తెలంగాణ భవన్‌లో మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎస్సారెస్పీ ఫేస్ 1, ఫేస్ 2కు నీళ్లు ఇవ్వలేము యాసంగి పంట తక్కువ వేసుకోవాలని అధికారులు చెప్తున్నారు. ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం. రైతులకు యాసంగి పంట ముఖ్యమైనది. మేడిగడ్డ ప్రాజెక్టుపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు నిర్ణయం తీసుకోవడం లేదు అని ప్రశ్నించారు.
నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చేతిలో నిర్ణయం ఉందని ప్రభుత్వం అంటోంది. డ్యామ్ సేఫ్టీ చట్టంలో ఎక్కడా ప్రాజెక్టు రిపేర్లు చేయడానికి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ పర్మిషన్ తీసుకోవాలని లేదు. వేల టీఎంసీల నీళ్లు సముద్రం పాలయ్యాయి అని అన్నారు.
రైతుల యాసంగి పంటకు చివరి తడి నీళ్లు ఇవ్వలేని పరిస్థితి వచ్చింది. మేడిగడ్డ, అన్నారం,సుందిళ్ళ బ్యారేజీలపై పూర్తి అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి సూచనలు చేసే అధికారం మాత్రమే ఉంది అని తెలిపారు.
వేల టీఎంసీల నీళ్లు వెళ్లినా మేడిగడ్డ ప్రాజెక్టుకు ఏం కాలేదు. రిక్టర్ స్కేల్‌పై 5.3 భూకంపం వచ్చినా మేడిగడ్డ ప్రాజెక్టుకు ఏం కాలేదు కేసీఆర్‌ను బద్నాం చేయడానికి మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిందని చెప్పి కాంగ్రెస్ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారు అని దుయ్యబట్టారు.
కమీషన్లు ఏం చేస్తాయి.. కమీషన్లు అన్నం పెట్టవు. పెద్ద ప్రాజెక్టు నిర్మాణంలో చిన్న తప్పులు జరగడం సహజం.. తప్పు జరిగితే చర్యలు తీసుకోండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులతో వెంటనే సమీక్ష సమావేశం నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాను అని వినోద్ కుమార్ అన్నారు.
వెంటనే మేడిగడ్డ రిపేర్ పనులు పూర్తి చేసి రైతులకు యాసంగి పంటలకు సాగునీరు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను అని అన్నారు.