సిద్దిపేట, జూన్ 15 : సిద్దిపేట పట్టణ శివారులోని నాగులబండ వద్ద రాజీవ్ రహదారిని ఆనుకొని నిర్మించిన ఐటీ టవర్‌ను రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు.. ఐటీ మినిస్టర్ కేటీఆర్‌తో కలిసి గురువారం ప్రారంభించారు. ఐటీ టవర్ ప్రారంభోత్సవ సభలో మంత్రి హరీష్ మాట్లాడుతూ.. కలలో కూడా సిద్దిపేటకి ఐటీ టవర్ వస్తుందని అనుకోలేదు, సిద్దిపేట జిల్లా అయ్యి ఐటీ టవర్ వచ్చిందంటే తెలంగాణ తెచ్చిన కేసీఆరే కారణమన్నారు. సిద్దిపేటలో చదివిన బిడ్డలు సిద్దిపేటలోనే ఐటీ ఉద్యోగం చేస్తున్నారు, రాబోయే రోజుల్లో మంత్రి కేటీఆర్ సహకారంతో మరికొన్ని పరిశ్రమలు తెస్తాం. మంత్రి కేటీఆర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. కేటీఆర్ లాంటి ఐటీ మినిస్టర్ ఇతర రాష్ట్రాల్లో కావాలని యువత కోరుకుంటుందని గుర్తు చేసారు. తెలంగాణ వస్తే చాలా అనుమానాలు క్రియేట్ చేశారు. ఎవరైతే కేసీఆర్ ని తిట్టారో ఆ నోళ్లే ఇప్పుడు కేసీఆర్ ని మెచ్చుకుంటున్నాయన్నారు.
ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్ లో పరిశ్రమలకు పవర్ హాలీడే ఇస్తున్నారు, గతంలో ఎందరో పాలించారు. విజన్ 2020 అన్నారు..హైటెక్ అన్నారు, కానీ వాళ్ళ వల్ల కానిది సీఎం కేసీఆర్ చేసి చూపించారన్నారు. దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తోంది. తెలంగాణ ఆచరిస్తుంది దేశం అనుసరిస్తుంది. మరో సారి సీఎం కేసీఆర్ ని గెలిపించి హ్యాట్రిక్ గెలుపు అందివ్వాలని కోరారు.