తెలంగాణకు రూపాయి కూడా ఇవ్వం.. ఏం చేస్తారో చేసుకోండి.. ఇవీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో నాటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి చేసిన దురహంకార వ్యాఖ్యలు. తెలంగాణ ఏర్పడితే రాష్ట్రం చీకటి అవుతుందని కూడా ఆయన అక్కసు వెళ్లగక్కారు. అలాంటి కిరణ్‌కుమార్‌రెడ్డి.. టీబీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ప్రమాణ స్వీకార సభకు హాజరయ్యారు. తెలంగాణ ద్వేషిని ఈ సభకు ఆహ్వానించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. కిరణ్‌కుమార్‌రెడ్డిని చూసిన ఆ పార్టీ నాయకురాలు విజయశాంతి అక్కడినుంచి అర్ధంతరంగా వెళ్లిపోయారు. అనంతరం ఆమె దీనిపై వివరణ ఇచ్చారు.
తెలంగాణ ద్వేషిని టీబీజేపీ అధ్యక్షుడి ప్రమాణ స్వీకార సభలో చూసి తట్టుకోలేకపోయానని ఆవేదన వ్యక్తంచేశారు. అందుకే వెనక్కి వచ్చేశానని స్పష్టం చేశారు. విజయశాంతితోపాటు బీజేపీ కార్యకర్తల్లోని తెలంగాణవాదులు కూడా దీనిపై మండిపడ్డారు. తెలంగాణ ద్రోహిని ఈ సభకు ఎలా పిలుస్తారని.. వేదికపైకి ఎలా ఆహ్వానిస్తారని మండిపడ్డారు. తెలంగాణలో ఇప్పటికే బీజేపీకి ఆదరణ తగ్గిందని, ఇలాంటి చర్యలతో కాషాయ పార్టీ పూర్తిగా కనుమరుగయ్యే ప్రమాదం నెలకొన్నదని ఆందోళన వ్యక్తంచేశారు. కాగా, తెలంగాణ వినాశనాన్ని కోరుకొన్న నాయకుడిని తమ సభకు ఆహ్వానించిన బీజేపీ మనకు అవసరమా? అంటూ తెలంగాణవాదులు ప్రశ్నిస్తున్నారు. కిషన్‌రెడ్డి ప్రమాణ స్వీకార సభలో కిరణ్‌కుమార్‌రెడ్డి పాల్గొన్న ఫొటోనే షేర్‌చేసి, నెటిజన్లు కూడా మండిపడ్డారు.