జల్.. జంగల్.. జమీన్.. మావా నాటే.. మావా రాజ్. .ఇవీ ఆదివాసీ, గిరిజనుల దశాబ్దాల నినాదాలు. తాము నివసిస్తున్న అడవి.. తాము దున్నుకుంటున్న భూమి.. అడవిలోని జలం మాదే.. మా రాజ్యంలో మాకే అధికారం ఉండాలె.. ఇవీ వారు ఏండ్లుగా కోరుకొన్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణలోనే అధికంగా గిరిజనులు, గోండులు, ఆదివాసీలు ఉండగా, వారు కన్న ఒక్క కలకూడా నెరవేరలేదు. నాటి పాలకులు వారిని కేవలం ఓటుబ్యాంకుగానే చూడటంతో వారు అనాగరిక జీవనాన్ని గడిపారు. తమ హక్కుల కోసం పోరాడుతూనే ఉన్నారు. కానీ, స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ మానవీయ దృక్పథంతో వ్యవహరించి.. ఆదివాసీ, గిరిజన గూడేల్లో కొత్త వెలుగులు నింపారు. వారి ఒక్కొక్క డిమాండ్‌ను నెరవేర్చుతూ వారి దశాబ్దాల కలను సాకారం చేశారు. అధికారంలోకి రాగానే 500 జనాభా ఉన్న గిరిజన గూడేలను గ్రామ పంచాయతీలుగా మార్చేశారు. తమకు కావాల్సిన సౌకర్యాలను ఎవరినో అడుక్కోవాల్సిన గత్యంతరం లేకుండా వారికి వారే సమకూర్చుకొనేలా అధికారం కట్టబెట్టారు. గూడేలన్నీ పంచాయతీగా మారి నేటికి ఐదేండ్లు కాగా, ఆ గ్రామాలన్నీ నేడు సీఎం కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధి ఫలాలను అనుభవిస్తున్నాయి. స్వయంపాలనలో ఆదివాసీ, గిరిజనుల ఆత్మగౌరవం వెల్లివిరుస్తున్నది.
మ్యానిఫెస్టోలో పెట్టి.. మాట నిలుపుకొన్న సీఎం కేసీఆర్
తెలంగాణ వచ్చాక తండాలన్నింటినీ గ్రామ పంచాయతీలుగా మార్చేస్తానని సీఎం కేసీఆర్ ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించారు. ఆదివాసీ, గిరిజనులు కోరుకొన్నట్టే స్వయం పాలన, తండాల అభివృద్ధి చేసిచూపిస్తామని వారికి హామీ ఇచ్చారు. ఆయన ఇచ్చిన మాట ప్రకారం 2018 ఆగస్టు 1న రాష్ట్రంలోని 1,851 తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చేసి, సీఎం కేసీఆర్ తన చిత్తశుద్ధిని చాటుకొన్నారు. దీంతో 500 జనాభా ఉన్న తండాలన్నీ పంచాయతీలుగా మారిపోయాయి. ఎస్టీ రిజర్వేషన్ల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,146 మంది గిరిజనులు, ఆదివాసీలు సర్పంచ్‌లుగా ఎన్నికయ్యారు. ప్రతి తండాకు ఐదు లక్షల నిధులు ఇచ్చి.. తండాల రూపురేఖలనే మార్చేశారు. ఇప్పుడు వారి తండాల్లో వారి మనిషినే సర్పంచ్‌గా ఎన్నుకొని స్వయం పాలన ఫలాలను పొందుతున్నారు. ప్రతి గ్రామపంచాయతీలో బీటీ రోడ్లు వేశారు. ప్రతి తండాలో ట్రాక్టర్‌తో హరితహారం, పారిశుధ్య నిర్వహణ చేపడుతున్నారు. ప్రతి ఊరిలోనూ ఎల్ఈడీ లైట్లు వేశారు. ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్ పెట్టి, స్వచ్ఛమైన నీటిని సరఫరా చేస్తున్నారు. పల్లె ప్రగతిలో భాగంగా నర్సరీ, వైకుంఠ ధామం, పల్లె ప్రకృతి వనాలతో తండాలన్నీ నేడు జిగేల్‌మంటున్నాయి. సీఎం కేసీఆర్ విజన్‌తో కేవలం ఐదేండ్లలోనే ఆదివాసీ, గిరిజన గూడేల్లో ప్రగతి వెలుగులు విరజిమ్ముతున్నాయి.