- మీడియా, వినోద రంగంలో తెలంగాణకి భారీ పెట్టుబడులు
- హైదరాబాద్ లో డెవలప్ మెంట్ సెంటర్ ఏర్పాటుచేయబోతున్న వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ
- 1,200 మందికి ఉపాధి
హైదరాబాద్ : మీడియా, వినోద రంగానికి చెందిన ప్రఖ్యాత సంస్థ వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ తెలంగాణలో పెట్టుబడి పెట్టబోతుంది. హెచ్.బి.ఓ (HBO), హెచ్.బి.ఓ మ్యాక్స్, సిఎన్ఎన్, టి.ఎల్.సి, డిస్కవరీ, డిస్కవరీ ప్లస్, డబ్ల్యూబి (WB), యూరోస్పోర్ట్, యానిమల్ ప్లానెట్, కార్టూన్ నెట్‌వర్క్, సినిమాక్స్, పోగో, టూన్ కార్ట్, హెచ్.జి.టీవీ (HGTV) తో పాటు క్వెస్ట్ వంటి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన టెలివిజన్, ఫిల్మ్, స్ట్రీమింగ్, కంటెంట్ బ్రాండ్‌లు, ఫ్రాంచైజీ లు వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ సంస్థకు చెందినవే. గేమింగ్,స్ట్రీమింగ్ తో పాటు ఎంటర్ టైన్ మెంట్ రంగంలో భారత మార్కెట్ లో ఉన్న అపార అవకాశాలను అందిపుచ్చుకునే లక్ష్యంతో హైదరాబాద్ లో డెవలప్ మెంట్ సెంటర్ ను ఏర్పాటుచేసేందుకు వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ ముందుకొచ్చింది. అమెరికా పర్యటనలో ఉన్న ఐటీ, పురపాలక శాఖ మంత్రి కే.తారకరామారావు తో వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (ఫైనాన్స్) అలెగ్జాండ్రా కార్టర్ సమావేశమయ్యారు. తమ విస్తరణ ప్రణాళికలపై చర్చించారు. ఇండియాలో తమ మార్కెట్ ను సుస్థిరం చేసుకునే లక్ష్యంతో డెవలప్ మెంట్ సెంటర్ ను ప్రారంభిస్తున్నామని అలెగ్జాండ్రా తెలిపారు. మొదటి సంవత్సరం 1200 మందికి ఉపాధి కల్పిస్తామమని, వ్యాపారం పెరిగేకొద్ది మరింతమందికి అవకాశాలు కల్పిస్తామన్నారు. వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ పెట్టుబడి ప్రకటనపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ సంస్థకు ప్రభుత్వం తరుపున సంపూర్ణ సహకారం అందిస్తామన్నారు.