మంగళవారం ప్రొఫెసర్ కోదండరాం అధ్యక్షతన టీజేఏసీ కార్యాలయంలో తెలంగాణ జేఏసీ సమావేశం జరిగింది. అనంతరం అన్ని వివరాలను కోదండరాం విలేకరులకు వివరించారు. సంపూర్ణ తెలంగాణ సాధనే తమ లక్ష్యమని, అందుకోసం ఫిబ్రవరి 7న ఢిల్లీలో వర్క్‌షాప్‌ను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి పార్లమెంటు సభ్యులు, జాతీయపార్టీల అధ్యక్షులు, లోక్‌సభ, రాజ్యసభ స్పీకర్‌లను ఆహ్వానిస్తామని ఈ సందర్భంగా చెప్పారు. ఫిబ్రవరి 2న సమ్మక్క, సారలమ్మ యాత్ర జరిపి ఆ దేవతల ఆశీర్వాదం తీసుకుంటామని అన్నారు. ముఖ్యమంత్రి అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారని, రాజ్యాంగ ధిక్కారానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఎంతటివారైనా ఉపేక్షించబోమని, ప్రజాస్వామ్యబద్ధంగా తిరగబడతామని హెచ్చరించారు. ముఖ్యమంత్రి తీరుపట్ల రెండు రోజులుగా సభలో తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్న తీరును జేఏసీ అభినందిస్తున్నదని కోదండరాం చెప్పారు. వచ్చేనెల 7న జరిగే వర్క్‌షాప్ ముగిసాక యూపీఏ, ఎన్‌డీఏ పార్లమెంటు సభ్యులను కలిసి వివరాలతో కూడిన విజ్ఞాపనలను వారికి అందచేస్తామన్నారు. ఈ సమావేశంలో కో చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్, అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్, బీజేపీ తెలంగాణ ఉద్యమ కమిటీ కన్వీనర్ అశోక్‌కుమార్ యాదవ్, తెలంగాణ ఉద్యోగసంఘాల అధ్యక్షుడు సీ.విఠల్ తదితరులు పాల్గొన్నారు.