mt_logo

రేవంత్‌ను అతిపెద్ద అబద్ధాలకోరుగా గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కించాలి: వేముల ప్రశాంత్ రెడ్డి

అసెంబ్లీ మీడియా హల్‌లో మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కోవా లక్ష్మీ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. రేవంత్ ప్రభుత్వం ఆసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను బుల్డోజ్ సమావేశాలుగా మార్చింది. ప్రశ్నోత్తరాల సమయం ఒక్క రోజే పెట్టారు.. జీరో అవర్ ఎత్తేశారు.. ప్రతిపక్షాల గొంతు నొక్కారు అని దుయ్యబట్టారు.

డిమాండ్లపై రెండు రోజులే చర్చ జరిపారు.. నాకు ఆర్ అండ్ బీ పద్దులపై మాట్లాడే అవకాశం రాలేదు. ద్రవ్య వినిమయ బిల్లు పూర్తి స్థాయి చర్చ లేకుండా ఆమోదించుకున్నారు. అసలు విప్పులు ప్రతిపక్ష సభ్యులతో మాట్లాడిందే లేదు అని అన్నారు.

రేవంత్‌ది ప్రజా పాలన కాదు ప్రతిపక్షాలపై పంజా విసిరే పాలన అని ఈ బడ్జెట్ సమావేశాలు నిరూపించాయి. రేవంత్ వికృత చేష్టలు ఆయన ఏడు నెలల పాలనలోనే బయటకు వచ్చాయి. ఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఒవైసీ తన 25 ఏళ్ల ఎమ్మెల్యే జీవితంలొ ఇంత అద్వాన్నపు సభ చూడలేదన్నారు. రేవంత్ రెడ్డి సభానాయకుడిగా కాకుండా ఆటవిక రాజ్యానికి రాజులా వ్యవహరించాడు అని ధ్వజమెత్తారు.

గత ప్రభుత్వం మీద ఏడుపు కేసీఆర్ మీద తిట్ల దండకం కోసం అసెంబ్లీ సమావేశాలు జరిగినట్టున్నాయి. మా సభ్యులు బాగా మాట్లాడుతున్నపుడల్లా తప్పుడు పత్రాలతో సీఎం సభకు వచ్చి చర్చను పక్క దారి పట్టించారు. ప్రజా సమస్యల చర్చకే అసెంబ్లీ సమావేశాలు జరగాలి.. ఆలా జరగలేదు అని పేర్కొన్నారు.

ఎన్నికలప్పుడు గ్యారంటీలని చెప్పి రేవంత్ అధికారంలోకి వచ్చారు.. బడ్జెట్‌లో ఆ ఊసే లేదు. చేయూత పేరిట ఇస్తామన్న రూ. 4 వేల పెన్షన్ ఊసే లేదు. మహాలక్ష్మీ కింద ఇస్తామన్న రూ. 2,500 రూపాయల ప్రస్తావన లేదు. విద్యార్థులకు ఐదు లక్షల భరోసా కార్డు ప్రస్తావన లేదు.. రైతు భరోసా లేదు. జాబ్ క్యాలెండర్‌లో జాబ్‌ల సంఖ్య లేదు. గ్యారంటీల గురించి నిలదీస్తే మమ్మల్ని రెండు సార్లు మార్షల్స్‌తో
బయటకు ఎత్తిపడేశారు అని అన్నారు.

అసెంబ్లీలో సీఎం, డిప్యూటీ సీఎంల అబద్ధాలకు లెక్కే లేదు. 30 వేల ఉద్యోగాలు ఇచ్చామని సీఎం నిండు సభలో అబద్ధాలు ఆడారు. ఒక్క నోటీఫికేషన్ ఇవ్వకుండానే ఉద్యోగాలు ఇవ్వడం ఎలా సాధ్యమో మేధావులు ఆలోచించాలి. కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్లతో ఉద్యోగాలు వచ్చాయి తప్ప.. అందులో రేవంత్ కృషి ఏముంది. సీఎంగా ఉండి ఇంత పచ్చి అబద్ధం ఆడొచ్చా అని ప్రశాంత్ రెడ్డి అడిగారు.

బడ్జెట్‌పై చర్చ సందర్భంగా మా ఎమ్మెల్యే హరీష్ రావు అప్పుల గురించి విడమరచి చెబుతుంటే.. సీఎం విద్యుత్ మీటర్లపై తప్పుడు పత్రం తెచ్చి సభను తప్పుదోవ పట్టించారు. స్మార్ట్ మీటర్లను వ్యవసాయ రంగానికి బిగించాలని కేసీఆర్ ఒప్పందం కుదుర్చుకున్నాడని అర్థం వచ్చేలా రేవంత్ అబద్ధమాడారు. అదర్ దన్ అగ్రికల్చర్ అనే పదాన్ని సీఎం ఉద్దేశపూర్వకంగా విస్మరించారు. అసెంబ్లీలో ఇంత పచ్చి అబద్దాలాడే రేవంత్ లాంటి సీఎం దేశంలో మరొకరు లేరు. రేవంత్‌ను అతిపెద్ద అబద్ధాలకోరుగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లోకి ఎక్కించాలి అని ఎద్దేవా చేశారు.

రేవంత్ సహవాసంతో డిప్యూటీ సీఎం భట్టికి అబద్దాలు ఆడే అలవాటు వచ్చింది. కేవలం రూ. 75 కోట్ల రూపాయలతో సీతారామ ప్రాజెక్టు కింద లక్షన్నర ఎకరాలకుకు నీళ్లిచ్చామని భట్టి ఘోరమైన అబద్ధం ఆడారు.. భట్టికి నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి అని చురకలు అంటించారు.

దేశంలో అతి తక్కువ రేట్లకు ప్రాజెక్టులు పూర్తి కావాలంటే భట్టిని పీఎం మోడీ తన కేబినెట్‌లోకి తీసుకోవాలి. ఇంత తప్పుడు ప్రచారమా.. ఇన్ని అబద్ధాలా? కాంగ్రెస్ సభ్యులు అసెంబ్లీని అధమ స్థాయికి తీసుకెళ్లారు. ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే పెన్షన్లు పదిహేను రోజులు లేట్ అయితే తప్పేమిటన్నారు. విద్యుత్ అరగంట పొతే తప్పేమిటన్నారు.. పేదల ఆకలిని కూడా అవహేళన చేసిన ఘనత కాంగ్రెస్ సభ్యులదే. మరో కాంగ్రెస్ సభ్యుడు వీఆర్ఓ, వీఆర్ఏలు లంచాలు తీసుకుంటే తప్పేమిటని సెలవిచ్చారు అని అన్నారు.

మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ద్రవ్యవినిమయ బిల్లుపై వాస్తవాలు చెబుతుంటే సీఎం జొక్యం చేసుకుని అనవసరంగా మహిళా ఎమ్మెల్యేలను దూషించి కంటతడి పెట్టించారు. నాలుగున్నర గంటలుగా మహిళ ఎమ్మెల్యేలు బతిమిలాడినా మైక్ దొరకలేదు.. సీఎంకు మంచి చెప్పే కాంగ్రెస్ సీనియర్లే కరువయ్యారు. మా ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డిని తిట్టించేందుకు రేవంత్ రెడ్డి కోమటి రెడ్డికి మైక్ ఇప్పించారు. కోమటిరెడ్డి అసభ్యంగా మాట్లాడిన మాటలు సమాజం గమనించింది. దానం నాగేందర్ మాతో ఉన్నపుడు బాగానే ఉన్నాడు.. అటు వెళ్ళగానే సీఎం లాగే బూతులు మాట్లాడుతున్నారు.. అసెంబ్లీ సాక్షిగా ఎమ్మెల్యేలను తోలు తీస్తా అని దానం బెదిరించారు. దానం చర్యలను సీఎం సమర్ధించేలా మాట్లాడటం సిగ్గుచేటు అని మండిపడ్డారు.

ఫిరాయింపులపై ఒత్తిడి తెచ్చి విఫలం అయినందుకే ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై వేటు వేయాలని సీఎం రేవంత్ కుట్ర పన్నారు.. రేవంత్ ఉద్దేశాలు సభా సాక్షిగా నిన్న బయటపడ్డాయి. మా సభ్యులు ఏమన్నారని బహిష్కరిస్తావ్ రేవంత్ రెడ్డి..ఆటవిక రాజుననుకుంటున్నాడు రేవంత్ రెడ్డి. నీలాగా పేగులు మెడలో వేసుకుంటా, కనుగుడ్లతో గోటీలు ఆడుతా అని మా ఎమ్మెల్యేలు అనలేదే ? ఎందుకు బహిష్కరిస్తావ్ అని ప్రశ్నించారు.

రైతు రుణమాఫీపై ఊదరగొట్టి ఏం సాధించారు. 30 వేల కోట్ల రూపాయలు అన్నారు.. పన్నెండు వేల కోట్లు విడుదల చేశారు. రైతు రుణమాఫీకి డబ్బులు లేవు కానీ మూసీ రివర్ ఫ్రంట్‌కు లక్షన్నర కోట్లు ఖర్చు పెడతారట.. మూసీకి ఎన్నికలపుడు రూ. 50 వేల కోట్లు అన్నారు, మంత్రి రూ. 70 వేల కోట్లు అన్నారు, ఇప్పుడు సీఎం రూ. లక్షా 50 వేల కోట్లు అంటున్నారు. కేసీఆర్ హయాంలో రూ. 16 వేల కోట్ల రూపాయలతో మూసి రివర్ ఫ్రంట్‌ను అభివృద్ధి చేయాలనుకున్నాం.. అదిప్పుడు రూ. లక్షా 50 వేల కోట్లకు ఎలా పెరుగుతుంది? అని ప్రశాంత్ రెడ్డి అడిగారు.

ఆసరా పెన్షన్లను నాలుగు వేల రూపాయలు చేయడానికి సీఎం దగ్గర డబ్బు లేదు కానీ మూసీకి రూ. లక్షా యాభై వేల కోట్లు ఉన్నాయట. సీఎం రేవంత్ తన ఆడంబరాల అబద్ధాలకు అసెంబ్లీకి వాడుకున్నారు.. జాబ్ కేలండర్‌పై ఊదరగొట్టి అసెంబ్లీలో ఏం చేశారు.. కేసీఆర్ లక్షా 63 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చి లక్షా 30 వేల ఉద్యోగాలు ఇచ్చారు. జాబ్ క్యాలెండర్‌కు అసెంబ్లీలో చర్చించి చట్టబద్ధత ఇస్తామని రాహుల్ గాంధీ చెప్పారు.. చర్చ లేకుండా స్టేట్మెంట్‌కే పరిమితం అయ్యారు. జాబ్ క్యాలెండర్‌లో జాబ్‌లు ఏవీ అని ఫైర్ అయ్యారు.

జూన్ 2 న జాబ్ క్యాలెండర్‌ ఇస్తామన్నారు.. సెప్టెంబర్ 17 లోగా ఉద్యోగాల భర్తీ చేస్తామన్నారు. అన్నిటిపై మాట తప్పారు.. నిరుద్యోగులను వంచించింది, మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇవన్నీ అడిగితే సీఎం అసెంబ్లీలో అపరిచితుడయ్యారు ? కేసీఆర్ సలహాదారులను నియమించుకుంటే తప్పుబట్టిన రేవంత్ రెడ్డి ఇపుడు ఎందుకు నియమించుకున్నారు ? ఎవడబ్బ సొమ్మని రేవంత్ రెడ్డి సలహాదారులను నియమించుకున్నారు అని అడిగారు.

ప్రభుత్వ ప్రకటనలకు విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెడుతున్నారని అప్పుడు రేవంత్ కేసీఆర్‌ను తప్పుబట్టారు.. ఎవడబ్బ సొమ్మని ఇపుడు ఇస్తున్నావ్.. అపరిచితుడిలా మారావా ? రైతు రుణమాఫీ చారాణా అయితే బారాణా ప్రకటనలకే ఖర్చు పెడతావా.. పంజాబ్‌లో రైతులకు కేసీఆర్ సాయం చేస్తుంటే తప్పుబట్టావ్.. ఈరోజు వయనాడ్‌కు ఎందుకు ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు ఎందుకు పంపుతున్నావ్ రేవంత్ రెడ్డి… అపరిచితుడు అయ్యావా అని ధ్వజమెత్తారు.

ఈ అసెంబ్లీ సమావేశాలతో ప్రజలకు ఉపయోగపడే పని ఒక్కటి జరగ లేదు.. కనీసం వచ్చే సమావేశాలనైనా బాగా నడపండి.. స్పీకర్ ఇందుకు చొరవ చూపాలి అని కోరారు