mt_logo

జూ పార్కును ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతాం: సీఎస్ శ్రీ ఎస్ కే జోషి

– జంతువుల ఆవాసానికి, పునరుత్పత్తికి మరిన్ని చర్యల

– సందర్శకుల కోసం మరిన్ని సౌకర్యాలు, ఆధునిక ఏర్పాట్లు

– నెహ్రూ జూ పార్క్ ను సందర్శించిన చీఫ్ సెక్రటరీ ఎస్ కే జోషి, స్పెషల్ సీఎస్ అజయ్ మిశ్రా

హైదరాబాద్ నెహ్రూ జూ పార్క్ కు దేశంలోనే మంచి పేరు ఉందని, రానున్న రోజుల్లో దీనిని ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కే.జోషి వెల్లడించారు. అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజమ్ మిశ్రాతో కలిసి చీఫ్ సెక్రటరీ జూ పార్క్ లో పర్యటించారు. దాదాపు నాలుగు గంటల పాటు జూపార్క్ లో గడిపిన సీ.ఎస్ పలు అభివృద్ది చేసిన కార్యక్రమాలను ప్రారంభించారు. కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఐదు బ్యాటరీ వాహనాలను, పులుల సఫారీకి వచ్చే సందర్శకుల కోసం ఏ.సీ బస్సు సౌకర్యాన్ని, ఆధునీకరించి పిల్లల కోసం ఆకర్షణీయంగా మార్చిన టాయ్ ట్రెయిన్ టికెట్ కౌంటర్ ను ఛీప్ సెక్రటరీ, స్పెషల్ సీఎస్, అటవీ శాఖ ఉన్నతాధికారులు ప్రారంభించారు. జూ పార్క్ లో ఇతర వాహనాలను అనుమతించకుండా, బ్యాటరీ వాహనాలను ఏర్పాటు చేశామని కొత్త వాటితో కలిపి వీటి సంఖ్య 49కి చేరిందని అధికారులు తెలిపారు.

పులుల సఫారీ సందర్శకుల కోసం ఏర్పాటు చేసిన కొత్త ఎ.సీ మినీ బస్సును ప్రారంభించిన అధికారులు అందులో సఫారీకి వెళ్లి పరిశీలించారు. నేరుగా అటవీ ప్రాంతంలో తిరుగుతూ బయట స్వేచ్ఛగా విహరిస్తున్న పులులను చూసే అవకాశం సఫారీ ద్వారా సందర్శకులకు కలిగించటం మంచి అనుభూతినిస్తుందని సీ.ఎస్ అన్నారు.

ఆ తర్వాత జూ పార్కులో ఉన్న పలు జంతువుల ఎన్ క్లోజర్లను, సందర్శకుల కోసం చేసిన ఏర్పాట్లను చీఫ్ సెక్రటరీ పరిశీలించారు. వివిధ సందర్భాల్లో పట్టుపడిన జంతువులకు అందిస్తున్న చికిత్సను ఆరాతీసిన సీ.ఎస్, వాటిని పరిశీలించారు. ఆ తర్వాత మూషిక జింకల పునరుత్పత్తి కేంద్రాన్ని కూడా సందర్శించారు. అరుదైన జంతువుల అభివృద్దికి కృషి చేస్తున్న సిబ్బందిని ప్రశంసించారు. జంతువుల భద్రతకు తోడు సందర్శకుల రక్షణకు తీసుకుంటున్న చర్యలపైనా చీఫ్ సెక్రటరీ ఆరా తీశారు. గతంతో పోలిస్తే జూలో మౌళిక వసతులు బాగా అభివృద్ది చెందాయని, రానున్న రోజుల్లో మరింతగా తీర్చిదిద్ది ప్రపంచ స్థాయి గుర్తింపుకు అధికారులు, సిబ్బంది తోడ్పడాలని కోరారు.

చీఫ్ సెక్రటరీ పర్యటనలో అటవీ సంరక్షణ ప్రధాన అధికారి పి. రఘువీర్, అదనపు అటవీ సంరక్షణ అధికారి మునీంద్ర, జూ పార్క్ డైరెక్టర్ సిధానంద్ కుక్రేటీ, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *