ప్రభుత్వ దవాఖానలో ప్రసవం చేయించుకొనే నిరుపేద గర్భిణులకు ఆర్థికంగా తోడ్పాటునందించేందుకు తెలంగాణ సర్కారు కేసీఆర్ కిట్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ప్రసవం తర్వాత మహిళలకు, నవజాత శిశువులకు అవసరమైన అన్ని రకాల సదుపాయాలను కల్పించడం, వారు ఆరోగ్యకరంగా ఉండేలా చూసుకోవడం దీని లక్ష్యం. ఈ కిట్‌లో మహిళలకు, వారి పిల్లలకు కావాల్సిన 16 రకాల వస్తువులను తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నది. పుట్టిన పిల్లలు హైజీన్‌గా, సురక్షితంగా ఉండేలా కాపాడుతున్నది. ఈ కిట్‌లో పుట్టిన పిల్లలకు అవసరమయ్యే డైపర్లు, నాప్కిన్స్, టాయ్స్, దోమ తెరలు, బేబీ పౌడర్, బేబీ ఆయిల్, బేబీ సోప్ లు, పిల్లలకు కావాల్సిన బట్టలు ఉంటాయి. ఈ పథకాన్ని సీఎం కేసీఆర్ 2017 జూన్ 2న ప్రారంభించారు. మొదట రూ.605 కోట్లను కేటాయించారు. కేసీఆర్ కిట్‌తోపాటు మగ బిడ్డ పుడితే రూ.12 వేలు.. ఆడపిల్ల పుడితే రూ.13 వేలు దఫాలుగా అందజేస్తున్నారు. అయితే, ఈ పథకంలో కేంద్రం వాటా ఉన్నదంటూ టీబీజేపీ నేతలు పుకార్లు లేపారు. సోషల్‌మీడియా వేదికగా అసత్యాలు ప్రచారం చేశారు. రాష్ట్ర సర్కారు ఇస్తున్న రూ.12వేలలో ఆరు వేలు తమవే అంటూ బొంకారు. కానీ..కేంద్రంలోని బీజేపీ సర్కారే కేసీఆర్ కిట్‌లో కేంద్రం వాటా నిల్ అని ప్రకటించింది.
లోక్‌సభలో కేంద్రం ఏం చెప్పిందంటే?
తెలంగాణ సర్కారు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న కేసీఆర్ కిట్‌లో తమ వాటా రూపాయి కూడా లేదని కేంద్ర సర్కారు వెల్లడించింది. ప్రధానమంత్రి మాతృ వందన యోజన అమలుపై లోక్‌సభలో ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ సమాధానం ఇచ్చింది. కేసీఆర్ కిట్‌లో భాగంగా అందజేస్తున్న రూ.12వేలు, రూ.13వేలు, రూ.2వేల సామగ్రికి అయ్యే వ్యయాన్ని మొత్తం తెలంగాణ సర్కారే భరిస్తున్నదని వెల్లడించింది. ప్రధాన మంత్రి మాతృ వందన యోజన పథకం తెలంగాణలో మినహా అన్ని రాష్ట్రాల్లోనూ అమలవుతున్నదని తెలిపింది. దీనికింద గర్భిణులకు కేవలం ఐదు వేలు మాత్రమే అందజేస్తున్నట్టు చెప్పింది. ఈ పథకం కింద 2018-2023 వరకు అన్ని రాష్ట్రాల్లో లబ్ధిపొందినవారి జాబితాను విడుదల చేయగా.. ఇందులో తెలంగాణకు ఒక్కరూపాయి కూడా ఇవ్వలేదని తెలిపింది. కేంద్ర సర్కారు సమాధానమే కేసీఆర్ కిట్‌లో తమ వాటా ఉన్నదని ప్రచారం చేసిన టీబీజేపీ నాయకులకు చెంపపెట్టులా మారింది.