలు!

ఈనెల 14న ప్రారంభమైన గోదావరి పుష్కరాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కుంభమేళాను తలపిస్తున్నాయి. గడిచిన ఆరు రోజుల్లో దాదాపు ఒక్క కోటీ 81 లక్షల మంది పుష్కర స్నానం చేసినట్లు సమాచారం. శనివారం ఒక్కరోజే 62 లక్షలమంది భక్తులు పుష్కర స్నానం చేయగా, ఆదివారం కూడా 61 లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలు చేశారు. వరుసగా రెండురోజులు సెలవుదినాలు కావడంతో పుష్కరాలు జరిగే ఘాట్లన్నీ జనసందోహంతో నిండిపోయాయి. పుష్కరాలకు తెలంగాణ నుండే కాకుండా రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న మహారాష్ట్ర, కర్నాటక, ఆంధ్రప్రదేశ్ నుండి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి తెలంగాణలో పుష్కర స్నానాలు చేస్తున్నారు.

పుష్కరాలకు వచ్చే భక్తులకు ఏమాత్రం ఇబ్బందులు కలగకుండా తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నది. అంతేకాకుండా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు హైదరాబాద్ లోని తన అధికార నివాసం నుండి ఎప్పటికప్పుడు అధికారులు, మంత్రులతో మాట్లాడుతూ పరిస్థితి సమీక్షిస్తున్నారు. ప్రధాన ఘాట్ లకు వెళ్లే మార్గాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా సీఎంవో అధికారులకు బాధ్యతలు అప్పగించారు. హెలికాప్టర్ ద్వారా డీజీపీ అనురాగ్ శర్మ కందకుర్తి నుండి భద్రాచలం వరకు ఏరియల్ సర్వే చేసి పరిస్థితిని సమీక్షించారు. సీఎం ఆదేశాలతో ట్రాఫిక్ అంతరాయాలు కలుగకుండా మంత్రులు సైతం రోడ్లెక్కి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. కొంతమంది మంత్రులైతే ఇళ్ళకు కూడా వెళ్ళకుండా పుష్కర ఘాట్ల వద్ద ఉండి ప్రజలతో మాట్లాడుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకుని ఆ దిశగా చర్యలు చేపడుతున్నారు.

వివిధ జిల్లాల్లో పుష్కర ఘాట్లను పర్యవేక్షిస్తున్న మంత్రులు హరీష్ రావు, లక్ష్మారెడ్డి, జోగు రామన్న, జగదీష్ రెడ్డి, చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ లకు సీఎం కేసీఆర్ ఆదివారం ఫోన్ చేసి మాట్లాడారు. భక్తులు పుష్కర ఘాట్లకు వెళ్ళడానికి ఎక్కడెక్కడ ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నాయి? ఎన్ని బస్సులు నడుస్తున్నాయి? ఇంకా ఎన్ని బస్సులు కావాలి? అని వివిధ అంశాల గురించి అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతం నుండి భద్రాచలం వంటి చోట్లకు అధిక సంఖ్యలో భక్తులు వస్తున్నారని, వారికి అవసరమైన రవాణా, ఇతర ఏర్పాట్లు చేయాలని సీఎం కేసీఆర్ మంత్రులకు సూచించారు. అనంతరం ఆర్టీసీ ఎండీ రమణారావుతో మాట్లాడి పుణ్యస్నానాలకు వెళ్లే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎన్ని బస్సులు అవసరం ఉంటే అక్కడకు అన్ని బస్సులు పంపాలని ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *