- ఆరోగ్య సూచీల్లో నెంబర్ వన్ గా నిలవాలి
- జిల్లా ప్రజల ఆరోగ్య సంరక్షణ పూర్తిగా డీఎంహెచ్వోలదే
- పెద్దాసు పత్రుల్లో చికిత్స అనంతరం కూడా ఆరోగ్యాన్ని మానిటరింగ్ చేయాలి
- అవసరం ఉంటేనే పై ఆసుపత్రులకు రిఫర్ చేయాలి
- ప్రైవేటులో సి-సెక్షన్లపై పరిశీలన చేయాలి
- బస్తీ, పల్లె దవఖానాలు, ఇతర ప్రతి ఆరోగ్య సూచికల విషయాలపై సమీక్షలు నిర్వహించాలి
- వైద్యారోగ్య శాఖ సమీక్షలో మంత్రి హరీశ్ రావు
అన్నిఆరోగ్య సూచిల్లో తెలంగాణ రాష్ట్రాన్ని మొదటి స్థానానికి చేర్చాలని, ఇందుకోసం ప్రతి ఒక్కరు పోటీతత్వంతో పని చేయాలని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వైద్యారోగ్య శాఖకు పెద్ద మొత్తంలో నిధులు కేటాయించి, ప్రజారోగ్య సంరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు నూతనోత్సాహంతో పని చేయాలని చెప్పారు. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ విభాగం పరిధిలో అమలవుతున్న ఆరోగ్య కార్యక్రమాలపై మంత్రి హరీశ్ రావు ఆదివారం నెలవారీ సమీక్ష నిర్వహించారు. హెల్త్ సెక్రెటరీ రిజ్వీ, కుటుంబ సంక్షేమ విభాగం కమిషనర్ శ్వేత మహంతి, డీఎంఇ రమేష్ రెడ్డి, డీహెచ్ శ్రీనివాస రావు, టివివిపి కమిషనర్ అజయ్ కుమార్, టీఎస్ఎంఎస్ ఐడీసీ ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, అన్ని జిల్లాల డీఎంహెచ్వోలు, డిప్యూటీ డీఎంహెచ్వోలు, ప్రోగ్రాం ఆఫీసర్లు, వైద్యాధికారులు పాల్గొన్నారు. మెటర్నల్ హెల్త్, కేసీఆర్ న్యూట్రీషన్ కిట్స్, ఇమ్యునైజేషన్, ఎన్సీడీ ప్రోగ్రాం, టెలి మానస్, బస్తీ దవాఖానలు, తెలంగాణ డయాగ్నోస్టిక్స్, ఆరోగ్య మహిళ తదితర కార్యక్రమాల అమలు తీరును సమీక్షించారు.
ఆదివారం మధ్యాహ్నం 2 గంటల వరకు దవాఖాన
ఈ సందర్బంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించే క్రమంలో ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నదన్నారు. మందులు, వైద్య పరికరాలు, సిబ్బంది కొరత సహా మరేఇతర ఇబ్బందులు లేకుండా చూసుకుంటుందన్నారు. ప్రభుత్వ కృషికి తోడు ఆరోగ్య శాఖలోని ప్రతి ఒక్క సిబ్బంది బాధ్యతతో సహకరించాలన్నారు. అందరం కలిసి పని చేయడం వల్ల ఆరోగ్య రంగంలో దేశంలోనే మూడో స్థానానికి చేరామని, ఇంతటితో ఆగకుండా మొదటి స్థానానికి చేరడమే మన లక్ష్యమని, ఇతర పారామీటర్లలో కూడా పురోగతి నమోదు చేయాలన్నారు. జిల్లా ప్రజల ఆరోగ్య సంరక్షణ విషయంలో డీఎంహెచ్వోలు, డిప్యూటీ డీఎంహెచ్వోలదే కీలక పాత్ర అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్య కార్యక్రమాలు ప్రజలకు అందేలా చూడాలన్నారు. నిత్యం సమీక్షలు చేసుకుంటూ, పనితీరు మెరుగుపర్చుకోవాలన్నారు. ఒక గ్రామంలో, మండలంలో ప్రజల ఆరోగ్య పరిస్థితి గురించి మెడికల్ ఆఫీసర్కు, అదే విధంగా జిల్లా ప్రజల ఆరోగ్య పరిస్థితిపై జిల్లా వైద్యాధికారికి పూర్తి అవగాహన ఉండాలన్నారు. ఒక పేషెంట్ పీహెచ్సీ పరిధి దాటి రిఫరల్ ఆసుపత్రి వద్దకు వచ్చి చికిత్స చేయించుకొని తిరిగి వెళ్లాక, ఆ పేషెంట్ ఆరోగ్య పరిస్థితిపై మానిటరింగ్ చేయాల్సిన బాధ్యత ఉంటుందన్నారు. జిల్లా పరిధిలోనే మెడికల్ కాలేజీలు అందుబాటులోకి వచ్చాయి కాబట్టి, అక్కడే మంచి వైద్యం అందించాలన్నారు. అవసరం అయితేనే ఉస్మానియా, నిమ్స్, గాంధీ ఆసుపత్రులకు రిఫర్ చేయాలన్నారు. బస్తీ దవాఖానల్లో ఓపీ పెరగాలని, ఆదివారం మధ్యాహ్నం 2 గంటల వరకు దవాఖాన తెరిచి ఉంటుందని చెప్పేలా బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. 24 గంటల్లోగా తెలంగాణ డయాగ్నోస్టిక్స్ ద్వారా పరీక్ష ఫలితాలు అందించి, చికిత్స అందేలా చూడాలన్నారు. పాలియేటివ్ సేవల గురించి ప్రచారం కల్పించాలన్నారు. మహిళల సమగ్ర ఆరోగ్య సంరక్షణ కోసం నిర్వహిస్తున్న ఆరోగ్య మహిళ కార్యక్రమం గొప్పదని, ప్రతి మంగళవారం పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందేలా చూడాలన్నారు. వైద్యాధికారులు ప్రతి మంగళవారం క్లినిక్స్ సందర్శించాలన్నారు. మానసిక సమస్యలతో బాధపడుతున్న వారికి పరిష్కారంగా ప్రారంభించిన టెలి మానస్ – 14416 టోల్ ఫ్రీ నెంబర్ గురించి విస్తృతంగా ప్రచారం కల్పించాలన్నారు.
వ్యాక్సినేషన్ వంద శాతం పూర్తి చేసేలా చర్యలు
ఏఎన్సీ చెకప్స్ సక్రమంగా నిర్వహించాలని, గర్బిణుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని మంత్రి వైద్య సిబ్బందిని ఆదేశించారు. ప్రభుత్వాసుపత్రుల్లో డెలివరీలు పెరిగేలా చర్యలు తీసుకోవాలని, సాధారణ డెలివరీలను ప్రోత్సహించాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరిగే సెక్షన్లపై గైనకాలజిస్టుల వారీగా పరిశీలన నిర్వహిస్తామన్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో సిజేరియన్లు ఎక్కువగా జరుగుతుండటం పట్ల పరిశీలన చేయాలని, తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని డిప్యూటీ డీఎంహెచ్వోలు, డీఎంహెచ్వోలను ఆదేశించారు. వ్యాక్సినేషన్ వంద శాతం పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. డిప్యూటీ డీఎంహెచ్వోలు, డీఎంహెచ్వోలు ఎక్కువగా ఫీల్డ్ విజిట్స్ చేయాలని, పనితీరును మెరుగుపర్చుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పనిచేసే వైద్య సిబ్బందికి ప్రోత్సాహకాలు ఉంటాయని, ఇదే సమయంలో విధుల్లో నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు ఉంటాయని మంత్రి స్పష్టం చేశారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ, రాష్ట్రానికి మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు.