mt_logo

నేటి నుంచి జీహెచ్‌ఎంసీలో వార్డు పరిపాలన – ఒకే రోజు నగరవ్యాప్తంగా 150 డివిజన్లలో వార్డ్ కార్యాలయాల ప్రారంభం

  • వార్డు కార్యాలయం ద్వారా నగర ప్రజలకు మరింత వేగంగా పౌర సేవలు
  • పౌరుల సమస్యల పరిష్కారానికి సిటిజన్ చార్టర్
  • దేశంలో సూపరిపాలన అందిస్తున్న నగరాలలో హైదరాబాద్ అగ్రస్థానం

హైదరాబాద్, జూన్ 16:  కాచిగూడలో జీహెచ్ఎంసీ  వార్డ్ కార్యాలయ వ్యవస్థను ప్రారంభించిన పురపాలక శాఖ మంత్రి కే తారక రామారావు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. ఒకే రోజు నగరవ్యాప్తంగా 150 డివిజన్ లలో వార్డ్ కార్యాలయాలను ప్రారంభించుకుంటున్నాం. వార్డు కార్యాలయం ద్వారా నగర ప్రజలకు మరింత వేగంగా పౌర సేవలు అందుతాయి. పౌర సేవలతో పాటు ప్రజా సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు జీహెచ్ఎంసీ అధికార యంత్రాంగానికి వీలు కలుగుతుంది.  వార్డు స్థాయిలో కార్పొరేటర్లు ఉన్నారు కానీ అధికార యంత్రాంగం ప్రత్యేకంగా లేకపోవడం వలన ఈ వార్డు కార్యాలయ వ్యవస్థను తీసుకురావడం జరిగిందని అన్నారు. 

నగర పౌరులకు సుపరిపాలన అందించాలన్న సదుద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టాం, రాజకీయాలకు అతీతంగా ఈ వ్యవస్థ విజయవంతానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. స్ధానిక ప్రజాప్రతినిధులు ఏ పార్టీకి చెందిన వారైనా వార్డు కార్యాలయానికి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తాము. ఈ వ్యవస్థ విజయవంతం అయితే దేశం మొత్తం ఈ వ్యవస్థను అన్ని నగరాల్లో అమలు చేసే అవకాశం ఉంది అన్నారు. ఈ వ్యవస్థ విజయవంతం అయితే దేశంలో సుపరిపాలన అందిస్తున్న నగరాల్లో హైదరాబాద్ అగ్రస్థానంలో నిలుస్తుందన్న నమ్మకం ఉందన్నారు. 

దేశంలోనే మొదటిసారిగా ఇలాంటి వ్యవస్థ మన నగరంలో 

జీహెచ్ఎంసీ అధికారులు కూడా ఎవరు ఫిర్యాదు చేసినా, ఈ వ్యవస్థ ద్వారా సత్వరం వాటి పరిష్కారానికి కృషి చేయాలని కోరుతున్నాను. వార్డు వ్యవస్థ కొత్తది అయినందువలన కొద్ది రోజుల పాటు కొన్ని సమస్యలు ఉండే అవకాశం ఉంది. అయినా సాధ్యమైనంత వేగంగా ఈ వ్యవస్థను సంపూర్ణంగా పనిచేసేలా పనిచేస్తాం. దేశంలోనే మొదటిసారిగా ఇలాంటి వ్యవస్థను మన నగరంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. వార్డు కార్యాలయానికి అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ స్థాయి అధికారి ఇన్చార్జిగా ఉంటారు.వాటి కార్యాలయంలో మొత్తం పదిమంది అధికారుల బృందం వివిధ శాఖల నుంచి పనిచేస్తుందని చెప్పారు. 

రోడ్డు నిర్వహణ, పారిశుధ్యము, ఎంటమాలజీ, హరితహారం, టౌన్ ప్లానింగ్, విద్యుత్ శాఖ, జలమండలి, ఒక కంప్యూటర్ ఆపరేటర్ ఇలా పదిమంది అధికారులు వార్డు స్థాయిలో జరిగే ఆయా శాఖల కార్యక్రమాలను పర్యవేక్షిస్తారు. వీరితోపాటు భవిష్యత్తులో ఆరోగ్య శాఖ, పోలీస్ శాఖ తరపున కూడా మరింత మంది అధికారులను వార్డు కార్యాలయానికి అనుసంధానం చేస్తాం.  కేవలం అధికారులను నియమించడమే కాకుండా, వారి విధుల నిర్వహణకు అవసరమైన అన్ని రకాల ఏర్పాట్లను చేస్తాం అన్నారు. పౌరుల సమస్యల పరిష్కారానికి నిర్ణీతమైన గడువుతో కూడిన సిటిజెన్ చార్టర్ కూడా జీహెచ్ఎంసీ ఈ వార్డు కార్యాలయం ద్వారా పౌరులకు అందిస్తుందని తెలిపారు.