
హైదరాబాద్‌లో కాంగ్రెస్ నిర్వహించనున్న ‘యువ సంఘర్షణ సభ’లో పాల్గొనేందుకు ప్రియాంకాగాంధీ రానున్నారు. ఈ సందర్బంగా మంత్రి కేటీఆర్ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఎవరో రాసిచ్చిన స్రిప్ట్‌ను బట్టీ పట్టి చదివే కాంగ్రెస్ మార్ సంస్కృతిని పక్కనపెట్టి.. ఇక్కడ పరిస్థితిని స్వయంగా చూసి అధ్యయనం చేయాలని ప్రియాంకా గాంధీ కి సూచించారు. శంషాబాద్ విమానాశ్రయంలో దిగి హైదరాబాదులోకి ప్రవేశించేపుడు.. కనిపించే అద్భుతమైన ఫ్లై ఓవర్లు, అందమైన రోడ్లు, నూతన నిర్మాణాలు, ప్రపంచ దిగ్గజ ఐటీ కంపెనీల కార్యాలయాలు చూసి పరిపాలనా ఎలా చేయాలనేది ప్రియాంకగాంధీ తెలుసుకోవాలని, మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ సూచించారు. ‘ఆవో.. దేఖో.. సీఖో’ అంటూ ఆమెకు స్వాగతం పలికారు.
ఉమ్మడి ఏపీ చరిత్రలో ఏపీపీఎస్సీ ద్వారా కాంగ్రెస్ భర్తీ చేసిన ఉద్యోగాలు ఎన్ని? ఈ 9 ఏండ్లలో తెలంగాణ ప్రభుత్వం భర్తీ చేసిన ఉద్యోగాలు ఎన్ననేవి తెలుసుకోవాలని ప్రియాంక గాంధీకి సూచించారు. దేశంలో నిరుద్యోగ సమస్యకు బీజేపీ, కాంగ్రెస్ కారణమని కేటీఆర్ మండిపడ్డారు. అధికారం కోసం ఉద్యోగాలకు సిద్ధమవుతున్న యువతను రెచ్చగొట్టాలని చూస్తే తెలంగాణ సమాజం సహించబోదని హెచ్చరించారు. 2004లోనే తెలంగాణ ఇచ్చి ఉంటే వందలాదిమంది తెలంగాణ బిడ్డల బలిదానాలు జరిగేవి కాదన్న నిజాన్ని ప్రియాంకగాంధీ తెలుసుకోవాలని కేటీఆర్ సూచించారు. సోనియాగాంధీని బలిదేవత అని తిట్టిన వ్యక్తికే పీసీసీ చీఫ్ పదవి ఇచ్చిన కాంగ్రెస్ నాయకత్వానిది అమాయకత్వమో, ఆత్మహత్యా సదృశ్యమో మీరే తేల్చుకోవాలని అన్నారు.