By: వరవరరావు
నేను జార్జిని చూసిన జ్ఞాపకం లేదు. కాని 1972 ఏప్రిల్ 14 సాయంకాలం నుంచి ప్రతి సాయం సంధ్యలోనూ ప్రతి ఉదయసంధ్యలోనూ ఆకాశంలోనే కాదు, నేలమీద కూడా ఆయన అడుగుజాడల్లో నడిచిన, నడుస్తున్న అసంఖ్యాకమైన విద్యార్థి యువజనులను, విప్లవకారులను, సామ్రాజ్యవాద భూస్వామ్య వ్యతిరేక పోరాటాల్లోనూ, అన్ని రకాల ఆధిపత్య వ్యతిరేక పోరాటాల్లోనూ ప్రాణాలర్పించిన, అర్పిస్తున్న ఎందరినో చూస్తున్నాను. ఆ దారి రక్తసిక్తమైన దారి. ముళ్లదారి. కాని ఆ దారి చివరన సమతాసుందర స్వప్నాలు పుష్పించిన ఉద్యానవనాలుంటాయని స్వప్నించిన వాళ్లు వాళ్లందరు.
వాళ్లందరూ చనిపోయారు. కాని వాళ్ల స్వప్నాలు చనిపోవు.
1972 జూలై14 సాయంత్రం ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజీ మెట్లపై ఎబివిపి, ఆర్‌ఎస్‌ఎస్ గూండాలు, వాళ్లు తోడు తెచ్చుకున్న మాఫియా జార్జిని కత్తిపోట్లతో చంపేసిన తర్వాత, ఆ వార్త మాకు వరంగల్‌లో ఆ రాత్రికే చేరి కలవరపెట్టిందో, ఆ రాత్రి కలత నిద్రలో మాకు పేగు కదిలిందో, మర్నాడు ఉదయమే తెల్సిందో ఇపుడు జ్ఞాపకం లేదు. ఇప్పటి వలే హైటెక్ సమాచార సాధనాలు నాడు లేవు. కానీ, నిస్సంకోచంగా ప్రత్యామ్నాయ విప్లవ సమాచార సాధనాలున్నాయి. బహుశా ఆ ఇంజనీరింగ్ కాలేజీ మెట్లమీంచి ఆ నవయవ్వన కవోష్ణ రక్తమే అప్పటికే విప్లవ విద్యార్థి ఉద్యమంతో వెల్లివిరిసిన వరంగల్ ఇంజనీరింగ్ కాలేజీ , మెడికల్ కాలేజీ, ఆర్ట్స్‌అండ్ సైన్స్ కాలేజీ, సికెయం, ఎల్‌బి కాలేజీలకు ప్రవహించి మాకు అమరసందేశాన్ని ఇచ్చిందేమో. 15 ఉదయం విద్యాసంస్థలు తెరిచే సమయానికి కాలేజీలు, స్కూళ్లు బహిష్కరించి ఆజంజాహి మిల్లు, కాశీబుగ్గ, పోచమ్మ మైదానాల మీదుగా కలెక్టరాఫీసు దాకా కూడా ఒక జానకితాడు ముట్టించిన వంటి ఒక పెద్ద ఊరేగింపు. అందులో ఆజంజాహి మిల్లు కార్మికులు, కాశీబుగ్గ చేనేత కార్మికులు, సికెయం కాలేజీ విద్యార్థులు, అధ్యాపకులు మొదలుకొని ఆర్‌టిసి కార్మికులు, రైల్వే కార్మికులు పెద్దమ్మగడ్డ నుంచి విప్లవాభిమానులైన దళితులు, విప్లవ రచయితలు ‘పిడిఎస్’ పేరుతో విప్లవవిద్యార్థులు అప్పటికే శ్రామికవర్గ సాంస్కృతిక విప్లవకాలం నుంచి అంటే ఉక్కు ఉద్యమం కాలం నుంచి విప్లవ ప్రచారాచరణలో ఉన్న విద్యార్థులున్నారు. జీవనపోరాటంలోని వివిధ వృత్తుల, వ్యావృత్తుల వాళ్లున్నారు. వాళ్లందరి ప్రవృత్తి మాత్రం విప్లవం.
ఈ ఊరేగింపును బహుశా ఆర్గనెజ్ చేసినవాళ్లు మాత్రం స్వరాజ్యం, ఎస్.సత్యనారాయణరావు (పిడిఎస్‌యు ఏర్పడినాక మొదటి కార్యదర్శి,మా సికెయం కాలేజీ విద్యార్థి), విరసంసభ్యుడు, బట్టలు కుట్టి బతుకుతున్న జ్ఞానేశ్వర్ కీర్తి. 1968 నుంచే ‘హమారాబరి తుమారా బరి- సబ్‌కా బరి నక్సల్‌బరి’, ‘హమారా నామ్ తుమారా నామ్- సబ్‌కానామ్ వియత్నామ్’ అనే నినాదాలు, ‘ఇన్‌క్విలాబ్ జిందాబాద్’ అనే నినాదం నిత్యపారాయణమైన మాకు ఆ ఊరేగింపు మాకు కొన్ని కొత్త నినాదాలందించింది. అంటే కొన్ని కొత్త పోరాట అస్త్రాలందించింది. ప్రదీప్ రాసినట్లు అవి జార్జి రచించినవే (కాయిన్ చేసినవే) కాకపోవచ్చు. రంగ్‌దే బసంతి, ఇన్‌క్విలాబ్ జిందాబాద్ భగత్‌సింగ్ పర్యాయపదాలైనట్టు జీనా హైతో మర్‌నాసీకో, కదమ్ కదమ్ పర్ లడ్‌నా సీకో, జోర్ జులుమ్ కే టక్కర్‌మే సంఘర్ష్‌హమారా నారా హై, జో హమ్‌సే ఠక్‌రాయేగా, ఓ మిట్టీమే మిల్‌జాయేగా నినాదాలు జార్జ్ వారసులనుంచే ఇవ్వాలటికీ ఎక్కువగా వింటున్నాం. (ఉర్దూనో, ఖడీబోలీనో, హిందీనో, హిందూస్థానీయో భాషలో ఉండే ఈ నినాదాలు ఎందుకు ఈ రోజుల్లో ఎక్కువగా వినరావడం లేదో ఒక్కసారి స్వీయపరిశీలన చేసుకుందామా?) ఈ నినాదాలు ఒక నవయవ్వన ఆదర్శ ఆకాంక్షలను ప్రతిధ్వనించేవి.
ఆ మర్నాడో, ఒకటి రెండ్రోజుల్లోనో హైదరాబాద్, సారస్వత పరిషత్ బయటి ఆవరణలో జార్జ్ సంస్మరణ సభ జరిగింది. ఆ సభలో నన్నూ మాట్లాడమని అడిగారు. అప్పటికింకా విరసం వక్తగా నాకు అలివిడి కాలేదు. ఒక తెనాలి విరసం సభలోనో, ఒక వరంగల్ తెలంగాణ ఉద్యమ సభలోనో మాట్లాడి ఉండవచ్చు. ఆ సభకు కె.శ్రీనాథరెడ్డి అధ్యక్షత వహించాడు. ఆ విప్లవ ఉత్తేజకరమైన సభను ముగిస్తూ ఆయన ఒకే వాక్యంతో ముక్తాయింపు చేశాడు. ‘సభ ముగిసింది, ఇంక చరిత్ర మొదలవుతుంది’.(ది మీటింగ్ ఈజ్ ఓవర్, నవ్ ద హిస్టరీ బిగిన్స్). అక్షరాలా జార్జ్, జార్జ్ విప్లవ సంప్రదాయానికి, జార్జ్ అమరత్వం మరుక్షణం నుంచి చరిత్ర మొదలయింది.
చరిత్ర అప్పుడే మొదలయినట్లు కాదు, చరిత్రలో నక్సల్బరీతో ప్రారంభమైన నూతన ప్రజాస్వామిక విప్లవ నిర్మాణ చరిత్ర 1966 శ్రామికవర్గ సాంస్కృతిక విప్లవ ప్రభావంతో మొదలయిందని చెప్పవచ్చు. 67 నక్సల్బరీతో ప్రారంభమైందని చెప్పవచ్చు. కాని ఆ పోరాట త్యాగ చరిత్రలో నక్సల్బరీ, శ్రీకాకుళం సెట్‌బ్యాక్‌లకు ముందు క్యాంపస్‌లలో, ముఖ్యంగా తెలుగు నేలమీద పంచాది కృష్ణమూర్తి, చాగంటి భాస్కరరావు, మల్లికార్జున్, దుష్యంత్‌ల తర్వాత ఒక పోరాట త్యాగచరిత్రకు ఉస్మానియా క్యాంపస్ నుంచి జార్జ్ ఒరవడి పెట్టాడు. ఇంక ఆ జాబితాలో ఇవ్వాటిదాకా ఎందందరో.
ఆచరణ, ఆచరణేయ జ్ఞానం, జ్ఞానమే పోరాటం, పోరాటమే త్యాగంగా బతికినవాడు జార్జ్. జ్ఞాన సంపన్నత్వం, ప్రజాసేవ ఆచరణగా, ప్రజాసేవ ఆచరణలో నిజాయితీ, విలువలు, అసాధారణమైన సాధారణత్వం, సాహసం, నిత్యపోరాట శీలం సహజంగానే ఈ అన్నింటి సమాహారం త్యాగంలోనే పర్యవసించడం ఇదీ జార్జ్ పెట్టిపోయిన ఒరవడి. ఈ ఒరవడి కమ్యూనిస్టు సంప్రదాయం నుంచి వచ్చింది. విప్లవోద్యమ సంప్రదాయం నుంచి వచ్చింది. మార్క్స్ నుంచి శాస్త్రీయంగా ఆచరణలోకి వచ్చింది. కానీ మనకు స్పార్టకస్ నాటినుంచి ఉన్నదే. కాని జార్జ్ తర్వాత క్యాంపస్‌లలో అది చైనాలో మే 4 విద్యార్థి ఉద్యమం, శ్రామికవర్గ సాంస్కృతిక విప్లవం వలె మళ్లీ మన క్యాంపస్‌లలో ఒక పోరాటాల, త్యాగాల ఒరవడిని నెలకొల్పింది. విద్యావంతుల్లో అది సరోజ్‌దత్తాతో ప్రారంభమైందో, కలకత్తా జాదవ్‌పూర్ యూనివర్సిటీల్లో గోల్డ్‌మెడల్స్ పొందిన విద్యార్థులు నక్సల్బరీ ఆదివాసీ రైతాంగంతో పాటు ప్రాణాలర్పించిన ఉదంతాలు చరిత్రలో విని పులకించిపోయాం. మన కళ్ల ముందు ఒక జార్జ్‌ను చూశాం. కాకతీయ క్యాంపస్‌నుంచి వచ్చి 2002లో రాష్ట్ర విప్లవోద్యమ నాయకుడిగా కృష్ణానదిలో పుట్టి మునిగి చనిపోయిన లింగమూర్తిని చూశాం. ఇద్దరూ గోల్డ్‌మెడలిస్టులు. ఒకాయన ఫిజిక్స్‌లో, మరొకాయన తెలుగులో.
ఇవ్వాళ తెలంగాణ ఉద్యమంలో ఒక ప్రజాస్వామిక ఆకాంక్ష కోసం ఆత్మహత్యలు చేసుకుంటున్న విద్యార్థులకు ఒకసారి ఆ జాబితా వివరించాలని ఉన్నది. సూరపనేని జనార్దన్, మురళీమోహన్, ఆనంద్‌రావు, జంపాలప్రసాద్, శ్రీహరి, చాంద్‌పాషా, పులి అంజయ్య, గోపగాని ఐలయ్య, నాగేశ్వరరావు, రామకృష్ణ,యాకయ్య, శ్యాంప్రసాద్, మారోజు వీరన్న, రంగవల్లి, వీరన్న (వీరారెడ్డి), ప్రసాద్, వెంకటయ్య (వీళ్లంతా తెలంగాణ విశ్వవిద్యాలయాలకు చెందిన వాళ్లు), నాగరాజు, చలపతి, నర్సింహారెడ్డి (ఎస్‌వి యూనివర్సిటీ), భుజంగరెడ్డి (ఉస్మానియా, ఎస్‌కె రెండు యూనివర్సిటీలు), వీరాస్వామి (హైదరాబాద్ యూనివర్సిటీ).
వీరిలో మళ్లీ మేధావులుగాను, విప్లవాచరణలోను, బయటి సమాజంలో కూడ ఎంతో గుర్తింపు పొందినవాళ్లుగా ఇటు శాస్త్ర సాంకేతిక వైజ్ఞానిక రంగంలోను, అటు సమాజశాస్త్ర, చరిత్ర, రాజనీతి రంగాల్లోను ఎకడమిక్ స్థాయిలో కూడా అరుదెన గుర్తింపు పొందిన సంప్రదాయానికి కూడా బహుశా పంచాది కృష్ణమూర్తి తర్వాత జార్జే ఒక సంప్రదాయం నెలకొల్పాడు. సూరపనేని జనార్దన్, జంపాలప్రసాద్, మధుసూదన్‌రాజ్, ఎర్రంరెడ్డి సంతోష్‌రెడ్డి, రంగవల్లి, మారోజు వీరన్న, వీరాస్వామి, నవీన్‌బాబు (జెఎన్‌యు), సాకేత్‌రాజన్ (కర్నాటక), అనూరాధాగాంధీ ఈ కోవలోకొస్తారు.
ఈ తెలివిడి జార్జ్ చంపబడిన్నాటి నుంచే మన మధ్య బతికి ఉన్నాడనడానికి ఒక అపూర్వమైన ఉదాహరణ. నాటినుంచీ బహుశా ఆయన అమరత్వాన్ని మనమొక విషాదజ్ఞాపకంగా కాకుండా ఒక పోరాట ఉత్తేజంగా తలుచుకుంటున్నామనుకుంటాను. ఆనాటి ఆయన హత్య, ఆయన రక్తబంధువులకు, స్నేహితులకు, ఆయనతోపాటు ఆచరణలో ఉన్నవాళ్లకు ఎటువంటి దుఖం, ఉద్వేగాన్ని కలిగించినవో కాని, అది ప్రత్యేకించి క్యాంపస్‌లలో అది ఓ విప్లవ పునర్నిర్మాణానికి దోహదం చేసింది. ఆయన చనిపోయినపుడు నేను జిందాబాద్ అని కవిత రాశాను.
చావు కూడా బతుకుకన్నా విలువైన త్యాగంగా
చచ్చినవానికోసం ఏడుపు రాదు
తన తరమంతా సుఖంగా బతకడానికి/ఒకడొకరోజు ముందు చస్తాడు
జ్ఞానమంటే అన్యాయాన్ని అంతకన్నా
తీవ్రంగా ఎదుర్కోవడమని తెల్సిన
జార్జిరెడ్డిని మాత్రమే శాస్త్రవేత్తగా గుర్తిస్తుంది జనం
సకల శాస్త్రాలు చదువుతున్న విద్యార్థులు, చదువుకున్న ప్రకృతీ సామాజి క శాస్త్రవేత్తలు ముఖ్యంగా ఇవ్వాళ సామ్రాజ్యవాద యుద్ధసమయంలో ప్రజలతరఫున నిలబడవలసిన తరుణమిది. జ్ఞానమొక్కటే మననిప్పుడు ప్రజలవైపు నిలబెట్టదు. ప్రజాస్వామిక చెతన్యం, దేశభక్తి, ప్రజలపై ప్రేమ, సేవాభావం, ప్రజల సార్వభౌమత్వాన్ని కాపాడుకోవాలనే ఒక స్వతంత్ర ఆకాంక్ష, ప్రజలే చరిత్ర నిర్మాతలనే విశ్వాసం మాత్రమే మననివ్వాళ ఒక జార్జ్జిరెడ్డి వంటి జీవితాచరణకు పురికొల్పుతుంది. అప్పుడు మరణాన్ని ఒక వ్యక్తిగతమైన అంశంగా, జ్ఞాపకాన్ని ఒక నాస్టాల్జియాగా కాకుండా ఆ మరణంలో రణన్నినాదమైన ఆశయాన్ని మన కర్తవ్యంగా ముందుంచుతుంది.
జార్జ్ నెత్తుటి తడి ఆరకముందే జరిగిన ఆ మొదటి సంస్మరణసభ సాయంకాలం ఏం జరిగిందో ఇందుకో ఉదాహరణగా చెప్తాను. సభ అయిపోగానే సభ నిర్వహించిన పిడిఎస్ విద్యార్థుల్లో ఎవరో ఒకరు నన్ను ఉస్మానియా క్యాంపస్ ఇ-హాస్టల్‌కు మోటార్‌సైకిల్‌పై తీసుకుపోయారు. వాళ్లు కనీసం 16, 20 మందుంటారు. వాళ్లలో అప్పటికి మా వరంగల్ వాడైన జావేద్‌మీర్జా ఒక్కడే బాగా తెలుసు. నన్ను తీసుక ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థి కూర రాజన్న అని తర్వాత తెలిసింది. ఆయన నాయకత్వంలో వీళ్లంతా నా మీద సంధించిన ప్రశ్నలు ‘మార్క్సిస్టు, లెనినిస్టులుగా మనం తెలంగాణ ఉద్యమాన్ని ఎట్లా బలపరుస్తాము’ అని. ఎందుకంటే అప్పటికే 1969లోనే నేను లెనిన్ శతజయంతి సందర్భంగా తెలంగాణ ఉద్యమంలో ప్రజా పసిగట్టినవాడు లెనిన్ అని రాసి ఉన్నాను. అట్లూరి రంగారావు మొదలైనవాళ్లు నన్ను ప్రేరేపించి 1972లో వరంగల్‌లో జీవన్‌లాల్ గ్రౌండ్స్‌లో 25వేల మందితో జరిగిన తెలంగాణ సదస్సును ప్రారంభించమని పురికొల్పి ఉన్నారు. ఇది వీళ్లకాశ్చర్యంగా ఉన్నది. కాని వరంగల్‌లో అప్పటికే 1969, 72 రెండు సందర్భాల్లోను తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విప్లవ విద్యార్థులందరూ ఆ తర్వాత కాలంలో రాడికల్ విద్యార్థులుగా మారారు. 1978 ఆర్‌ఎస్‌యు రెండవ మహాసభల తర్వాత ‘గ్రామాలకు తరలండి’ క్యాంపెయిన్ తీసుకున్నారు. ఆ తర్వాతదంతా చరిత్ర అన్నట్లు ఇవ్వాళ వాళ్లంతా దేశవ్యాప్త విప్లవోద్యమంలో అమరులయిన, కొనసాగుతున్న నాయకులుగా, శ్రేణులుగా ఉన్నారు. శ్యాం, మహేశ్, మురళి మొదలుకొని కిషన్‌జీ వరకు ప్రజాస్వామిక తెలంగాణ ఆచరణ చిత్రపటాన్ని గీసినవారే.
జార్జ్ అమరత్వం తర్వాత 72 జూలైలో సృజన ఆయన ముఖచిత్రంతో వెలువడింది. అందులోనే నేను ‘జిందాబాద్’ అని ఆయనపై కవిత రాశాను. మళ్లీ 74 ఏప్రిల్ జార్జ్ మూడో వర్ధంతి సందర్భంగా సృజనలో ‘కదమ్ కదమ్ పర్ లడ్‌నా సీఖో’ శీర్షికతో ఎన్‌కె, ‘జార్జ్‌రెడ్డీ మేమూ నీ మార్గమే’ అనే పేరు తో జ్ఞానేశ్వర్‌కీర్తి కవితలు రాశారు.‘జార్జ్ ! నీవందించిన కొరడా కొస నుండి పిడి వరకు చేరుకున్నాం’ అని జ్ఞానేశ్వర్ సంఘటితమై నిర్మాణమైన విప్లవ విద్యార్థి ఉద్యమాలను పరోక్షంగా ప్రస్తావించాడు. అయితే జార్జ్ నుంచి నేర్చుకోవల్సింది మరొకటున్నది. ఆయన అంతిమయావూతలో అప్పటి ఉస్మానియా వైస్‌చాన్సలర్ నూకల నరోత్తమ్‌రెడ్డి మొదలు, ఉస్మానియా ఫిజిక్స్ ప్రొఫెసర్స్ మొదలు ఎందరో మేధావులు, విద్యావేత్తలు పాల్గొన్నారు. ప్రొఫెసర్ వెంకట్రామయ్య వంటివాళ్లు ఆయన పేరుమీద ఫిజిక్స్‌లో అత్యంత ప్రతిభాశాలి అయిన విద్యార్థికి గోల్డ్‌మెడల్ ప్రకటించారు. ఇటువంటి గుర్తింపు రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీలో ఒక్క సూరపనేని జనార్దన్‌కే దక్కింది. అంతేకాదు, 74లో పోలమికల్ చర్చలతో విడిపోయిన పిడిఎస్‌యు, ‘ఆర్‌ఎస్‌యు’ లు బహుశా అంతకన్నా ముందున్న డిఎస్‌ఓ కూడా తమది ఆయన వారసత్వమని, తమకు ఆయన వారధి అని చెప్పుకుంటున్నాయి. బహుశా అది వరంగల్ హైదరాబాద్‌లో అప్పటికింకా నిర్మాణరూపం పొందని పిడిఎస్ సంప్రదాయం కావచ్చు. ఈ రెండూ విప్లవ మెలకువలూ, నెపుణ్యాలూ, ఆమోదయోగ్యతా మనం జార్జ్ నుంచి గ్రహించాలి.
సంఘపరివార్ శక్తులు 70లలో ఒక జార్జ్‌నో, ఒక చాంద్‌పాషానో ఎందుకు చంపారు? 80లలో జగిత్యాలలో ఒక గోపి రాజన్నను, నల్లగొండలో ఒక శేషన్నను ఎందుకు చంపారు? నలగొండలో శేషుసారుపై ఎందుకు హత్యాప్రయత్నం చేశారు? మళ్లీ ఇటీవలి కాలంలో కాశీంపై ఎందుకు చేశారు? 68 నుంచి ఎమర్జెన్సీ కాలం దాకా మళ్లీ 80లలో ఒకసారి భూస్వామ్య, వ్యాపార, అగ్రవర్ణ సెక్షన్ల నుంచి వచ్చిన విద్యార్థులకు వ్యవసాయకూలీలు, దళితులు, ముస్లింలు, పేదవర్గాల నుంచి వచ్చిన విద్యార్థులకు కరపత్రాల రూపంలోను, విద్యార్థిసంఘ ఎన్నికల్లోను, క్యాంపస్‌లలో భౌతిక ఘర్షణల రూపంలోను జరిగిన ఒక వర్గపోరాటాన్ని గుర్తుచేసుకుందాం.
తెలంగాణ సాధన విషయంలో నిర్విచక్షగా ఇటువంటి హిందుత్వశక్తులతో మనం ప్రయాణం చేస్తున్న సందర్భంలో (వాస్తవానికి నేను ప్రస్తావించిన సందర్భాల్లో బాబ్రీమసీదు విధ్వంసంలేదు, గుజరాత్ మారణకాండ లేదు, మక్కామసీదు పేలుడు లేదు, మహబూబ్‌నగర్ ఉపఎన్నికలు, ఉప ఎన్నికల అనంతరపు సంగారెడ్డి ఘర్షణలు లేవు. సైదాబాద్, మాదన్నపేటల్లో కొనసాగుతున్న కర్ఫ్యూ లేదు. జార్జ్‌రెడ్డిని స్మరించుకుంటున్నాం గనుక తెలంగాణ మీద అత్యంత ప్రేమతో ఈ జాగ్రత్త తీసుకుందాం.
(నేడు జార్జిరెడ్డి 40వ వర్ధంతి)