mt_logo

మోడీ దేశానికి ప్రధానా ? లేక ఎన్నికలు జరిగే రాష్ట్రాలకా ? : మంత్రి కేటీఆర్‌

వంటగ్యాస్‌, పాలు ఇతర రాష్టాలకు ఎందుకు ఇవ్వడం లేదు: కేటీఆర్ 

రాజన్న సిరిసిల్ల: ఉచితాలు వద్దని చెప్పి పాలు, పెరుగు, వంటగ్యాస్‌ సిలిండర్లు ఉచితంగా ఇస్తామంటూ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల మ్యానిఫెస్టోలో బీజేపీ ప్రకటించడంపై రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌, పరిశ్రమల శాఖల మంత్రి కే. తారకరామారావు ఆగ్రహం వ్యక్తంచేశారు. నరేంద్రమోదీ దేశానికి ప్రధానా? లేక ఒక్క కర్ణాటక రాష్ట్రానికే ప్రధానా? అని నిలదీశారు. సిలెండర్ ధర రూ. 400 నుంచి 1200 కు పెంచిన బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో 3 సిలెండర్లు ఉచితంగా ఎందుకు ఇవ్వద్దని, మిగితా రాష్ట్రాల్లో కూడా ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. మరియు ఉచితంగా ఇస్తామంటున్న వంటగ్యాస్‌, పాలు ఇతర రాష్టాలకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ‘ఫ్రీబీ కల్చర్‌, రేవ్‌డీ కల్చర్‌’ అంటూ పదేపదే గొంతుచించుకున్న ప్రధాని, అదే కల్చర్‌ను అవలంబిస్తున్నారని మండిపడ్డారు. అదానీ కొన్న ఎయిర్‌పోర్టుకు జీఎస్టీ లేదు కానీ.. పాలు, పెరుగు, చివరికి సామాన్యుడి మందులపైనా పన్నులు వేశారని ధ్వజమెత్తారు.

తడిసిన ధాన్యాన్నీ,రంగు మారిన కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది

అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకొంటుందని భరోసా ఇచ్చారు. బీఆర్‌ఎస్‌ అంటేనే భారత రైతు సమితి అని గుర్తుచేశారు. పంట నష్టపోయిన రైతులకు పరిహారం డబ్బులు త్వరలో విడుదల చేస్తామని అన్నారు. మంగళవారం రోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో కేటీఆర్‌ విస్తృతంగా పర్యటించారు. గోపాల్‌పల్లి, వీర్నపల్లి మండలం గుంటపల్లి చెరువు తండా, సిరిసిల్ల అర్బన్‌ మండలం పెద్దూరులో అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. బాధిత రైతులతో మాట్లాడి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం సిరిసిల్ల కలెక్టరేట్‌లో మీడియాతో మాట్లాడారు. జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడల ముగింపు సమావేశానికి హాజరై విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. మహిళల రక్షణకోసం ఏర్పాటు చేసిన మొబైల్‌ యాప్‌ను, హెల్ప్‌లైన్‌ నంబర్‌ను ప్రారంభించారు. హైదరాబాద్‌ తిరిగి వచ్చే మార్గమధ్యంలో గ్రామాల్లో రోడ్ల పక్కన ఆరబోసిన ధాన్యం కుప్పలను పరిశీలించారు. పంట నష్టపోయిన రైతులకు నేనున్నా అంటూ ధైర్యం చెప్పారు. తడిసిన ధాన్యాన్నీ,రంగు మారిన కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని మంత్రి కేటీఆర్‌ హామీ ఇచ్చారు.