mt_logo

వాటర్ గ్రిడ్ పనులు ఇక వేగవంతం..

వాటర్ గ్రిడ్ కార్పొరేషన్ ఏర్పాటు పనులు వారం రోజుల్లో పూర్తి చేయాలని, మొదటి ఆరు గ్రిడ్ల టెండర్ల ప్రక్రియను జనవరి 30 కల్లా పూర్తి చేసి ఫిబ్రబరి 10 నుండి పనులు ప్రారంభించాలని పంచాయితీ రాజ్ శాఖామంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. అత్యంత వేగంగా గ్రిడ్ పనులు మొదలు పెట్టాలని, ఇందుకోసం ఇతర శాఖల్లో పనిచేస్తున్న ఆర్ డబ్ల్యూఎస్ అధికారుల డిప్యూటేషన్ లను రద్దు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు.

మంగళవారం ఆర్ డబ్ల్యూఎస్ కార్యాలయంలో వాటర్ గ్రిడ్ పనులపై చీఫ్ ఇంజినీర్లు, సూపరింటెండెంట్, ఇతర ఉన్నతాధికారులతో కేటీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, వచ్చే నెల నల్లగొండ జిల్లా మునుగోడులో సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్న వాటర్ గ్రిడ్ పనులకు సంబంధించి పైలాన్ డిజైన్ ను త్వరగా రూపొందించాలని అధికారులకు సూచించారు.

జిల్లాల వారీగా ఎస్ఈలతో సమీక్ష నిర్వహించి భూసేకరణ వివరాలను రెండు మూడు రోజుల్లో అందజేయాలని, 26 గ్రిడ్ ల పరిధిలో వీడియో కాన్ఫరెన్స్ తో సహా అన్ని వసతులతో కూడిన కార్యాలయాలను ఏర్పాటు చేసుకోవాలని మంత్రి అన్నారు. అసెంబ్లీ సమావేశాల అనంతరం సీఎం జిల్లాల వారీగా క్షేత్రస్థాయిలో వాటర్ గ్రిడ్ పనులను పర్యవేక్షిస్తారని, 15 రోజులకోసారి తనతో పాటు అధికారులు కూడా పర్యవేక్షిస్తారని చెప్పారు. ఆర్ డబ్ల్యూఎస్ కార్యాలయం, సీఎం, మంత్రి పేషీల నుండి ప్రాజెక్టు కార్యక్రమాలపై ఎప్పటికప్పుడు వీడియో కాన్ఫరెన్సుల ద్వారా పర్యవేక్షణ ఉంటుందని కేటీఆర్ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *