
తెలంగాణలో ఇప్పటికే అనేక అంతర్జాతీయ సంస్థలు పెట్టుబడులు పెట్టాయి. మరికొన్ని సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. మంగళవారం ఉదయం సంగారెడ్డిలోని ఫ్లిప్కార్ట్ ఫుల్ ఫిల్మెంట్ సెంటర్ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ వర్చువల్ విధానంలో ప్రారంభించారు. బేగంపేటలో ఐటీసీ కాకతీయలో జరిగిన ఈ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ కామర్స్ రంగం వేగంగా దూసుకుపోతోందని, ఫ్లిప్ కార్ట్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 40 వేల మందికి ఉపాధి కల్పన లభిస్తుందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏం చేస్తే దేశం అదే ఫాలో అవుతుందని అన్నారు. రాష్ట్రంలో మహిళా స్వయం సహాయక బృందాలు విజయవంతంగా పని చేస్తున్నాయి. ఉపాధి కల్పనలో మహిళలకు 50 శాతం ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రపంచంలో ఈ కామర్స్ రంగం వేగంగా వృద్ధి చెందుతుందని మంత్రి అన్నారు. పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని కోరారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు తెలంగాణ ప్రభుత్వం సహాయ సహకారాలు అందజేస్తుందని కేటీఆర్ వెల్లడించారు.