mt_logo

విభజన చట్టంలో పేర్కొన్న కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ తెలంగాణకు ఇవ్వాలి: వినోద్ కుమార్

ఏపీకి ఆయిల్ రిఫైనరీ ఇస్తున్నట్లుగా.. తెలంగాణకు విభజన చట్టంలో పేర్కొన్న కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వాలి అని డిమాండ్ చేస్తూ.. తెలంగాణ భవన్‌లో ప్రెస్ మీట్ నిర్వహించిన మాజీ ఎంపీ వినోద్ కుమార్.

ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ.. బీజేపీకి కేంద్రంలో స్వంతంగా మెజారిటీ రాలేదు. టీడీపీ, జేడీయూ తదితర పార్టీల మద్దతుతో బీజేపీ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఏపీ విభజన చట్టంలో వున్న అంశాలపై చంద్రబాబు మోడీతో ఇటీవల ఢిల్లీ వెళ్ళినపుడు మాట్లాడారు అని అన్నారు.

విభజన చట్టం షెడ్యూల్ 13 లో ఉన్న పెట్రో కెమికల్, ఆయిల్ రిఫైనరీ హబ్ ఏపీకి కేంద్రం ఇస్తున్నట్లుగా ప్రముఖ పత్రికలో వార్త వచ్చింది. ఇదే షెడ్యూల్ 13 లో తెలంగాణకు కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని వుంది. పదేళ్లుగా అడుగుతున్నా తెలంగాణకు ఏమీ ఇవ్వడం లేదు అని తెలిపారు.

మేము ఏపీలో పెట్రో కెమికల్స్ రిఫైనరీ ఏర్పాటుకు వ్యతిరేకం కాదు. మాకు రావాల్సినవి కేంద్రం ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నిస్తున్నాము. తెలంగాణ నుంచి బీజేపీ తరపున ఎనిమిది మంది ఎంపీలు గెలిచారు.. తెలంగాణకు కేంద్ర క్యాబినెట్ మంత్రి, సహాయ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. చంద్రబాబుపై కేంద్రం ఆధారపడింది కాబట్టే పెట్రో కెమికల్ హబ్ ఇస్తున్నారు.. ఇక్కడ తెలంగాణపై ఆధారపడలేదు కాబట్టే ఏమీ ఇవ్వడం లేదా అని ప్రశ్నించారు.

30 ఏళ్లుగా కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కోసం పోరాటం జరుగుతోంది.. మోడీకి స్వంతంగా సీట్లు వచ్చి వుంటే ఏపీకి ఏమి ఇచ్చే వాళ్ళు కాదు. ఏపీలో ప్రాంతీయ పార్టీ గెలవబట్టే చంద్రబాబు అడిగినవి అన్నీ ఇస్తున్నారు. ఎనిమిది ఎంపీలను గెలిపించినా బీజేపీ తెలంగాణ ప్రజలకు మొండి చేయి చూపిస్తోంది అని వినోద్ కుమార్ విమర్శించారు.

తెలంగాణకు కేంద్రం ఐటీఐఆర్ ఇవ్వలేదు.. కేసీఆర్ కొత్తగా జిల్లాలు ఏర్పాటు చేస్తే ఒక్క నవోదయ విద్యాలయం కూడా ఇవ్వలేదు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో రాజకీయాల గురించి తప్ప రాష్ట్ర అభివృద్ధిపై ఒక్క చర్చ లేదు అని దుయ్యబట్టారు.

తెలంగాణ తెస్తామన్నాం తెచ్చి చూపాం.. అభివృద్ధి చేస్తామన్నాం.. చేసి చూపాం.కొన్నిసార్లు కొన్ని కారణాలతో ఓడిపోతుండవచ్చు.. రాజకీయాల్లో గెలుపు, ఓటములు ఉంటాయి.. వచ్చే ఐదేళ్ల తర్వాత బీఆర్ఎస్ బ్రహ్మాండమైన మెజారిటీతో మళ్ళీ అధికారంలోకి వస్తుంది అని ధీమా వ్యక్తం చేశారు.

అభివృద్ధి కోసమే బీఆర్ఎస్‌లో చేరుతున్నామని పార్టీ మారిన వారు అప్పుడు చెప్పారు.. ఇప్పుడు వాళ్ళు మళ్ళీ అదే చెబుతున్నారు. అలాంటి వాళ్ళు వేరే పార్టీకి పోయినా బాధపడాల్సిన పని లేదు.. పార్టీ మారిన ఎమ్మెల్యేలు తిరిగి వస్తామంటే ప్రజలే రానివ్వరు.. పార్టీలు మారే వారి పట్ల ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. త్వరలోనే సమావేశాలు పెట్టుకుంటాం.. కొత్తతరం నేతలను కేసీఆర్ ప్రోత్సహిస్తారు అని వినోద్ కుమార్ తెలిపారు.