- 9 ఏళ్లలోనే దేశానికే ఆదర్శంగా వైద్యారోగ్య రంగం
- సీఎం కేసీఆర్ మార్గనిర్దేశనంలో అగ్రస్థానానికి చేరిన తెలంగాణ
- తొమ్మిదేండ్లలోనే 21 కొత్త మెడికల్ కాలేజీలతో కొత్త చరిత్ర
- వరంగల్ హెల్త్ సిటీ, నగరం నలువైపులా టిమ్స్ ఆసుపత్రులు
- నిమ్స్ కు అదనంగా 2000 పడకలతో మరో నిమ్స్
- మానవీయ కోణంలో కార్యక్రమాల రూపకల్పన, అమలు
- కేసీఆర్ కిట్.. సూపర్ హిట్, రక్తహీనతకు స్వస్తి చెప్పేలా కేసీఆర్ న్యూట్రీషన్ కిట్స్
- గణనీయంగా తగ్గిన మాతా శిశు మరణాలు
- 30 శాతం నుంచి ఏప్రిల్ నెలలో 70 శాతానికి పెరిగిన ప్రభుత్వ ఆసుపత్రి ప్రసవాలు
- బస్తీవాసుల సుస్తీ పోగొడుతున్న బస్తీ దవాఖానలు
- రోగనిర్ధారణ పరీక్షలు ఉచితంగా చేస్తూ, పేషెంట్లపై భారం తగ్గించిన టీ డయాగ్నోస్టిక్స్
హైదరాబాద్, జూన్ 14: సీఎం కేసీఆర్ తొమ్మిదేండ్లుగా వైద్యారోగ్య శాఖ పై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఎంతో బలోపేతం చేశారు. ఫలితంగా ఉమ్మడి రాష్ట్రంలో కునారిల్లిన వైద్యారోగ్య రంగం.. తొమ్మిదేండ్లలోనే దేశానికే ఆదర్శంగా ఎదిగింది. సీఎం కేసీఆర్ మార్గనిర్దేశనంలో అమలు చేస్తున్న విప్లవాత్మక పథకాలు, వినూత్న కార్యక్రమాలు ప్రజావైద్యంపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచాయి.
రెండున్నర రెట్లు పెరిగిన బడ్జెట్..
స్వరాష్ట్రంలో బడ్జెట్ కేటాయింపులు ఏటికేడు పెరుగుతున్నాయి. 2015-16లో వైద్యారోగ్య శాఖకు రూ.4,932 కోట్లు కేటాయించగా.. 2023-24 నాటికి రూ.12364 కోట్లకు పెరిగింది. అంటే తొమ్మిదేండ్లలో హెల్త్ బడ్జెట్ రెండున్నర రెట్లు పెరిగింది. తలసరి వైద్య బడ్జెట్ కేటాయింపుల్లో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఈ ఏడాది తలసరి కేటాయింపులు రూ.3,225గా నమోదైంది. తెలంగాణ ఏర్పడినప్పుడు తలసరి కేటాయింపులు రూ.925 మాత్రమే.
21 కొత్త మెడికల్ కాలేజీలు..
తెలంగాణ ఏర్పడేనాటికి కేవలం ఐదు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేవి. అందులో హైదరాబాద్ రాష్ట్రంగా ఉన్నప్పటికే గాంధీ, ఉస్మానియా మెడికల్ కాలేజీలు మనుగడలో ఉన్నాయి. అంటే.. 60 ఏండ్ల ఉమ్మడి పాలకులు కేవలం 3 మెడికల్ కాలేజీలను మాత్రమే ఏర్పాటు చేశారు. దీంతో పేదలకు మెరుగైన వైద్యం అందకపోగా, రాష్ట్ర విద్యార్థులు వైద్యవిద్య చదివేందుకు ఉక్రెయిన్, రష్యా, చైనా వంటి దేశాలకు వెళ్లాల్సిన దుస్థితి. ఈ పరిస్థితులను కండ్ల నిండా చూసిన సీఎం కేసీఆర్ స్వరాష్ట్రంలో అన్ని జిల్లాల ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్యం తో పాటు, వైద్య విద్యను చేరువ చేయాలనుకున్నారు. ఇందులో భాగంగా జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని చారిత్రక నిర్ణయం తీసుకొని వెనువెంటనే అమలు చేశారు. గడిచిన తొమ్మిదేండ్లలో రాష్ట్రంలో కొత్తగా 21 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసి రికార్డు సృష్టించారు. నాణ్యమైన వైద్యానికి, వైద్య విద్యకు తెలంగాణను కేరాఫ్ అడ్రస్ గా నిలిపారు.
* రాష్ట్రంలో మొత్తం 2014లో 2,950 ఎంబీబీఎస్ సీట్లు ఉంటే.. ఇప్పుడు 8,340 మంది విద్యార్థులకు అడ్మిషన్లు ఇచ్చే స్థాయికి రాష్ట్రం ఎదిగింది.
* రాష్ట్రంలో ప్రతి లక్ష జనాభాకు 22 ఎంబీబీస్ సీట్లు ఉన్నాయి. తద్వారా దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది.
* ప్రతి లక్ష జనాభాకు 7.5 పీజీ సీట్లతో రెండో స్థానంలో ఉన్నాం. త్వరలో మొదటి స్థానానికి చేరనున్నది.
* ఎంబీబీఎస్ సీట్ల పెరుగుదల దేశంలో 71శాతంగా ఉంటే, తెలంగాణలో 124శాతంగా ఉన్నది. పీజీ సీట్ల పెరుగుదల జాతీయ సగటు 68శాతం ఉంటే, తెలంగాణ 111శాతం నమోదు చేసింది.
* గతేడాది నుంచి బీ కేటగిరీలో 85% సీట్లు తెలంగాణ విద్యార్థులకే కేటాయించింది. దీంతో ర్రాష్టంలోని 24 ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని 1,071 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా తెలంగాణ విద్యార్థులకే లభించాయి. ఫలితంగా 8,78,280 ర్యాంకు వచ్చిన విద్యార్థికి కూడా సీటు వచ్చింది.
* ఎస్టీ రిజర్వేషన్ కోటాను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచడంతో ఎంతో మంది ఎస్టీ విద్యార్థులకు లబ్ధి చేకూరింది.
సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లు…
సూపర్ స్పెషాలిటీ సేవలంటే గాంధీ, ఉస్మానియా, నిమ్స్ దవాఖానలే. దీంతో ఆయా దవాఖానలపై ఒత్తిడి విపరీతంగా పెరిగిపోయింది. సూపర్ స్పెషాలిటీ సేవలను పెంచాలని, అత్యాధునిక సదుపాయాలు కల్పించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తూనే, హైదరాబాద్ నలువైపులా నాలుగు సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లకు శ్రీకారం చుట్టారు. కరోనా సమయంలో గచ్చిబౌలి టిమ్స్ ఏర్పాటు జరగగా, కొత్తగా అల్వాల్, ఎల్బీనగర్, సనత్‌నగర్‌లో ఏర్పాటు చేస్తున్నారు. వీటికితోడు వరంగల్ హెల్త్ సిటీలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను నిర్మిస్తున్నారు. వీటన్నింటికీ గతేడాది సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ పనులు కొనసాగుతున్నాయి. వరంగల్ హెల్త్ సిటీని దసరా నాటికి పూర్తి చేసేలా పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. నిమ్స్ లో అదనంగా 2000 సూపర్ స్పెషాలిటీ పడకలతో భవనాలను నిర్మిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా బుధవారం (14వ తేదీన) శంకుస్థాపన జరగనున్నది. వీటికి తోడు నిమ్స్ లో సూపర్ స్పెషాలిటీ ఎంసీహెచ్ పనులు ప్రారంభం కాగా, గాంధీలో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఎంసీహెచ్ పనులు చివరి దశకు వచ్చాయి. ఇవన్నీ పూర్తయితే కొత్తగా 10,000 సూపర్ స్పెషాలిటీ పడకలు అందుబాటులోకి వస్తాయి. తెలంగాణ ఏర్పాటుకు ముందు రాష్ట్రంలో 17,000 పడకలు మాత్రమే ఉంటే, ఇప్పుడు 34 వేలకు పడకల సంఖ్య చేరింది. సూపర్ స్పెషాలిటీ పడకలతో 10వేలు వస్తుండగా మొత్తం 50వేల పడకల ఏర్పాటుకు ప్రభుత్వం ప్లాన్ తో ఉంది.
కేసీఆర్ కిట్.. సూపర్ హిట్
మాతాశిశు సంరక్షణ కోసం దేశంలోనే మొదటిసారిగా సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్ పథకం సూపర్ హిట్‌గా నిలిచింది. కేసీఆర్ కిట్‌లో భాగంగా గర్భిణులకు బాబు పుడితే రూ.12వేలు, పాప పుడితే రూ.13వేలు ఆర్థిక సాయం అందిస్తున్నారు. ప్రసవం అనంతరం తల్లికి, బిడ్డకు అవసరమయ్యే వస్తువులతో కూడిన రూ.2వేలు విలువైన కిట్ అందిస్తున్నారు. ర్రాష్టంలో ఇప్పటి వరకు 13.91 లక్షల మంది మహిళలు కేసీఆర్ కిట్ల ద్వారా లబ్ధి పొందారు. ప్రభుత్వం దాదాపు రూ.1400 కోట్లు ఖర్చు చేసింది. ఏఎన్సీ చెకప్స్ లో దేశంలోనే తెలంగాణ టాప్‌లో నిలవగా, ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు 2014తో పోల్చితే రెట్టింపు అయ్యాయి. నాడు 30శాతంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి ప్రసవాలు గత ఏప్రిల్ నాటికి 70శాతం చేరుకున్నాయి. వంద శాతం పిల్లలకు టీకాలు అందిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ నెంబర్ 1 గా నిలిచింది. ఫలితంగా రాష్ట్రంలో మాతాశిశుమరణాలు గణనీయంగా తగ్గాయి. 2014 నాటికి 92గా ఉన్న మాతృమరణాల రేటు ఇప్పుడు 43కు తగ్గింది. శిశుమరణాల రేటు 39 నుంచి 21కి తగ్గింది.
అమ్మ ఒడి వాహనాలు..
గర్భిణులకు ప్రయాణ వేళ ఇబ్బంది పడొద్దనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ దేశంలోనే మొదటిసారిగా అమ్మ ఒడి వాహనాలను ప్రవేశపెట్టారు. ఏఎన్సీ చెకప్ ల సమయంలో, ప్రసవం సమయంలో, డిశ్చార్జి సమయంలో ఇంటి నుంచి దవాఖానకు, దవాఖాన నుంచి ఇంటికి ఉచితంగా రవాణా చేయగలుగుతున్నారు. మాతాశిశుమరణాల తగ్గింపులో అమ్మ ఒడి వాహనాలు కూడా కీలక పాత్ర పోషించాయి. రాష్ట్రవ్యాప్తంగా 300 అమ్మ ఒడి వాహనాలు అందుబాటులో ఉన్నాయి.
100 శాతం సురక్షిత ప్రసవాలు:
కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన హెచ్‌ఐఎంఎస్ నివేదిక ప్రకారం దేశంలో వందశాతం సురక్షిత ప్రసవాలు జరుగుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. జాతీయ సగటు 89గా ఉంటే.. తెలంగాణ ఎంతో మెరుగైన స్థానంలో నిలిచింది. ఇందుకోసం ఓవైపు దవాఖానలను పటిష్ఠం చేయడంతోపాటు మరోవైపు సామాజికంగా మార్పు తెచ్చారు. పేదలు, నిరక్షరాస్యత వల్ల అవగాహనలేని కొందరు ఇంటివద్దే ప్రసవిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. దీనిని నివారించేందుకు ప్రభుత్వ దవాఖానలో ప్రసవిస్తేనే కేసీఆర్ కిట్ రెండో విడత నగదు సాయం రూ.4వేలు (ఆడబిడ్డ పుడితే రూ.5వేలు) అందించాలని నిబంధన విధించారు. దీంతోపాటు రూ.2వేలు విలువైన తల్లి, బిడ్డకు అవసరమైన వస్తువులతో కూడిన కిట్ అందిస్తున్నారు. దీంతో రాష్ట్రంలో వందశాతం దవాఖానల్లోనే ప్రసవాలు జరుగుతున్నాయి. తద్వారా దేశంలోని ఏకైక రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది.
నార్మల్ డెలివరీలకు ఇన్సెంటివ్‌లు:
గతంలో సిజేరియన్లకు ఆరోగ్యశ్రీ కింద ఇన్సెంటివ్‌లు ఉండేవి. సాధారణ ప్రసవాలకు ఎలాంటి ప్రోత్సాహకం ఉండేది కాదు. అనవసర సిజేరియన్ల వల్ల కలుగుతున్న నష్టాలను గుర్తించిన మంత్రి హరీశ్‌రావు.. మొదటి నుంచీ సాధారణ ప్రసవాలను ప్రోత్సహిస్తున్నారు. దీంతో సాధారణ ప్రసవాలు గణనీయంగా పెరిగాయి. అయితే దీనిని మరింత ప్రోత్సహించేందుకు సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సిజేరియన్లకు ఇన్సెంటివ్ ఇచ్చే విధానం రద్దు చేసి.. 2022 ఆగస్టు నుంచి ‘టీమ్ బేస్డ్ ఇన్సెంటివ్’ను ప్రారంభించింది. సాధారణ డెలివరీలు చేసిన వైద్య సిబ్బందికి రూ.3000 ప్రోత్సాహం అందిస్తున్నది. దీంతో రాష్ట్రంలో అనవసర సిజేరియన్లు గణనీయంగా తగ్గగా, సాధారణ ప్రసవాలతో తల్లి ఆరోగ్యానికి భరోసా కలిగింది. మొదటి గంటలోనే ఎంతో విలువైన ముర్రు పాలను తల్లులు అందించగలుగుతున్నారు.
కేసీఆర్ న్యూట్రిషన్ కిట్…
గర్భిణుల్లో పోషకాహార లోపం, రక్త హీనత లేకుండా కాపాడేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా కేసీఆర్ న్య్రూటిషన్ కిట్స్ పథకాన్ని ప్రారంభించింది. మొదటి దశలో 9 జిల్లాల్లో ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల, కామారెడ్డి, కుమ్రంభీం ఆసిఫాబాద్, ములుగు, నాగర్‌కర్నూల్, వికారాబాద్ జిల్లాల్లో పంపిణీ చేసింది. బిడ్డ పుట్టినప్పుడు కేసీఆర్ కిట్ ఇచ్చినట్లుగానే, బిడ్డ కడుపులో ఉండగానే కేసీఆర్ న్య్రూటీషన్ కిట్స్ ఇస్తున్నది. మొత్తం 7 రకాల వస్తులు అందిస్తున్నది. దీనిని దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. మొత్తం 6.84 లక్షల మంది గర్భిణులకు ప్రయోజనం కలుగనున్నది. ఇందుకోసం బడ్జెట్లో సీఎం కేసీఆర్ రూ.250 కోట్లు కేటాయించారు.
డైట్, శానిటేషన్ చార్జీల పెంపు…
రోగులకు పౌష్టికాహారం అందించేందుకు ప్రభుత్వం డైట్ చార్జీలను రెట్టింపు చేసింది. గతంలో రూ.40 ఉండగా రూ.80కి పెంచింది. శానిటేషన్ చార్జీలను ఒక్కో బెడ్‌కు రూ.5000 నుంచి రూ.7,500కు పెంచింది. ఈ కాంట్రాక్ట్ ఏజెన్సీల్లో ఎస్సీ, ఎస్టీలకు 16 శాతం రిజర్వేషన్ కల్పించింది. హైదరాబాద్‌లోని 18 మేజర్ హాస్పిటళ్లలో రోగి సహాయకులకు రూ.5కే మూడు పూటల భోజనం అందించే కార్యక్రమాన్ని ప్రారంభించింది. రోజు సుమారు 19వేల మంది లబ్ధి పొందుతున్నారు.
బస్తీ దవాఖానలు…
ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ పరిధిలోని ప్రజలకు చిన్న చిన్న వ్యాధులు వస్తే యూపీహెచ్‌సీలు లేదా జిల్లా దవాఖానలు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లకు వెళ్లాల్సిన పరిస్థితి. అక్కడ పెద్ద లైన్లు ఉండటంతో అత్యధిక శాతం మంది ఆర్‌ఎంపీల దగ్గరికో, ప్రైవేట్ దవాఖానలకో వెళ్లి డబ్బు ఖర్చు చేసుకునేవారు. ఈ దుస్థితిని తప్పించేందుకు సీఎం కేసీఆర్ బస్తీ దవాఖానలకు రూపకల్పన చేశారు. మొదట హైదరాబాద్‌లో ప్రారంభమై, ఇప్పుడు రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో క్రమంగా ఏర్పాటవుతున్నాయి. హైదరాబాద్‌లో 350, మున్సిపాలిటీల్లో 150 కలిపి 500 బస్తీ దవాఖానల ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ధారించుకున్నది. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 400 బస్తీ దవాఖానలు సేవలు అందిస్తున్నాయి. మిగతావి ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. ఏటా సుమారు 50 లక్షల ఓపీ నమోదవుతున్నది. బస్తీ దవాఖానలతో గాంధీ, ఉస్మానియా, నిమ్స్‌పై ఓపీ భారం గణనీయంగా తగ్గింది. ఫలితంగా వైద్యులు స్పెషాలిటీ సేవలపై ఎక్కువగా దృష్టిపెడుతున్నారు.
ఎన్సీడీ స్క్రీనింగ్…
రోగాలను ముందుగా గుర్తించి, తద్వారా చికిత్స అందించేందుకు వీలుగా ర్రాష్టంలో ఎన్సీడీ ్రస్కీనింగ్ కార్య్రకమం నిర్వహిస్తున్నది. గతేడాది చివరి నాటికి 1.48 కోట్ల మందికి ్రస్కీనింగ్ జరిగింది. ఇందులో 17.36 లక్షల మందికి బీపీ, 8.86 లక్షల మందికి షుగర్ వ్యాధి ఉన్నట్లు గుర్తించారు. వారందరికి ఉచితంగా ప్రభుత్వం మందుల కిట్లను (ఎన్‌సీడీ కిట్లు) ఆశా, ఏఎన్‌ఎంల ద్వారా ఇంటికే పంపిణీ చేస్తున్నది. జిల్లా, సీహెచ్సీల్లో ్రపత్యేకంగా ఎస్సీడీ క్లినిక్స్ ఏర్పాటు చేసింది. వీటిల్లో క్యాన్సర్ స్క్రీనింగ్ కోసం ప్రత్యేకంగా పరికరాలను అందుబాటులో ఉంచింది.
ఎక్విప్మెంట్ మెయింటెనెన్స్ ప్రోగ్రాం…
ప్రభుత్వ దవాఖానల్లోని పరికరాలు నిరంతరాయంగా పనిచేసేందుకు ప్రత్యేకంగా ఎక్విప్మెంట్ మెయింటెనెన్స్ ప్రోగ్రాంను అమలు చేసింది. ఇలాంటి కార్యక్రమాన్ని ప్రారంభించడం దేశంలోనే మొదటిసారి. ఇందులో భాగంగా రూ.5 లక్షలకుపైగా విలువున్న పరికరాలను మూడు విభాగాలుగా విభజించింది. వాటి పనితీరును అనుక్షణం పర్యవేక్షిస్తున్నది. ఎక్కడైనా పరికరం పాడవుతే వెంటనే సూపరింటెండెంట్లు పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేస్తున్నారు. ఆ ఫిర్యాదు తక్షణం సంబంధిత కంపెనీకి వెళ్తుంది. నిపుణులు వచ్చి మరమ్మతులు పూర్తి చేస్తున్నారు.
పీహెచ్‌సీల్లో లైవ్ కెమెరాలు..
పీహెచ్‌సీల్లో పనితీరును మెరుగుపరిచేందుకు 887 పీహెచ్‌సీల్లో లైవ్ సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటిని కోఠిలోని డీపీహెచ్, సచివాలయంలోని హెల్త్ సెక్రటరీ కార్యాలయంలో ఉన్న కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానించారు. వీటిద్వారా ఎప్పుడైనా ఏ పీహెచ్‌సీతో అయినా అధికారులు మాట్లాడే అవకాశం కలుగుతున్నది. పనితీరును ప్రతిక్షణం పర్యవేక్షించే అవకాశం కలిగింది.
* పీహెచ్‌సీలకు వచ్చిన రోగుల చికిత్సలో అవసరమైతే స్పెషాలిటీ వైద్యుల సలహాలు తీసుకునేందుకు ప్రభుత్వం ప్రారంభించిన టెలీమెడిసిన్ కన్సల్టేషన్ సేవలు గత ఏడాది 31 లక్షల మందికి అందాయి.
* శారీరక ఆరోగ్య సమస్యలను నయం చేయడంతో పాటు, మానసిక సమస్యలకు పరిష్కారం చూపేలా 24 గంటల పాటు మానసిక వైద్యులు అందుబాటులో ఉండే, టెలీ మానస్ 14416 కాల్ సెంటర్ గతేడాది అక్టోబర్లో ్రపారంభించాం. 1027 మంది సేవలు పొందారు.
ఆరోగ్య మహిళ…
‘మహిళ ఆరోగ్యం.. ఇంటికి సౌభాగ్యం’ అని నమ్మిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మహిళల ఆరోగ్యం కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ‘ఆరోగ్య మహిళ’ పేరుతో వైద్యారోగ్య శాఖ రూపొందించిన ఈ కార్యక్రమం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నెల 8వ తేదీన ప్రారంభం అయ్యింది. కరీంనగర్‌లోని బుట్టిరాజారాం కాలనీలో ఉన్న యూపీహెచ్‌సీలో ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. మొదటి దశలో రాష్ట్రవ్యాప్తంగా 100 ్రపాథమిక ఆరోగ్య కేం్రదాల్లో ఈ కార్యక్రమం అమలవుతున్నది. తర్వాత దశల వారీగా 1200 కేంద్రాలకు విస్తరించనున్నారు. ప్రతి మంగళవారం ప్రత్యేకంగా ‘ఉమెన్ క్లినిక్’లు నిర్వహిస్తున్నారు. ప్రత్యేకంగా మహిళలకే పరీక్షలు చేస్తున్నారు. ఆడవారు ప్రధానంగా ఎదుర్కొనే 8 రకాల ఆరోగ్య సమస్యలకు వైద్యం అందిస్తున్నారు. ఇప్పటివరకు సుమారు 80 వేల మంది మహిళలు ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు.
8 రకాల పరీక్షలు ఇవే..
1. మధుమేహం, రక్తపోటు, రక్తహీనత, ఇతర సాధారణ పరీక్షలు
2. ఓరల్, సర్వైకల్, రొమ్ము క్యాన్సర్ల ్రస్కీనింగ్
3. థైరాయిడ్ పరీక్ష, సూక్ష్మ పోషకాల లోపాలను గుర్తించడం. అయోడిన్ సమస్య, ఫోలిక్ యాసిడ్, ఐరన్ లోపంతోపాటు, విటమిన్ బీ12, విటమిన్ డి పరీక్షలు చేసి చికిత్స, మందులు అందజేస్తారు
4. మ్రూతకోశ సంబంధిత ఇన్ఫెక్షన్లు, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ వ్యాధుల పరీక్షలు చేస్తారు
5. మెనోపాజ్ దశకు సంబంధించి పరీక్షలు చేస్తారు. అవసరమైన వారికి హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ చేయడంతోపాటు కౌన్సిలింగ్‌తో అవగాహన కలిగిస్తారు
6. నెలసరి సమస్యలపై పరీక్షలు చేసి వైద్యం అందిస్తారు. సంతాన సమస్యలపై ప్రత్యేకంగా పరీక్షలు చేసి అవగాహన కలిగిస్తారు. అవసరమైనవారికి ఆ్రల్టాసౌండ్ పరీక్షలు చేస్తారు
7. సెక్స్ సంబంధిత అంటువ్యాధుల పరీక్షలు చేసి అవగాహన కలిగిస్తారు. అవసరమైన వారికి వైద్యం అందిస్తారు.
8. బరువు నియంత్రణ, యోగా, వ్యాయామం వంటి వాటిపై అవగాహన కలిగిస్తారు.
వీటితోపాటు రక్తపోటు (బీపీ), మధుమేహం (షుగర్), రక్త హీనత (అనీమియా) పరీక్షలు నిర్వహిస్తున్నారు. టీ డయాగ్నోస్టిక్స్ ద్వారా 57 రకాల వైద్య పరీక్షలు చేస్తున్నారు. సమస్యలను గుర్తిస్తే, అక్కడికక్కడే తగిన మందులు ఇస్తున్నారు. అవసరమైతే పై దవాఖానలకు రెఫర్ చేస్తున్నారు.
డయాలసిస్ కేంద్రాలు…
కిడ్నీ సమస్యలు ఉన్నవారు వారానికి రెండు మూడు సార్లు డయాలసిస్ చేసుకోవాల్సి వస్తుంది. ఇది ఎంతో ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఈ వ్యాధి వారిని శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా కుంగదీస్తుంది. ర్రాష్ట ఏర్పాటుకు ముందు ఉస్మానియా, గాంధీ, నిమ్స్ మాత్రమే ఉచిత డయాలసిస్ సెంటర్లు ఉండేవి. రోగులు దూర ప్రాంతాల నుంచి ప్రయాణం చేయాల్సి వచ్చేది. సీఎం కేసీఆర్ ఈ సమస్యను మానవతా హృదయంతో ఆలోచించి ప్రతి నియోజకవర్గానికి ఒక ఉచిత డయాలసిస్ కేం్రదం ఉండేలా చర్యలు తీసుకున్నారు. దీంతో డయాలసిస్ కేంద్రాల సంఖ్యను 3 నుంచి 102 కు పెంచారు. ర్రాష్టంలో దాదాపు 12వేల మంది డయాలసిస్ చేయించుకుంటుంటే, వారిలో 10వేల మందికి ఉచితంగా ప్రభుత్వం ఆసుపత్రుల్లో డయాలసిస్ చేయించుకుంటున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆరోగ్య్రశీ ద్వారా సింగిల్ యూజ్డ్ ఫిల్టర్‌ను ఉపయోగించి డయాలసిస్ చేస్తున్నారు. డయాలసిస్ రోగులకు ఆర్థికంగా భరోసా ఇచ్చేందుకు ఆసరా పింఛను, ఉచిత బస్ పాస్ ఇస్తున్నారు.
* ఏటా 150 వరకు కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలను ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చేస్తున్నారు. ఒక్కో సర్జరీకి కార్పొరేట్ దవాఖానల్లో అయితే రూ.20 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఏటా కిడ్నీ రోగుల కోసం రూ.200 కోట్లు ఖర్చు చేస్తున్నది. ఇందులో డయాలసిస్ రోగుల కోసమే రూ.100 కోట్లు ఖర్చు ఖర్చు చేస్తున్నది.
కొత్త పీహెచ్‌సీలు…
గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు ప్రాథమికంగా వైద్యం అందించే పీహెచ్‌సీలు, సబ్ సెంటర్లను ప్రభుత్వం బలోపేతం చేసింది. ఇందులో భాగంగా 43 కొత్త పీహెచ్‌సీ భవనాలను నిర్మిస్తున్నది. ఇందుకు రూ.67 కోట్లు ఖర్చు చేస్తున్నది. దీంతోపాటు రూ.43 కోట్లతో 372 పీహెచ్‌సీల మరమ్మతులు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా 1239 సబ్ సెంటర్లకు భవనాలు నిర్మిస్తున్నది. ఒక్కోదానికి రూ.20 లక్షల చొప్పున ఏకంగా రూ.247 కోట్లకుపైగా ఖర్చు చేస్తున్నది. అదనంగా 1497 సబ్ సెంటర్ల భవనాలను రూ.60 కోట్లతో మరమ్మతులు చేయిస్తున్నది. కొత్తగా ఏర్పడిన 40 మండలాలకు పీహెచ్‌సీలు మంజూరు చేస్తూ ఇటీవలే క్యాబినెట్ ఆమోదం తెలిపింది. రికార్డు సమయంలో ఏకంగా 950 మంది సివిల్ అసిస్టెంట్ సర్జన్‌లను నియమించింది. వీరంతా గ్రామీణ ప్రాంతాల్లో సేవలు అందిస్తున్నారు. బస్తీ దవాఖానల స్ఫూర్తితో రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో మరింత మెరుగైన వైద్య సేవలను అందించాలనే లక్ష్యంతో మూడువేలకుపైగా పల్లె దవాఖానలను ఏర్పాటు చేస్తున్నది.
టీ డయాగ్నోస్టిక్స్..
వ్యాధుల నిర్ధారణలో జరుగుతున్న దోపిడీని అరికట్టేందుకు ప్రభుత్వం టీ డయాగ్నోస్టిక్స్‌ను ప్రారంభించింది. 57 రకాల రోగ నిర్ధారణ పరీక్షలను ఉచితంగా చేస్తున్నది. త్వరలో 134 రకాల సేవలు అందించేందుకు సిద్ధమైంది. రాష్ట్రంలో పీహెచ్‌సీలు మొదలు అన్ని స్థాయిల దవాఖానలను అనుసంధానం చేసింది. దీంతో పేదలు అటు చికిత్సకు, ఇటు వ్యాధి నిర్ధారణకు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా పోయింది. గత ఏడాది ప్రతిరోజూ రాష్ట్ర వ్యాప్తంగా సగటున 42 లక్షలకుపైగా టెస్టులు జరిగాయి.
ప్రజారోగ్యంపై పెరిగిన నమ్మకం…
గతంలో ఒక కుటుంబంలో ఎవరికైనా రోగం వస్తే చికిత్స కోసం రూ.లక్షలు అప్పుచేసి, ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితులు ఉండేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ప్రభుత్వ దవాఖానల్లో పేదలకు ఖరీదైన వైద్యం అందుతున్నది. ఒకప్పుడు అవయవ మార్పిడి అంటే ధనికులకే పరిమితమనే భావన ఉండేది, ఇప్పుడు తెలంగాణలో ఉచితంగా పేదలకు అవయవ మార్పిడి జరుగుతున్నది. దేశంలో అత్యధిక కిడ్నీ మార్పిడులు హైదరాబాద్‌లో జరుగుతున్నాయి. అంతేకాదు రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం పెరిగింది. ఇందుకు పెరిగిన ఓపీ, ఐపీ, సర్జరీలే నిదర్శనం.
* ఓపీ 2021లో 4.23 కోట్లు ఉండగా, గతేడాది 4.83 కోట్లుగా నమోదైంది.
* ఐపీ సేవలు 14.16 లక్షల నుంచి 16.97లక్షలకు పెరిగాయి.
* మేజర్, మైనర్ సర్జరీలు 2021లో 2.57 లక్షలు జరుగగా, 2022 నాటికి 3.04 లక్షలకు పెరిగాయి.
* ఆయుష్ విభాగంలోనూ ఓపీ గణనీయంగా నమోదైంది.
ఆయుర్వేద – 10,57,068
యునానీ – 6,55,209
హోమియోపతి – 5,51,264
నాచురోపతి – 84,079
మొత్తం – 23,47,620
నీతిఆయోగ్ హెల్త్ ఇండెక్స్ లో అగ్రస్థానం..
దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో వైద్యారోగ్య రంగం పనితీరును విశ్లేషిస్తూ కేంద్ర ప్రభుత్వ సంస్థ నీతి ఆయోగ్ 2021లో ‘హెల్త్ ఇండెక్స్’ను విడుదల చేసింది. ఇందులో ఓవరాల్ ర్యాంకింగ్స్‌లో తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది. పురోగతిలో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. పిల్లలకు వ్యాక్సినేషన్, ఆసుపత్రి ప్రసవాల పురోగతిలో తెలంగాణ దేశంలోనే టాప్‌లో నిలువడం విశేషం. నివేదిక రూపకల్పనలో భాగంగా నీతి ఆయోగ్ 24 అంశాలను పరిగనణలోకి తీసుకున్నది. శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (ఎస్‌ఆర్‌ఎస్), సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (సీఆర్‌ఎస్), హెల్త్ మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (హెచ్‌ఎంఐఎస్) వంటి పోర్టళ్లు, ఇతర మార్గాల ద్వారా సమాచారాన్ని సేకరించింది. 2019-20లో వైద్యారోగ్య రగంలో ఉత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రాల జాబితాలో తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది. ఓవరాల్ పర్ఫార్మెన్స్‌లో 100 పాయింట్లకుగానూ.. కేరళ 82.20 స్కోర్‌తో అగ్రస్థానంలో, తమిళనాడు 72.42 స్కోర్‌తో రెండో స్థానంలో నిలిచింది. తెలంగాణ 69.95 పాయింట్లు సాధించింది. ఉత్తరప్రదేశ్ కేవలం 30.57 స్కోర్ సాధించి అట్టడుగున నిలిచింది. 2018-19లో తెలంగాణ నాలుగో స్థానంలో ఉండేది. ఏడాదిలోనే తన స్థానాన్ని మెరుగుపరుచుకన్నది.
కోటిన్నర దాటిన కంటిపరీక్షలు..
నివారింపదగిన అంధత్వ రహిత తెలంగాణ సాధన కోసం సీఎం కేసీఆర్ ప్రారంభించిన కంటివెలుగు కార్యక్రమం ప్రపంచ రికార్డు సృష్టించింది. మొదటి విడత కంటివెలుగులో భాగంగా కోటిన్నర మందికి పరీక్షలు నిర్వహించారు. ప్రపంచంలోనే అతిపెద్ద సామాజిక కంటి పరీక్షల కార్యక్రమమైన ‘కంటి వెలుగు-రెండో విడత’ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ఏడాది జనవరి 18న ఖమ్మం వేదికగా లాంఛనంగా ప్రారంభించారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, కేరళ సీఎం పినరయి విజయన్, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. తర్వాతి రోజు నుంచి రాష్ట్రవ్యాప్తంగా కంటి శిబిరాలు ప్రారంభం అయ్యాయి. ఇందుకోసం ప్రభుత్వం మొత్తం 1500 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. కావాల్సిన పరికరాలన్నీ సిద్ధం చేసింది. శని, ఆదివారాలు, సెలవు రోజులు మినహా కంటి పరీక్షలు నిరాటంకంగా కొనసాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాలు, పట్టణ వార్డుల్లో శిబిరాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటివరకు సుమారు 90 శాతం పూర్తయింది. 100 రోజుల లక్ష్యం పెట్టుకోగా, రికార్డు స్థాయిలో 94 రోజుల్లోనే కోటి 60 లక్షలకు పైగా మందికి పరీక్షలు పూర్తి చేసి, 38 లక్షల మందికి కంటి అద్దాలు అందించడం జరిగింది.