mt_logo

సీఎం కేసీఆర్ సంక‌ల్పం.. ల‌క్ష్మీన‌ర‌సింహుడికి దివ్య‌ధామం

-యాద‌గిరి క్షేత్రం..మ‌నంద‌రి అదృష్టం

-మ‌న ఆధ్యాత్మిక‌త‌కు నూత‌న ఒర‌వ‌డి

మ‌న ప‌క్కరాష్ట్రం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు తిరుప‌తి క్షేత్రం ఉన్న‌ది.. మరి మ‌న తెలంగాణ‌కు అలాంటి ఓ ఆల‌యం ఉండాల‌ని సీఎం కేసీఆర్ సంక‌ల్పించారు. తెలంగాణ తిరుప‌తిగా పిలుచుకొనే యాద‌గిరి గుట్ట‌ను పున‌ర్నిర్మించారు. నల్లరాతి కట్టడాలతో.. యాదాద్రి దివ్య‌ధామాన్ని మ‌హాద్భుతంగా తీర్చిదిద్దారు. ప్ర‌పంచ‌మే అబ్బుర‌ప‌డేలా నిర్మించిన ఈ ఆల‌యాన్ని చూసి భ‌క్తులు ఉప్పొంగిపోయారు. ఈ ఆల‌యాన్ని ద‌ర్శించుకొన్న ప్ర‌తిఒక్క‌రూ సీఎం కేసీఆర్‌ను వేనోళ్ల పొగిడారు. మ‌రి ఈ ఆల‌య పున‌ర్నిర్మాణాన్ని ద‌గ్గ‌రుండి చూసిన యాద‌గిరిగుట్ట దేవాల‌య అభివృద్ధి సంస్థ ఉపాధ్య‌క్షుడు జీ కిషన్‌రావు ఈ పుణ్య‌స్థ‌లి మ‌న రాష్ట్రంలో ఉండ‌డం మ‌న అంద‌రి అదృష్టం అని అంటున్నారు. ఈ మహిమాన్విత ఆల‌య విశేషాల‌ను ఆయ‌న మాట‌ల్లోనే తెలుసుకుందాం.

ఆధ్యాత్మికతకు భారతావని ఆలవాలం. ఇక్కడ ప్రతి అడుగూ క్షేత్రమే! ప్రతి బిందువు తీర్థమే!! అలాంటి క్షేత్రాల్లో మహిమాన్వితమైనది, మహోజ్వల మైనది జ్వాలా నరసింహుడు కొలువుదీరిన యాదగిరిగుట్ట. పౌరాణిక ప్రాశస్త్యం, చారిత్రక నేపథ్యం ఉన్న ఈ పుణ్యస్థలి మన రాష్ట్రంలో ఉండటం మనందరి అదృష్టం. తరతరాలుగా తెలంగాణ ప్రజల ఇలవేల్పుగా పూజలు అందుకుంటున్న యాదగిరి నర్సన్నకు రాష్ట్ర ఆవిర్భావంతో మహర్దశ పడుతుందని నేను అనుకోలేదు!

స్వామి కొలువుదీరిన కొండపై ప్రపంచమంతా ఆశ్చర్యపడేలా కోవెల వెలుస్తుందని ఊహించలేదు. స్వామివారి అనుగ్రహం, ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంకల్పం వెరసి లక్ష్మీనరసింహుడి దివ్యధామం ‘న భూతో న భవిష్యత్‌’ అన్న తీరులో సాకారం అయింది. ఈ దైవకార్యంలో ఉడతా భక్తిగా పాల్గొనడం నా పూర్వజన్మ సుకృతం. యాదగిరిగుట్ట దేవాలయ అభివృద్ధి సంస్థ (వైటీడీఏ)కి ఉపాధ్యక్షుడిగా ముఖ్యమంత్రి నన్ను నియమించడం నా జీవితంలో మరపురాని సన్నివేశం. ఇది ఓ ఆలయ పునర్నిర్మాణం మాత్రమే కాదు.. తెలంగాణ అస్తిత్వానికి మేలి మలుపు. మన ఆధ్యాత్మికతకు నూతన ఒరవడి.

ఆలయ పునరుద్ధరణ సహజంగా జరిగే ప్రక్రియ కాదు. ఇలాంటి బృహత్కార్యాన్ని నిర్వర్తించాలంటే కేవలం నిధులు ఉంటే సరిపోదు. అధికారం ఉన్నంత మాత్రాన అన్నీ అయిపోవు. మన సంకల్పం శుద్ధిగా ఉండాలి. అప్పుడే కాగల కార్యం దేవుడే దగ్గరుండి జరిపించుకుంటాడు. యాదగిరిగుట్ట ఆలయ పునర్నిర్మాణంలో ప్రతి ఘట్టంలోనూ ఇది నాకు స్పష్టంగా కనిపించింది. కొండ మీద అద్భుత ఆలయంలో ఆకాశమంత ఎత్తున నిలిచిన రాజగోపురాలు ముఖ్యమంత్రి మేధోమథనానికి నిలువెత్తు నిదర్శనాలు. మొక్కవోని ఆయన కార్యదీక్షకు ఆలయ కుడ్యాలు అద్దం పడతాయి అంటే అతిశయోక్తి కాదు. ఇలా ఒకటేమిటి నరసింహస్వామికి లక్ష్మీకళ సంతరించి పెట్టింది ఈ ప్రయాణంలో ప్రతి ఘట్టం అద్భుతమే!

ప్రహ్లాదుడు పిలిచినంత మాత్రాన ఎక్కడున్నాడో కానీ, అంతలో నే స్తంభంలో వెలిశాడు నరకేసరి. మళ్లీ తపోనిధి అయిన యాదర్షి ఎలుగెత్తి కోరినందుకు ఈ కొండపై జ్వాలా నరసింహుడై అవతరించాడు. ఆపై లక్ష్మీనరసింహుడై కొలువుదీరాడు. మనకోసం వెలిసిన స్వామిని మనమంతా గొప్పగా చూసుకోవాలి కదా! దైవ ప్రేరణో, ముఖ్యమంత్రికే గాఢమైన ఆలోచన కలిగిం దో.. తెలంగాణ రాకతో యాదగిరిగుట్టకు మహర్దశ పట్టింది.

తెలంగాణ ఏర్పడిన మూడు నెలలకు ముఖ్యమంత్రి నుంచి పిలుపు వచ్చింది. అప్పటికి నేను తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా ఉన్నాను. ‘యాదగిరిగుట్ట గుడిని పునర్నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో నువ్వు పాలుపంచుకుంటావా? టూరిజంలోనే ఉంటావా?’ అని అడిగారు. ‘ఒక దేవాలయ నిర్మాణంలో భాగం కావడం కన్నా అదృష్టం ఏముంటుంది? నాపై మీరు ఉంచిన విశ్వాసానికి ధన్యవాదాలు’ అని చెప్పాను. ఇందుకోసం యాదగిరిగుట్ట దేవాలయ అభివృద్ధి సంస్థను నెలకొల్పారు. దానికి మీరే అధ్యక్షుడిగా ఉండాలని కోరాను. అందుకు ఆయన సరేనన్నారు. నన్ను ఉపాధ్యక్షుడిగా నియమించారు. ఈ శతాబ్ది అద్భుత నిర్మాణంలో నా ప్రస్థానం అలా మొదలైంది.

ఒక దేవాలయాన్ని పునరుద్ధరించడం అంటే మాటన్నంత తేలిక కాదు. అందరికీ ఆమోదయోగ్యంగా, వైఖానస ఆగమ నియమాల సమ్మతంగా, వాస్తు శాస్త్ర సమ్మిళితంగా, భక్తుల విశ్వాసాలకు ప్రతిబింబంగా గుడి ఉండాలి. ఈ క్రమంలో మా బృందం తపస్సులా పరిశోధనలు చేసింది. 2015 ఫిబ్రవరి నుంచి ఏడాదిపాటు మా పరిశోధనలు సాగాయి. అన్నిటినీ క్రోడీకరించి పూర్తిస్థాయి ప్రాజెక్ట్‌ రిపోర్ట్‌ అందజేశాం. చర్చోపచర్చల తర్వాత 2016 విజయదశమి పర్వదినం సందర్భంగా ఆలయ శంకుస్థాపన అంగరంగ వైభవంగా సాగింది. నాటి నుంచి ఆలయ నిర్మాణం పూర్తయ్యేవరకు ముఖ్యమంత్రి 21 పర్యాయాలు గుట్టకు వచ్చారు. వచ్చిన ప్రతిసారీ ఐదారుగంటలపాటు సమావేశం నిర్వహించేవారు. నిర్మాణ ప్రాంగణమంతా కలియ తిరిగేవారు. ప్రతి విషయాన్నీ క్షుణ్నంగా పరిశీలించేవారు. ఎక్కడ చిన్న తేడా కనిపించినా మాకు విడమరచి చెప్పేవారు. మా బృందం చేసే సూచనల్లో బాగున్నవాటిని మెచ్చుకునేవారు. వాటిని యథావిధిగా అమలు చేయమనేవారు. ఆయన ప్రోత్సాహంతో మేమంతా ద్విగుణీకృతమైన ఉత్సాహంతో పనిచేయగలిగాం. ముఖ్యంగా ఆయన ఓపిక, పట్టుదల, తపన చూస్తుంటే ఆశ్చర్యం కలిగేది.

ఆలయ నిర్మాణంలో అడుగడుగునా జాగ్రత్తలు తీసుకున్నాం. చుట్టూ ఉన్న నిర్మాణాలను తొలగించాం కానీ, గర్భాలయాన్ని ముట్టుకోలేదు. సాధారణంగా ఏదైనా ఆలయం పునర్నిర్మాణం చేస్తే నిత్య కైంకర్యాలు యథావిధిగా కొనసాగించడానికి, భక్తుల దర్శనార్థం బాలాలయం నిర్మించడం శాస్త్ర సమ్మతం. అయితే, బాలాలయం ఓ మోస్తరుగా నాలుగు గోడల మధ్య ఏర్పాటు చేస్తారు. కానీ, గుట్టమీద నరసింహస్వామి గర్భాలయాన్ని పోలిన విధంగా బాలాలయాన్ని నిర్మించాం.

ప్రధాన ఆలయంలో ఎలాగైతే స్వామి కొండల మధ్య సొరికెలో ఉంటాడో, ఇక్కడా అలాగే నిలిపాం. దీంతో, భక్తులకు ఇది బాలాలయం అన్న భావనే కలగలేదు. అసా ధ్యమనే మాటకు తావివ్వకుండా భవ్య మం దిర నిర్మాణం కొనసాగించాం. అనుకున్నట్టు గా ఆలయం పూర్తయింది. గతేడాది అంగరంగ వైభవంగా స్వామివారి నూతన ఆల యం ప్రారంభించుకున్నాం. ఇప్పుడు యాదగిరిగుట్ట సుందరమైన ఆధ్యాత్మికధా మం. అణవణువూ ఆధ్యాత్మికత తొణికిసలాడే భారతీయ సాంస్కృతిక చిరునామా. స్వామివారి దర్శనంతో జన్మ చరితార్థమైతే, ఆలయాన్ని చూడటంతోనే మనసు పులకితమవుతున్నదని భక్తులు మురిసిపోతున్నారు. ఈ ఆనందాన్ని పంచుకునే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రికి రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా.

మరిన్ని ఆలయాలకు మహర్దశ

మన తెలంగాణలో శతాబ్దాల చరిత్ర ఉన్న ఆలయాలు ఎన్నో ఉన్నాయి. ఆరో శతాబ్దం నాటి గుళ్లూ ఉన్నాయి. కాలపరీక్షకు తట్టుకోలేక ఎన్నో శిథిలావస్థకు చేరాయి. వాటినీ పునరుద్ధరించాలని ముఖ్యమంత్రి భావించడం ముదావహం. ఈ క్రమంలో వేములవాడ, కొండగట్టు, బాసర, పానగల్‌ ఛాయా సోమేశ్వర ఆలయాల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయిస్తున్నారు. కొన్ని పురాతన ఆలయాల్లో అద్భుతమైన శిల్పకళా సౌందర్యం ఉందని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినప్పుడు… ‘వాటినీ అభివృద్ధి చేద్దామ’ని చెప్పారు.

అక్కడ కాదు.. ఇక్కడ!

ముఖ్యమంత్రి ఒకసారి ఆలయ నిర్మాణం పరిశీలించడానికి వచ్చిన సందర్భంగా.. పాకశాల సరైన ప్రదేశంలో లేదని చెప్పారు. దీనిని మరోచోట నిర్మించాలని సూచించారు. వాస్తు పండితులు, శాస్త్ర నిపుణులను సంప్రదించమని చెప్పారు. వారిని అడిగితే.. ముఖ్యమంత్రి సూచించిన ప్రదేశంలోనే ఉండాలని సూచించారు. ఇలాంటి సలహాలు ఎన్నో ఇచ్చారు. ‘నరసింహస్వామి గుడి ఉత్తమంగా కాదు.. అత్యుత్తమంగా ఉండాలి’ అని ఎప్పుడూ చెప్తుండేవారు.

స్వామి చూసుకుంటాడు

ఏదైనా సందర్భంలో మేము కాస్త డీలా పడితే ముఖ్యమంత్రి ఉత్సాహపరిచేవారు. ఫలానా పనిలో ఇలా ఇబ్బంది ఉందని ప్రస్తావిస్తే నవ్వి.. ‘ఎందుకు మీరు ఆందోళన చెందుతారు. ఇది స్వామి కార్యం. ఆయనే చూసుకుంటాడు. స్వామిని ముందు పెట్టి ప్రయత్నించండి. అన్ని నెరవేరుతాయి.’ అనేవారు. వారు అన్నట్టుగానే ఆ కష్టం దూదిపింజలా తేలిపోయేది. స్వామి చూసుకోవడం వల్లే పునర్నిర్మాణం ఐదున్నరేండ్లలో పూర్తయింది. ఇందులో రెండున్నరేండ్లు కరోనాతో కరిగిపోయినా.. స్వామి కార్యం సకాలంలో దిగ్విజయంగా పూర్తయింది. ఈ మహాయజ్ఞాన్ని స్తపతులు, శిల్పులు, ఇంజినీర్లు, ఆర్ట్‌ డైరెక్టర్లు, కార్మికులు ఎందరో నిర్విఘ్నంగా సుసంపన్నం చేశారు.

భక్తి ఉప్పొంగే పేర్లు

యాదగిరిగుట్టలో నిర్మించే ప్రతి నిర్మాణానికీ భక్తి భావం ఉట్టిపడేలా పేర్లు పెట్టాలని సూచించారు ముఖ్యమంత్రి. అతిథి గృహానికి ‘యాదర్షి’ పేరు సూచించినప్పుడు ముఖ్యమంత్రి ఎంతో సంతోషించారు. లక్ష్మీ పుష్కరిణి, విష్ణు పుష్కరిణితోపాటు కొండ మీద ప్రతి నిర్మాణానికి దైవ సంబంధమైన పేర్లు ఉండేలా చూశాం. టెంపుల్‌ సిటీ మార్గాలకు కూడా దేవుడి పేరు వచ్చేలా చూడమని కేసీఆర్‌ సలహా ఇచ్చారు. మంచి పేర్ల కోసం పురాణాలు చూడండి, వేద పండితులను కనుక్కోండి అని చెప్పారు.